ఈస్టరు 7వ
వారము - గురువారము
పునీత మర్సెల్లిన్, పునీత పీటర్
అ.కా. 22:30, 23:6-11; యోహాను. 17:20-26
ధ్యానాంశము: వేదసాక్ష్యము - క్రైస్తవ ఐఖ్యత
ధ్యానమునకు ఉపకరించు
వాక్యములు: “ఓ తండ్రీ! నేను నీ యందును, నీవు నా యందును ఉండునట్లు వారిని మనయందు
ఉండనిమ్ము” (యోహాను. 17:21)
ధ్యానము: యేసు కేవలం, తన అపోస్తలుల
కొరకు మాత్రమేగాక, ఆయనను విశ్వసించు వారందరి కొరకు తండ్రిని ప్రార్ధించారు.
ముఖ్యముగా, వారి సంపూర్ణ ఐఖ్యత కొరకు ప్రార్ధించారు. కేవలం, ‘కలిసి మెలిసి ఉండాలి’
అనే ఐఖ్యత మాత్రమే కాదు. “మన వలె వారును ఒకరుగ ఐఖ్యమై ఉండనిమ్ము” (యోహాను. 17:22).
త్రిత్వైక సర్వేశ్వరుడు ముగ్గురు వ్యక్తులు: పిత, పుత్ర, పవిత్రాత్మ. ఆ ముగ్గురు
వ్యక్తుల మధ్యనున్న ఐఖ్యత క్రీస్తు విశ్వాసుల మధ్య ఉండాలి. ఆ ఐఖ్యత దేవునితో
సాన్నిహిత్యము, సహవాసము. విశ్వాసుల ఐఖ్యత రెండింటికి సాక్ష్యం ఇవ్వాలి: ఒకటి, పిత
దేవుడు, యేసును పంపాడని లోకము విశ్వసించుటకు (17:21). రెండు, దేవుడు యేసును
ప్రేమించినట్లుగా, వారినికూడా ప్రేమించారని లోకము తెలిసికొనుటకు (17:23). త్రిత్వం,
ప్రేమ, ఐఖ్యత యొక్క పరమ రహస్యం. త్రిత్వైక దేవునిలో ప్రేమ, ఐఖ్యత
కలిగి, సోదరభావముతో మనము జీవించాలి. సమస్త క్రైస్తవుల ఐఖ్యత కొరకు, కుటుంబ ఐఖ్యత
కొరకు ప్రార్ధన చేద్దాం. లోకములో క్రీస్తుకు సాక్షులమవుదాం!
నేడు వేదసాక్షులు పునీత
మర్సెల్లిన్, పునీత పీటర్ మన ఆదర్శం. వీరు గొప్ప క్రైస్తవ భక్తులు. దియోక్లేషియన్
చక్రవర్తి వేదహింసలలో క్రీ.శ. 304లో ఇరువురు శిరోచ్చేదనం చేయబడ్డారు. మర్సెల్లిన్
ఒక గురువు. చెరలోనున్నప్పుడు తన విశ్వాసం, ప్రార్ధన, బోధనలతో చెరలోనున్న వారందరినీ
క్రైస్తవులుగా మార్చారు. అనేకమంది జ్ఞానస్నానము పొందారు. పీటర్ యేసు నామమున దుష్ట
దయ్యాలను పారద్రోలే గొప్ప భక్తుడు.
No comments:
Post a Comment