12వ సామాన్య మంగళవారము – పునీత అలోషియసు గొంజాగ (II)

12వ సామాన్య మంగళవారము – పునీత అలోషియసు గొంజాగ
2 రాజు. 19:9-11, 14-21, 31-36; మత్త. 7:6, 12-14

ధ్యానాంశము: జీవ ద్వారము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “ఇతరులు మీకేమి చేయవలెనని మీరు కోరుదురో, దానిని మీరు పరులకు చేయుడు. ఇదియే మోషే ధర్మశాస్త్రము; ప్రవక్తల ప్రబోధము” (మత్త. 7:12).
ధ్యానము: ఇరుకైన మార్గము జీవమార్గము. మన జీవిత అంతిమ గమ్యం, అర్ధం - రక్షణ. “మానవుడు లోకమంతటిని సంపాదించి, తన ప్రాణమును కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? (మత్త. 16:26). మన ప్రాణమును, జీవితాన్ని, ఆత్మను, రక్షించుకోవాలంటే, మన జీవిత గమ్యాన్ని చేరుకోవాలంటే, ప్రభువు చెప్పిన, తన జీవితము ద్వారా చూపిన ఇరుకైన మార్గములో పయనించాల్సిందే! మన జీవితములో, సరియైన నిర్ణయాలను తీసుకొని, ఇరుకైన మార్గమున పయనించాలి. అనగా, ఇహలోక ఆలోచనలనుగాక, సంపదలనుగాక, అధికారమునుగాక, ఎల్లప్పుడూ దేవుని మార్గమును ఎంచుకోవాలి. మనలను మనం త్యజించుకొని, దేవుని అనుగ్రహమునకు సహకరించాలి. పాపపు వాంఛలను విడనాడాలి. దేవునితోను, తోటివారితోను సఖ్యతను కలిగియుండి, మంచి కారణానికై, మంచి పనులను చేయడము, మన పేరు, ప్రతిష్టలనుగాక, దైవరాజ్యమును, నీతిని వెదకాలి, పాప జీవితానికి పశ్చాత్తాపపడాలి, విధేయత, వినయము, నీతి న్యాయము, సత్యములతో జీవించాలీ. ఈ విధముగా, ప్రార్ధన ద్వారా, ఇరుకైన మార్గమున ప్రవేశించుటకు, ప్రయాసపడవలయును. ఇదియే, పరలోకరాజ్య ప్రవేశమార్గము. ఇంకోమాటలో చెప్పాలంటే, మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధమునైన మూలధర్మమును జీవించడం: “ఇతరులు మీకేమి చేయవలెనని మీరు కోరుదురో, దానిని మీరు పరులకు చేయుడు” (మత్త. 7:12).

నేడు రాజవంశములో జన్మించి పునీతుడైన గురువు, మతసాక్షి, యువజన పాలకుడు అలోషియసు గొంజాగ (క్రీ.శ. 1568-1591) వారిని స్మరించు కుంటున్నాము. పునీతుల గాధలను చదివి మారుమనస్సు పొందారు. తన 17వ ఏట ‘యేసు సభ’లో చేరి, 19వ ఏటనే తన గురుత్వ ప్రథమ వ్రతాలను స్వీకరించారు. క్రీ.శ. 1591లో ప్లేగు వ్యాధి వ్యాపించినపుడు, రోగులకు అహర్నిశలు సేవలు చేసారు. ఆ వ్యాధితోనే, కేవలం 22 ఏళ్ల ప్రాయములో మరణించారు. పరలోక సంపదలపై ఎల్లప్పుడు ఆసక్తి చూపిన అలోషియసు గొంజాగ మనకు ఆదర్శం.

No comments:

Post a Comment