12వ సామాన్య శనివారము – నిష్కళంక
మాత మహోత్సవము
యెషయ 61:9-11; లూకా. 2:41-51
ధ్యానాంశము: నిష్కళంక హృదయం
ధ్యానమునకు ఉపకరించు
వాక్యములు: “తల్లి మరియమ్మ ఆ విషయములన్ని మనస్సున పదిల పరచుకొని ఉండెను” (లూకా 2:51).
ధ్యానము: “సుందరమైన గులాబీ పువ్వు
ముండ్ల మొక్క మీద వికసిస్తుంది. తల్లి చెట్టు కంటే మిక్కిలి సుందరమైనది. తల్లి
చెట్టులాగా ముళ్ళులేనిది కూడా. అలాగే, ‘మరియ’
అనే సుందరమైన పుష్పం ఏవ అనబడు ముండ్ల మొక్కమీద వికసించింది. దోషరహితయై ఆ తొలి కన్య
పాపానికి ప్రాయశ్చిత్తం చేసింది (సెడూలియస్ అనే 5వ శతాబ్దపు లాటిన్ కవి). లోకసృష్టికి
పూర్వమే దేవుడు మరియను సుతుడైన సర్వేశ్వరునికి తల్లిగాను, పితయైన సర్వేశ్వరునికి ప్రియ కుమార్తెగాను, పవిత్రాత్మ సర్వేశ్వరునికి మిత్రురాలుగాను, పాపములేకుండా అనగా నిష్కళంకగా
ఉద్భవింప చేసారు. మరియతల్లి అందరిలాగే ఆదాము సంతానములో జన్మించారు. కాని ఆమెకు
జన్మపాపము సోకలేదు. భవిష్యత్తులో జన్మించబోయే క్రీస్తు వరప్రసాదాలద్వారా దేవుడు
ముందుగానే మరియతల్లిని జన్మపాపం సోకకుండా పదిలపరిచారు. తనద్వారా ఈ లోకంలో
అడుగిడబోయే రక్షకుడైన యేసుక్రీస్తు, లోకానికి ప్రసాదించబోయే రక్షణ ఫలమును
దైవానుగ్రహంతో మరియతల్లి ముందుగానే అందుకని జన్మపాప, కర్మపాప దోషమునుండి విడుదల పొందారు. పాపపు కళంకము అంటని పావనమూర్తిగా
మరియతల్లి ఈ లోకంలో జన్మించారు. మానవ రక్షణ మహత్కార్యాన్ని దేవుడు మరియతల్లిని
జన్మపాపమునుండి విముక్తురాలను చేయడం ద్వారానే ఆరంభించారు. నిష్కళంక మరియతల్లి
ద్వారానే పాపపు కళంకితమైన మానవజాతిని శుద్ధికరించి, రక్షణ భారాన్ని ప్రసాదించాలన్నది దేవుని ప్రణాళిక. “హృదయ శుద్ధిగలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు (మత్త. 5:8). సంపూర్ణ హృదయశుద్ధితోనే భగవత్ దర్శనం సాధ్యం. దేవుని
వరప్రసాదలను మన జీవితాలలో నింపుకోవాలి అంటే మన హృదయం కూడా మరియతల్లి హృదయంవలె నిష్కళంకముగా
ఉండాలి. మరియమాత ప్రేమమూర్తి, దేవునిపట్ల
ప్రగాఢమైన ప్రేమగల పుణ్యమూర్తి. ఆ తల్లి అంతరంగంలో జ్వలించే ప్రేమాగ్ని జ్వాలలు
పాపపు ఆశలను కూడా దరిచేరనివ్వవు. కనుకనే పాపపు కళంకమెరుగని పావనాత్మురాలుగా
జీవించి ధన్యులయ్యారు. ఆమె బిడ్డలమైన మనం కూడా అదే బాటలో నడవాలి అన్నది ఆ తల్లి
ప్రగాఢమైన కోరిక.
No comments:
Post a Comment