ఈస్టరు 7వ
వారము - శుక్రవారము
పునీత చార్లెస్ ల్వాంగా & సహచరులు
అ.కా. 25:13-21; యోహాను. 21:15-19
ధ్యానాంశము: మంచి కాపరి ఆదర్శం
ధ్యానమునకు ఉపకరించు
వాక్యములు: యేసు, సీమోను పేతురుతో, “యోహాను పుత్రుడవైన సీమోను! నీవు నన్ను వీరందరి కంటె
ఎక్కువగ ప్రేమించుచున్నావా?” అని అడిగెను (యోహాను 21:15).
ధ్యానము: యేసు మంచి కాపరి. మంచి
కాపరి అయిన యేసును ఆదర్శముగా తీసుకొని, ప్రేమ, సంరక్షణను, తన ప్రజల కాపరులుకూడా చూపాలని దేవుడు కోరుకుంటున్నారు. శ్రీసభ నాయకత్వము గురించి, పేతురుకు కూడా ఉత్థాన క్రీస్తు సవాలు విసిరాడు: “నీవు నన్ను
ప్రేమించుచున్నావా?” అని మూడుసార్లు అడిగాడు. “అవును ప్రభూ! నేను నిన్ను
ప్రేమించుచున్నాను” అని పేతురు చెప్పినప్పుడు, “నీవు నా గొర్రెపిల్లలను మేపుము” (యోహాను. 21:15), “నా గొర్రెలను కాయుము”
(21:16), “నా గొర్రెలను మేపుము”
అని ప్రభువు
కాపరి బాధ్యతలను అపోస్తలులకు అప్పగించారు. దీనినిమిత్తమై, పేతురు వేదసాక్షి
మరణాన్ని పొందుతాడని ప్రభువు ప్రవచించారు (21:18-19).
“దేవుడు ప్రేమస్వరూపుడు” (1
యోహా. 4:16). ఆయన ప్రేమ అనంతమైనది, శాశ్వతమైనది. క్రైస్తవ ప్రేమ ఇట్టిదే! నేడు, జగద్గురువులు, మేత్రాణులు,
విచారణ
గురువులు, ప్రభుత్వాధికారులు, తల్లిదండ్రులు... కాపరులుగా సఫలమవ్వాలంటే, మొదటిగా ప్రేమ, అంకితభావం ఉండాలి. నిజమైన నాయకుడు, తన వారికొరకు తన సర్వాన్ని అర్పిస్తాడు. అంకితభావము కలిగిన
నాయకులు, సమర్ధత, నిబద్ధత, పవిత్రత,
మారుమనస్సు
అను లక్షణాలను కలిగి ఉంటారు. రెండవదిగా, జ్ఞానం కలిగి యుండాలి. నిజమైన నాయకుడు తన ప్రజలను ఎరిగియుంటాడు (యోహాను.
10:3). మూడవదిగా, ఆదర్శముగా ఉండాలి. నాయకులు
సంఘములో వారి మాటలద్వారా,
చేతలద్వారా
ఇతరులకు ఆదర్శముగా ఉండాలి. గురువులు ప్రజలకు, తల్లిదండ్రులు పిల్లలకు, బోధకులు విద్యార్ధులకు... ఆదర్శముగా ఉండాలి.
నేడు ఉంగాండా వేదసాక్షులు పునీత
చార్లెస్ ల్వాంగా, వారి సహచరులను స్మరించుకుంటున్నాము. వారి విశ్వాసం ఎంతోమందికి
ఆదర్శమైంది. 19వ శతాబ్దములో క్రైస్తవ విశ్వాసం కొరకు వేదసాక్షి మరణాన్ని పొందారు.
వీరి విశ్వాసమును మాతృకగా స్వీకరించి ప్రజలు విరివిగా క్రీస్తును నమ్మి
విశ్వాసులయ్యారు.
No comments:
Post a Comment