10వ సామాన్య ఆదివారము, పెంతెకోస్తు పండుగ, Year C

 10వ సామాన్య ఆదివారము, పెంతెకోస్తు పండుగ, Year C
అ.కా. 2:1-11, 30-31; 1 కొరి. 12:3-7, 12-13; యోహాను. 20:19-23

ధ్యానాంశము: పవిత్రాత్మ – దేవుని శ్వాస
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: మీకు శాంతి కలుగునుగాక! (యోహాను. 20:19)
ధ్యానము: పవిత్రాత్మ వాగ్ధానము: నేడు పవిత్రాత్మ పండుగ. శ్రీసభకు ఎంతో శుభదినము! పవిత్రాత్మ మనపై వేంచేసిన రోజు. దైవీక జీవితము మానవ హృదయాలలోనికి ప్రవేశించిన రోజు! తల్లి శ్రీసభ జనించిన రోజు! దేవుని రక్షణ కార్య గొప్ప ఫలితమే పరిశుద్ధాత్మ దిగిరావడం! “పెతకోస్తు” అనగా “50” అని అర్ధము. హీబ్రూలో రుహఅనగా ఆత్మఅని సమానార్ధం. ఈ పదానికి గాలి, శ్వాస, పవనంఅనే మూలార్ధాలు ఉన్నాయి. ఇది దేవుని శ్వాస. మీతో ఎల్లప్పుడు ఉండుటకు మరొక ఆదరణ కర్తను (‘ఒకరి పక్షాన నిలిచేవాడు’) తండ్రి మీకు అనుగ్రహించును. నేను మిమ్ము అనాధలుగా విడిచి పెట్టను (యోహాను. 14:16, 18) అని యేసు శిష్యులకు వాగ్దానం చేసారు. అలాగే, తనకు సాక్ష్యులుగా ఉండమని తన శిష్యులను ఆహ్వానించారు (15:26-27; 16:7). ఎందుకన, వారు ఆయనతో జీవించారు, ఆయన జీవితాన్ని, ప్రేషిత కార్యాన్ని పంచుకొని యున్నారు. ఆయన బోధనలను ఆలకించి యున్నారు. ఆయన అద్భుతాలలో పాలుపంచుకున్నారు.

పవిత్రాత్మ రాకడ - శ్రీసభ పరిచర్య:  (అ.కా. 2:1-11): ప్రభువు వాగ్ధానము చేసిన విధముగనే, యూదుల పవిత్రాత్మ పండుగ రోజున, “వారు పవిత్రాత్మతో నింపబడిరి” (అ.కా. 2:4). వారు ఉత్థానక్రీస్తు ఆత్మతో నింపబడ్డారు. పవిత్రాత్మ శక్తి శిష్యులపై వేంచేసి యున్నది. ఆత్మ అగ్నిజ్వాలలు నాలుకలవలెవ్యాపించి, ఒక్కొక్కరిపై నిలిచింది. ప్రభువు కోరినట్లుగనే, ఆత్మశక్తితో ఆయన జీవితానికి, శ్రమలకు, మరణానికి సాక్ష్యులయ్యారు. పవిత్రాత్మ రాకతో, శ్రీసభ ప్రేషిత కార్యము ఈ లోకమున ఆరంభమైనది. ఇదియే శ్రీసభ జననం! భయముతోనున్న విశ్వాసులు ధైర్యాన్ని పొందారు. నిస్సహాయ స్థితిలోనున్నవారి విశ్వాసం బలపడింది. పవిత్రాత్మను పొందినవారు ధైర్యముతో యెరూషలేములోను, పలుచోట్లలోను దైవవాక్యమును బోధించారు.

యేసు దర్శనము శాంతి, శ్వాస (పవిత్రాత్మ): యోహాను 20:19-23 ప్రకారం, శిష్యులు పవిత్రాత్మను క్రీస్తు ఉత్థానమైనరోజే పొందారు. ఆదివార సమయమున యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసికొని ఉన్నపుడు, యేసు వచ్చి వారిమధ్య నిలువబడి, “మీకు శాంతి కలుగునుగాక!అనెను. శాంతి” (షాలోం) ‘సంతోషముగానుండుట’, సకలాన్ని కలిగియుండుట’, అనగా సంతానం, సంపద, పాడిపంటలు, నిర్భయముగా నిద్రపోవుట; శత్రువులపై విజయాన్ని పొందుట. శాంతియనగా తనతోతాను, ఇతరులతో, ప్రకృతితో సమాధానముగా ఉండుట. లోతైన భావం ఏమిటంటే, ‘దేవునితో సమాధానముగానుండుట’ (న్యాయా. 6:24). యేసు ఒసగిన శాంతిశిష్యులలోని భయాన్ని తీసివేసి, సంపూర్ణ సంతోషాన్ని ఇచ్చినది. యేసు శాంతి మనలను స్వతంత్రులను చేయును. “శాంతి” ఉత్థాన క్రీస్తు ఒసగు గొప్ప బహుమతి. తన శ్రమలు, మరణ, ఉత్థానముచే దేవునితో లోకము సార్వత్రిక సఖ్యతను పొందటమే క్రీస్తు శాంతి. ప్రభువు ప్రేషిత కార్యము, శిష్యుల ప్రేషిత కార్యము ఒక్కటే! నేడు, మన ప్రేషిత కార్యము కూడా అదియే! సృష్టి ఆరంభములో దేవుడు శ్వాసను ఊది మానవున్ని తన పోలికలో సృజించాడు. ఈనాడు, క్రీస్తు తన శ్వాసను ఊది, ఓ నూతన సృష్టిని రూపొందించాడు. క్రీస్తులో మనముకూడా ఓ నూతన సృష్టి. సోదరప్రేమ, క్షమాపణ (యోహాను. 20:23) క్రీస్తు సందేశములో ముఖ్యాంశాలు. ఇదే సందేశాన్ని మనము కొనసాగించాలని ప్రభువు కోరుచున్నారు.

No comments:

Post a Comment