13వ సామాన్య బుధవారము – పునీత పేతురు, పౌలుల మహోత్సవము (II)

13వ సామాన్య బుధవారము – పునీత పేతురు, పౌలుల మహోత్సవము
అ.కా. 12:1-11; 2 తిమో. 4:6-8, 17-18; మత్త. 16:13-19

ధ్యానాంశము: ఘన అపోస్తలులు
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు” (మత్త. 16:16).
ధ్యానము: పేతురు చెరసాలలో నున్నప్పుడు, క్రీస్తు సంఘము ఆయన కొరకు పట్టుదలతో దేవుని ప్రార్ధించింది. అప్పుడు దూత అతనిని చెరసాలనుండి (మరణము నుండి) విడిపించెను (అ.కా. 12:1-12). కొన్ని సం.ల తరువాత, రోము నగరములో పేతురు మరల చెరసాలలో నున్నప్పుడు, క్రీస్తు సంఘము తప్పక అతని కొరకు ప్రార్ధన చేసి యుండవచ్చు. కాని, ఈ సారి అతను తన మరణమును తప్పించు కొనలేక పోయెను. చెరసాల నుండి విముక్తుడైనందుకు పేతురు వీరుడు’ (హీరో) కాలేదు. కాని, తన ప్రాణమును త్యాగము చేసినందులకు, వేదసాక్షి మరణము పొందినందులకు వీరులయ్యారు. పేతురు చెప్పిన విశ్వాస సత్యము అతని జీవితమునే మార్చి వేసింది: నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు” (మత్త. 16:16). అందుకు ప్రభువు, “యోనా పుత్రుడవగు సీమోను! నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియ జేసినది పరలోక మందున్న నా తండ్రియే కాని, రక్తమాంసములు కావు (16:17) అని అన్నారు. ‘ధన్యత’ అనగా సంతోషము. ఈ ధన్యతకు/సంతోషమునకు కారణం, యేసు సజీవుడగు దేవుడుఅని గుర్తించడం. పేతురు తన జీవితములో, తన హృదయములో యేసును సజీవ దేవుడిగా నిలుపుకున్నారు. అందుకే యేసు, “నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింప జాలవు” (16:18) అని అన్నారు.

యేసును దేవునిగా, ప్రభువుగా అంగీకరించిన పౌలు (అ.కా. 9:10-20), క్రీస్తు సువార్త కొరకు తనను తాను సంపూర్ణముగా అర్పించుకొని, క్రీస్తు కొరకు సర్వమును పూర్తి నష్టముగా పరిగణించారు, సమస్తమును విడనాడారు, అన్నింటిని చెత్తగా భావించారు (ఫిలిప్పీ. 3:8). క్రీస్తు సువార్తకు ప్రచారకునిగా మారారు. తన లేఖలద్వారా క్రీస్తు బోధనలను ముఖ్యంగా దేవరహస్యములను, దైరాజ్యమును గూర్చిన పరమ రహస్యములను విశదపరచారు. పౌలు గొప్ప పండితుడు, వేదాంతి, బోధకుడు, కాపరి, నాయకుడు, ‘అపోస్తలుడు’, ఉత్సాహపూరితుడైన మిషనరీ, మార్మికుడు, పునీతుడు, క్రీస్తు సేవకుడు, క్రైస్తవ రచయిత. పౌలు తాను పొందిన ఈ దైవపిలుకు, దైవ ప్రేషిత కార్యానికి కట్టుబడి యున్నారు. ఏ విషయములోను రాజీ పడలేదు. అబద్ధపు బోధకులను ధైర్యముగా ఎదుర్కొన్నారు (గలతీ. 2:4). క్రీ.శ. 49లో జరిగిన యెరూషలేము సమావేశములో తన వాదనలను వినిపించి క్రైస్తవత్వమును యూద మూలాల నుండి స్వతంత్రము గావించుటకు తనవంతు కృషి చేసారు (అ.కా. 15; గలతీ. 2:1-10). నీరో చక్రవర్తి పాలనలోని హింసలలో, క్రీ.శ. 64-68సం.ల మధ్యకాలమున పౌలును విచారణ జరిపించి, మరణ శిక్ష విధించారు. సంప్రదాయం ప్రకారం, పౌలు క్రీ.శ. 67లో వేదసాక్షి మరణం పొందారు.

No comments:

Post a Comment