13వ సామాన్య మంగళవారము – పునీత ఇరేనియ లియోన్సు (II)

13వ సామాన్య మంగళవారము – పునీత ఇరేనియ లియోన్సు
ఆమో. 3:1-8, 4:11-12; మత్త. 8:23-27

ధ్యానాంశము: భయం – విశ్వాసం
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “గాలి, సముద్రము సయితము ఈయన ఆజ్ఞకు లోబడినవి. ఈయన ఎంతటి మహానుభావుడు!” అని జనులు ఆశ్చర్యపడిరి (మత్త. 8:27).
ధ్యానము: “ప్రభూ! మేము నశించు చున్నాము, రక్షింపుము” అని శిష్యులు ప్రార్ధింపగా, నిదురించుచున్న యేసు లేచి గాలిని, సముద్రమును గద్ధించగా, వెంటనే ప్రశాంతత చేకూరింది. ముందుగా, “ఓ అల్ప విశ్వాసులారా! మీరు భయపడెదరేల?” అని వారిలోని అవిశ్వాసాన్ని గద్ధించారు. ప్రభువు వారితోనే పడవలో ఉన్నారు, కాని శిష్యులు ప్రభువుతో లేరు. దేవుడు సర్వాంతర్యామి. ఆయన అంతటా ఉంటాడు. అది దైవసాన్నిధ్యం. అయితే, మనం ఆ దేవుని సాన్నిధ్యములో ఉన్నామా అన్నది కూడా చాలా ముఖ్యం. ప్రభువునందు విశ్వాసము లేనప్పుడు, ఉండేది భయమే!

నేడు ‘నిదురించుచున్న’ మన విశ్వాసమును పరిశీలించు కోవాలి. శ్రీసభ అను పడవలో ప్రభువు ఎల్లపుడు మనతోనే ఉన్నారు. కష్టాలలో, అవమానాలలో, సమస్యలు, సంక్షోభాలలో ప్రభువును విశ్వసించాలి. శ్రీసభను ఎప్పటికి నాశనం కానివ్వరు. “నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింప జాలవు” (మత్త. 16:18) అని ప్రభువు చెప్పియున్నారు. ప్రభువు సాన్నిధ్యములో ఉన్నవారికి కూడా కష్టాలు వస్తాయని అర్ధమగుచున్నది. బహుశా, మన విశ్వాసాన్ని బలపరచుటకే! మన ప్రతీ కష్టములో దేవుడు ప్రేమ, ఆప్యాయతతో మనలను గమనిస్తూనే ఉన్నారు. కనుక, మన జీవితములోని అలజడులలో, ప్రభువు తప్పక మనలను తీరం దాటేస్తారని దృఢవిశ్వాసం మనలో ఉండాలి. ఆయన మనకు నిజమైన శాంతిని, ప్రశాంతతను ఒసగును. “శాంతిని మీకు అనుగ్రహించు చున్నాను. నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకము వలె నేను ఇచ్చుట లేదు. మీ హృదయములను కలవర పడనీయకుడు. భయపడనీయకుడు” (యోహాను. 14:27). ఈ అంత:ర్గత శాంతి నిత్యమైనది. “క్రీస్తు ప్రసాదించెడి శాంతి మీ హృదయములను పరిపాలింపనిండు. ఏలయన, ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరముగ ఉండ పిలువ బడితిరి” (కొలొస్సీ. 3:15)

బిషప్పు, శ్రీసభ పితామహుడు, వేదసాక్షి పునీత ఇరేనియ లియోన్సు (క్రీ.శ. 130-202) గారిని నేడు స్మరించు కుంటున్నాము. వేదహింసలలో ‘రహస్య గురువు’గా పనిచేయడానికి ఫ్రాన్సు దేశమునకు పంపబడినారు. అక్కడే బిషప్పుగా 24సం.లు నిస్వార్ధముగా సేవలు అందించారు. మొట్టమొదటి క్రైస్తవ సత్యోపదేశ సంక్షేపాన్ని సంభాషణల రూపంలో అర్ధమయ్యేలా రాసారు. ‘శాంతి స్థాపకుడు’గా పేరు తెచ్చుకున్నారు.

No comments:

Post a Comment