13వ సామాన్య ఆదివారము, Year C

13వ సామాన్య ఆదివారము, Year C
1 రాజు. 19:16, 19-21; గలతీ. 5:1, 13-18; లూకా. 9:51-62

ధ్యానాంశము: క్రైస్తవ లక్షణము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “నాగటి మీద చేయి పెట్టి వెనుకకు చూచువాడు ఎవ్వడును దేవుని రాజ్యమునకు యోగ్యుడు కాడు” (లూకా. 9:62).
ధ్యానము: నేటి సువిషేశములో రెండు సంఘటనలను చూస్తున్నాము. మొదటిగా, తండ్రి దేవుని చిత్తమును నెరవేర్చుటకు తన యెరూషలేము ప్రయాణములో, సమరీయులు యేసును ఆయన శిష్యులను ఆహ్వానింపరైరి. అప్పుడు, శిష్యులు యాకోబు, యోహానులు “ప్రభూ! మేము ఆకాశమునుండి అగ్నిని రప్పించి, వీరిని నాశనం చేయుమని ఆజ్ఞాపించుట నీకు సమ్మతమా?” (ఏలియా మాటలు 2 రాజు. 1:10, 12) అని అడిగిరి. ఆవేశపడటం, కోపపడటం, పగ, ప్రతీకారం, హింస క్రైస్తవ లక్షణాలు కావు. సువార్తను తిరస్కరించువారిపై కోపపడక, నిందించక సాధుస్వభావము కలిగియుండటం క్రైస్తవ లక్షణం. జెబదాయి కుమారులైన యాకోబు, యోహానులకు యేసు “బొవనేర్గెసు” అని పేరు పెట్టాడు. దీనికి “ఉరిమెడివారు” అని అర్ధము (మార్కు. 3:17).

రెండవదిగా, ముగ్గురు వ్యక్తులు యేసును తన ప్రయాణములో వెంబడిస్తామని చెప్పారు. కాని వారికి కొన్ని షరతులు ఉండటం వలన అనుసరించలేక పోయారు. మొదటివాడు యేసును వెంబడిస్తే సర్వము లభిస్తాయని ఆశించాడు. కాని యేసు చెప్పిన సమాధానానికి, తను ఆశించినది లభించదని తెలిసుకొని అక్కడనుండి వెళ్ళిపోయాడు. యేసును అనుసరించడానికి లోక సుఖాలు అవసరము లేదు. క్రైస్తవ జీవితం కూడా ఇలాంటి త్యాగాలతో కూడుకున్నది. దేవునిపై ఆధారపడి జీవించాలి. రెండవ వ్యక్తిని, స్వయముగా ప్రభువే “నన్ను అనుసరింపుము” అని ఆహ్వానించారు. కాని అతడు తన తల్లిదండ్రులపట్ల బాధ్యతలు నెరవేర్చి వస్తానని వెళ్ళిపోయాడు. ప్రభువు దైవరాజ్యమునకు మొదటి స్థానం ఇవ్వాలని కోరారు. మూడవ వ్యక్తి, “ప్రభూ! నేను మిమ్ము అనుసరింతును కాని, మొదట నా కుటుంబములోని వారికి చెప్పి వచ్చెదను, సెలవిండు” అని చెప్పి వెళ్లి మరల తిరిగి రాలేదు. దేవుని పిలుపు అన్నింటికన్న ప్రాధాన్యమైనది. మనం వెంటనే ఎలాంటి షరతులు లేకుండా దైవపిలుపుకు స్పందించాలి. దైవసేవలో దృఢసంకల్పం ఉండాలి, సాకులకు చోటులేదు. పిలుపులో త్యజింపు, త్యాగం ఉంటుంది, షరతులు లేకుండా క్రీస్తును అనుసరించడం, ఆయనకు సేవ చేయడం క్రైస్తవ లక్షణం. మొదటి పఠనములో ఎలీషా మనకు ఆదర్శం. ఏలియా పిలవగానే ఎలీషా అతన్ని వెంబడించారు. ఏలియాకు శిష్యుడై అతనికి సేవలు చేసారు. అంకితభావం, నిబద్ధత ఎలీషాలో చూడవచ్చు.

“స్వతంత్రులుగా జీవించుటకై క్రీస్తు మనకు విముక్తి కలిగించెను.” ప్రతీ ఒక్కరము స్వతంత్రులుగా ఉండుటకై పిలువబడినాము అని పౌలు అంటున్నారు. నిజమైన స్వేచ్ఛ ఒకరికి ఒకరు ప్రేమతో సేవ చేయడం. అంతేగాని, శారీరక వ్యామోహములకు లొంగి, మన ఇష్టం వచ్చినట్లు జీవించడం స్వేచ్ఛ కాదు. స్వేచ్ఛ సేవకులుగా ఉండుటకు! మనం అనుకునే స్వేచ్ఛ వేరేకదా? ధర్మశాస్త్ర మంత కలసి “నిన్ను నీవు ప్రేమించుకొనునట్లే నీ పొరుగు వానిని ప్రేమింపుము” అను ఒక్క మాటలో నెరవేరియున్నది. దైవ సేవ-సోదర సేవలో నిజమైన స్వతంత్రము ఉన్నది. ఇది నిజ క్రైస్తవ లక్షణం.

No comments:

Post a Comment