12వ సామాన్య గురువారము – బప్తిస్మ యోహాను జన్మదినం (II)

12వ సామాన్య గురువారము – బప్తిస్మ యోహాను జన్మదినం
యెషయ 49:1-6; అ.కా. 13:22-26; లూకా. 1:57-66, 80

ధ్యానాంశము: బప్తిస్మ యోహాను
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “ఆ బాలుడు వృద్ధిచెందుచు ఆత్మయందు బల సంపన్నుడాయెను” (లూకా. 1:80).
ధ్యానము: అద్భుతరీతిన యోహాను జన్మించినపుడు, ‘ఈ పసిబాలుడు ఎట్టివాడగునో!’ (లూకా. 1:66) అని ప్రజలు మనసులో అనుకొనిరి. అలాగే, యోహాను జననం లోకరక్షకుని రాకకు సంకేతమైనది. ఆయన బోధనలు, హెచ్చరికలు ప్రజలలో స్పూర్తిని రగిలించి ప్రేరణ కలిగించాయి. ఎంతోమందిని దైవబాటలోనికి నడిపించాయి. యోహాను మాతృగర్భంలోనే పవిత్రాత్మతో పరిపూర్ణంగా నింపబడ్డాడు. జన్మ, కర్మ పాపములు శుద్ధిచేయబడి జన్మించాడు. “నేను తల్లి కడుపున పడినప్పటినుండియు ప్రభువు నన్నెన్నుకొని తన సేవకునిగా నియమించెను” (యెషయ 49:1). మనం జన్మించకమునుపే, దేవుడు మనలను మన పిలుపును ఎన్నుకొని యున్నాడు. ఇది యిర్మియా (యిర్మి. 1:5), బప్తిస్మ యోహాను (లూకా. 1:15), యేసు (లూకా. 1:31), పౌలు (గలతీ. 1:15) జీవితములలో నిరూపితమైయున్నది. యోహాను ప్రవక్తలలో గొప్పవాడు. పవిత్రాత్మ దేవుడు తనద్వారా ప్రవక్తల ప్రవచనాలను పరిపూర్ణం చేసారు. యోహాను వెలుగునకు సాక్ష్యమీయ వచ్చారు. యెషయా ప్రవక్త తెలియపరిచిన విధంగా రక్షకుని రాక గురించి ప్రజలకు తెలియజేసి వారిని ఆత్మీయంగా సిద్ధంచేయడానికి దేవుడు యోహానును ఎన్నుకున్నారు (యెషయ 40:3). “అతడు నాకు పదునైన కత్తివంటి వాక్కు నొసగెను” (యెషయ 49:1). ప్రవక్తలు దేవుని వాక్కును ప్రవచించారు. దైవప్రజలు ఆలకించారు. వారు ప్రవక్తలద్వారా, దైవసందేశమును వినియున్నారు. “ఇదిగో! లోకము యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల” (యోహాను. 1:29) అని యోహాను యేసును ప్రజలకు పరిచయం చేసారు. రెండవ పఠనములో, దావీదు, యోహాను, యేసును గూర్చి పౌలు బోధిస్తున్నారు. దేవుడు దావీదును అభిషేకించి, ఆయన వంశమునుండి మెస్సయ్యను పంపియున్నారు. మెస్సయ్యా అనగా అభిషేకించబడినవాడు. ఇలా దేవుడు ఇస్రాయేలు ప్రజలకు చేసిన వాగ్ధానమును నెరవేర్చాడు. ఈ వాగ్ధానమునకు సాక్ష్యముగా, ఈ ప్రవచనాల పరిపూర్ణత కొరకు బప్తిస్మ యోహాను పంపబడినాడు. యోహాను యేసు రాకను ఆగమనం చేసారు. యేసు రాకతో, యోహాను ప్రవక్త కార్యము ముగిసినది.  యోహానువలె ఆ వెలుగునకు సాక్ష్యమీయుటకు మనముకూడా పిలువబడి యున్నాము. యేసు మనకు చేసిన కార్యముల గూర్చి, ఒసగిన దీవెనల గూర్చి సాక్ష్యమిద్దాం! ఈ లోకానికి ప్రభువు ఒసగిన రక్షణకు సాక్ష్యమిద్దాం!

No comments:

Post a Comment