12వ సామాన్య బుధవారము – పునీత పౌలినుస్ నొల, పునీత జాన్ ఫిషర్, పునీత తోమాస్ మోర్ (II)

12వ సామాన్య బుధవారము – పునీత పౌలినుస్ నొల, పునీత జాన్ ఫిషర్, పునీత తోమాస్ మోర్
2 రాజు. 22:8-13, 23:1-3; మత్త. 7: 15-20

ధ్యానాంశము: కపట ప్రవక్తలు
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “కపట ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడు. వారి ఫలముల వలన వారిని మీరు తెలిసి కొనగలరు” (మత్త. 7:15, 20).
ధ్యానము: కపట ప్రవక్తల గురించి జాగ్రత్త పడమని ప్రభువు హెచ్చరిస్తున్నారు. వారు తోడేళ్ళ వంటివారు. గొర్రెల చర్మము కప్పుకొని మనలను మోసం చేసెదరు. కపట ప్రవక్తలను తెలుసుకోవాలంటే, వారి కార్యాలను గమనించాలి. లోకం దృష్టిలో మంచిదైన ఫలం, దేవుని దృష్టిలో మంచి ఫలం కాకపోవచ్చు. మంచివారు మంచి పనులనే చేయుదురు. దేవునకు, సువార్తకు వారు వ్యతిరేకం. ప్రవక్తలు దేవుని మాటను, దేవుని చిత్తాన్ని ప్రజలకు తెలియజేసేవారు. చెడును ఖండించేవారు. కాని, కపట ప్రవక్తలు ప్రజలను తప్పు త్రోవలో నడిపిస్తారు. వీరు తమనుతాము మోసము చేసుకొనేవారు (యిర్మీ. 23); అసత్యవాదులు. యేసును ‘క్రీస్తు’గా అంగీకరించనివారు (1 యోహా. 2:22); విశ్వాసానికి భిన్నముగా బోధించువారు (1 యోహా. 2:19); అపహాసకులు, వ్యామోహములను అనుసరించువారు (2 పేతు. 3:3); దైవదూషణ చేయువారు. క్రీస్తును తిరస్కరించి అవినీతికర ప్రవర్తనను సమర్ధించుటకు అపార్ధములు కల్పించువారు, స్వార్ధపరులు, నిలకడలేనివారు (యూదా. 1:4,10,12,13); మోసగించువారు (మార్కు. 13:22); దేవుని గూర్చిన సత్యమగు జ్ఞానమును తిరస్కరించువారు, సర్వవిధములగు దుష్టత్వముతోను, దుర్గుణములతోను నిండియుందురు, దైవద్వేషులు, అవివేకులు, ఆడి తప్పువారు, పాషాణ హృదయులు, నిర్ధయులు (రోమీ. 1:28-31). ఇలాంటివారి గురించి మనం జాగ్రత్త పడాలి. అదేసమయములో, ఇలాంటి స్వభావాన్ని మనం ఎన్నటికీ అలవర్చుకొన కూడదు. ఎందుకన, జ్ఞానస్నానము ద్వారా మనము కూడా క్రీస్తు గురుత్వము, ప్రవక్త, రాజరికములో అభిషేకించ బడినాము. క్రీస్తుకు ప్రవక్తగా నేను జీవిస్తున్నానా? మన జీవితము, కార్యాలద్వారా క్రీస్తుకు సాక్ష్యమిస్తున్నామా? “దేవుని కరుణకు, గొప్ప శక్తికి కృతజ్ఞతలు. నా మనస్సాక్షికి వ్యతిరేకముగా ఎట్టిదియును నేను సమ్మతించలేదు” (పునీత తోమాస్ మోర్). 

No comments:

Post a Comment