13వ సామాన్య సోమవారము – పునీత
అలెగ్సాండ్రియా సిరిల్
ఆమో. 2:6-10; మత్త. 8:18-22
ధ్యానాంశము: దైవ పిలుపు
ధ్యానమునకు ఉపకరించు
వాక్యములు: యేసు “నీవు నన్ను వెంబడింపుము. మృతులను సమాధి చేయు విషయము మృతులనే
చూచుకొననిమ్ము” (మత్త. 8:22) అని పలికెను.
ధ్యానము: ధర్మశాస్త్ర బోధకుడు యేసును
సమీపించి, “బోధకుడా! నీవు ఎక్కడకు వెళ్ళినను నీ వెంట వచ్చుటకు సంసిద్ధుడను” అని
అన్నాడు. మొదటి శతాబ్దపు యూదులలో ధర్మశాస్త్ర బోధకుడు ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా
చదివినవాడు, దానిని వివరించేవాడు. ఈ ధర్మశాస్త్ర బోధకుడు యేసు బోధనలను, కార్యాలను
కళ్ళారా చూసాడు. తన సర్వాన్ని యేసుకు అంకితం చేసి అనుసరించడానికి సిద్ధపడ్డాడు. నిజమైన
శిష్యరికం యేసుకు సంపూర్ణముగా నిబద్ధత కలిగి అనుసరించడం. యేసు ప్రేషిత కార్యములో
భాగస్థులు కావడం. యేసు పేదరికములో, శ్రమలలో, పాలుపంచుకోవడం. యేసును మన మాటలద్వారా
కాక, చేతలద్వారా అనుసరించాలి. ఇంకొకడు తన తండ్రిని సమాధిని చేసి వస్తాను, అనుమతి
ఇవ్వండి అని అన్నాడు. యేసును అనుసరించాలని మనకి ఉంటుంది కాని సంపూర్ణముగా అనుసరించడానికి
సిద్ధపడము. మనకు అనుకూలమైన విధముగా ప్రవర్తిస్తూ ఉంటాము. చాలా సందర్భాలలో, యువకుడైన
ధనికునివలె ప్రవర్తిస్తూ ఉంటాము. సర్వం దానం చేసి తనను అనుసరింపుమని యేసు కోరినప్పుడు,
ఆ యువకుడు అధిక సంపద గలవాడగుటచే, ఈ మాట విని బాధతో వెళ్ళిపోయాడు. పరలోక రాజ్యములో
చేరాలని, రక్షణ పొందాలని అనుకుంటాము, కాని పవిత్రులుగా జీవించడానికి సిద్ధపడము. దేవుని
రాజ్యములో షరతులకు తావు లేదు. దేవుని పట్ల, సోదరుల పట్ల అనంతమైన ప్రేమ కలిగి
జీవించాలి. ఎలాంటి షరతులు లేకుండా ప్రభువును అనుసరించాలి. అన్ని సమయాలలో,
పరిస్థితులలో దేవునిపై విశ్వాసము కలిగి జీవించాలి. సంపూర్ణమైన అంకిత భావమును
ప్రభువు కోరుచున్నారు.
బిషప్, శ్రీసభ పండితుడు, మతసాక్షి పునీత అలెగ్జాండ్రియ సిరిల్ (క్రీ.శ. 376-444) గారిని నేడు స్మరించుకుంటున్నాము. అతను తప్పుడు బోధనలను, క్రైస్తవ సత్యాలను వక్రీకరించి చెబుతున్న దేవాలయాలన్నింటికి తాళం వేయించారు. మరియ తల్లి ‘దేవుని మాత’ అని బోధించి లోకానికి తెలిసేట్లు చేసారు. అలాగే, త్రిత్వైక సర్వేశ్వరుని పరమరహస్యాన్ని తేటతెల్లం చేసారు.
No comments:
Post a Comment