13వ సామాన్య గురువారము – రోమునగర
శ్రీసభలో మొదటి వేదసాక్షులు
ఆమో. 7:10-17; మత్త. 9:1-8
ధ్యానాంశము: “తండ్రీ! వారిని క్షమించుము”
ధ్యానమునకు ఉపకరించు
వాక్యములు: యేసు వారి విశ్వాసమును గమనించి, ఆ రోగితో, “కుమారా! ధైర్యము వహింపుము. నీ
పాపములు పరిహరింపబడినవి” (మత్త. 9:2) అని పలికెను.
ధ్యానము: నేడు ప్రభువు ఒక
పక్షవాతరోగిని స్వస్థపరచుచున్నారు. పక్షవాతరోగిని కొంతమంది యేసు వద్దకు తీసుకొని
వచ్చిరి. యేసు వారి విశ్వాసాన్ని గమనించారు. అందుకు పక్షవాతరోగితో, “కుమారా!
ధైర్యము వహింపుము. నీ పాపములు పరిహరింపబడినవి” అని పలికారు. శారీరక స్వస్థత
కలగాలంటే, ముందుగా ఆధ్యాత్మిక స్వస్థత కలగాలి అని అర్ధమగుచున్నది. పాపము
చేసినప్పుడు, మనం అంత:రంగిక పక్షవాత రోగాన్ని కలిగియున్నవారమే! అయితే, యేసు
పాపములను క్షమించుట కొందరు ధర్మశాస్త్రబోధకులు విని, “ఇతడు దైవదూషణము
చేయుచున్నాడు” అని తమలోతాము అనుకున్నారు. దేవున్ని అవమానిస్తున్నాడని వారు
భావించారు. ఎందుకనగ, దేవుడు మాత్రమే పాపములను క్షమించు అధికారమును కలిగియున్నాడు.
మానవ మాత్రులమైన మనము ఇతరుల పాపములను క్షమించే అధికారము లేదు అని వారి నమ్మకం. అయితే,
మనం దేవునిచేత మన్నింప బడినాము కనుక ఒకరినొకరము క్షమించుకోవాలి. మనం ఎందుకు
క్షమించాలి? ఇతరులను క్షమించినప్పుడు, మనకే ఎక్కువగా మేలు జరుగుతుంది.
క్షమించనప్పుడు, బాధ, కోపం, భయం, నిరాశ మనలో బలపడుతుంది. అవి మనకే కీడును
తలపెడతాయి. క్షమించుటలో క్రీస్తే మనకు గొప్ప ఆదర్శం. ఆయన ఏ తప్పు చేయకపోయినను
మనందరి పాపాల నిమిత్తమై సిలువపై కొట్టబడ్డారు. “తండ్రీ! వారిని క్షమించుము” అని సిలువలో
నుండి దేవుని ప్రార్ధించారు.
నేడు రోమునగర శ్రీసభలో మొదటి వేదసాక్షులను స్మరించుకుంటున్నాము. క్రీస్తుకోసం, రక్తతర్పణ చేసిన వేదసాక్షులు. క్రీ.శ. 64లో నీరో చక్రవర్తి కాలములో అమాయకులైన ఎంతోమందిని క్రూరముగా హింసించబడ్డారు. క్రీ.శ. 95లో డొమిషియన్ చక్రవర్తి కాలములో క్రీస్తును విశ్వసిస్తే నేరం అన్నట్లు శాసనం చేసి క్రైస్తవులను పీడించి చంపబడ్డారు. క్రీ.శ. 107లో ట్రాజన్ చక్రవర్తి క్రైస్తవులను చిత్రహింసలు పెట్టి చంపాడు. క్రీ.శ. 135లో హెడ్రియన్ చక్రవర్తి క్రీ.శ. 180లో ఔరేలియన్ చక్రవర్తి అదే బాటలో నడిచారు. మరల క్రీ.శ. 222లో సెప్తిమన్ సెవెరన్ చక్రవర్తి, క్రీ.శ. 257లో వలేరియన్ చక్రవర్తి, క్రీ.శ. 303లో డియోక్లేషియన్ చక్రవర్తి, క్రైస్తవులను హింసించారు. వీరు చిందించిన ప్రతీ రక్తపు బొట్టు క్రైస్తవ విశ్వాస బీజాలుగా నాటుకున్నాయి.
No comments:
Post a Comment