12వ సామాన్య సోమవారము (II)

12వ సామాన్య సోమవారము
2 రాజు. 17:5-8, 13-15, 18; మత్త. 7:1-5

ధ్యానాంశము: తీర్పు – ఇతరులను సరిచేయుట
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు. అప్పుడు మిమ్ము గూర్చి అట్లే తీర్పు చేయబడదు. మీరు ఏ కొలతతో కొలిచెదరో ఆ కొలతతోనే మీకును కొలువబడును” (మత్త. 7:1,2).
ధ్యానము: పరులను గూర్చి మనం తీర్పు చేసినప్పుడు, దేవుడు మనకు తీర్పు చేస్తారు. పరులను గూర్చి తీర్పు చేయడం మానివేయాలి, అప్పుడు అంతిమ దినమున దేవుని తీర్పు మనపై ఉండదు. మరి, ఇతరులు పాపము చేయునప్పుడు, మనం ఎలా స్పందించాలి? వ్యక్తిపై తీర్పుగాక, ఆ వ్యక్తిచేసే కార్యాలను సరిచేయాలి. ఎందుకంటే, సోదరులను సరిచేయుట సామాజిక బాధ్యత. అయితే, తప్పులను నివారించడానికి, సరిచేయుటలో నెమ్మది వహించాలి. ఇతరులను అన్యాయముగా విమర్శింప కూడదు. దేవుడు సఖ్యతపడే వరమునే మనకు ఒసగాడు కాని ఖండించమని కాదు. “దేవుడు క్రీస్తుద్వారా మనుష్యులనందరిని తనతో సఖ్యపరచు కొనుచున్నారు. ప్రజల పాపములను వారిపై మోపక ఆయన అట్లు చేయుచున్నారు” (2 కొరి. 5:19). ఇతరులను దేవునితో సఖ్యపరచు ప్రేషిత కార్యము మనకు ఒసగబడినది. కనుక, “ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసి కొనుము. అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగా నుండును” (మత్త. 7:5). చూపు స్పష్టముగా నుండవలయునంటే, కంటిలోని దూలమును, నలుసును తీసివేయవలయును. ప్రతీ ఒక్కరు అంత:రంగికముగా శుద్ధిపొందాలని, మారుమనస్సు పొందాలని ప్రభువు బోధిస్తున్నారు. మన కంటిలోని దూలమును గమనింపనిచో, మన సోదరుల కంటిలోని నలుసును వ్రేలేత్తి చూపలేము. సోదరులను సరిచేయడం మంచిదే, కాని సరి చేయాలంటే, ముందు మనము సరిగా ఉండవలయును. తననుతాను సరిచేసుకోలేనివాడు, ఇతరులను సరిచేయలేడు. అలా చేయువారిని ప్రభువు, వంచకులని, కపట భక్తులని, అంధులని, అవివేకులని చెప్పుచున్నారు. ఏది ఏమైనప్పటికిని, ఇతరులను పక్షపాతముతో తీర్పు చేయరాదు. సహోదర భావముతో ఇతరులను వారిని వారిగా అంగీకరించి, సహోదర సమూహమును ఏర్పాటు చేయవలయును. అంత:రంగిక శుద్ధి ఇతరులను మన్నించి, ప్రేమించేలాగున చేయును.

No comments:

Post a Comment