ఈస్టరు 7వ వారము - శనివారము (II)

ఈస్టరు 7వ వారము - శనివారము
అ.కా. 28:16-20, 30-31; యోహాను. 21:20-25

ధ్యానాంశము: ధ్యానం - దేవునితో సహవాసం
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “యేసు చేసిన పనులు ఇంకను ఎన్నియో కలవు. వానిలో ప్రతిదానిని వివరించి వ్రాసినచో అట్టి గ్రంథములకు ఈ ప్రపంచమే చాలదని నాకు తోచుచున్నది” (యోహాను. 21:25).
ధ్యానము: పేతురు భవిష్యత్తు గురించి ప్రభువు ప్రవచింపగనే, యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను భవిష్యత్తును గూర్చి తెలుసుకోవాలని అనుకొని పేతురు, “ప్రభూ! ఇతని విషయమేమి?” (యోహాను. 21:21). అని అడిగాడు. అందుకు యేసు, “అది నీకేమి? నీవు నన్ను వెంబడింపుము” (21:22) అని పలికెను. ఇది శిష్యుల లేక నాయకుల మధ్య పోటీతత్వమా! అనాధి క్రైస్తవ సంఘాలలో, విశ్వాసులు వారి నాయకులను బట్టి విభజింప బడినారు. కొరింతు సంఘములో ఈ వర్గముల గురించి స్పష్టముగా తెలుపబడినది (1 కొరి. 1:10-17). నేడు, మన సంఘాలలో కూడా ‘వివిధ కారణాల వలన’ వర్గములు ఏర్పడుచున్నవి. క్రీస్తునందు విశ్వాసములో అందరము ఒక్కటే అని గుర్తించుదాం.

యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను ఒక్కడే వేదసాక్షి మరణాన్ని పొందలేదు. తన చివరి కాలమును ధ్యానములో గడిపారు. ప్రభువు మరల తిరిగి వచ్చువరకు, త్రిత్వైక సర్వేశ్వరుని ప్రేమ సహవాసములో జీవించడానికి ధ్యానం ఉత్తమైన మార్గం. ‘మౌనం’ లేదా ‘నిశ్శబ్దం’ దేవుని ప్రధమ భాష. ధ్యానం, ప్రార్ధన, ఆధ్యాత్మికత, అంత:ర్గత మౌనములోనికి నడిపిస్తాయి. అప్పుడు, అనుదిన జీవితములోని పరిశుద్ధాత్మ కదలికలను గుర్తించగలం. ఆ ఆత్మ మనలను శుద్దీకరించును, పవిత్రులుగా చేయును. ప్రియ శిష్యులు ప్రభువు వక్ష:స్థలమున ఉండువారు, అనగా త్రిత్వైక దేవుని సహవాసములో జీవించువారు. ధ్యానం, ప్రార్ధన శక్తిద్వారా క్రీస్తుకు సాక్షులుగా జీవించాలి. పౌలు బహిరంగముగా, నిరాటంకముగా దేవుని రాజ్యమును గురించి ప్రభువైన యేసుక్రీస్తు గురించి వారికి బోధించుచుండెను (అ.కా. 28:31).

No comments:

Post a Comment