11వ సామాన్య గురువారము
సీరా. 48:1-14; మత్త. 6:7-15
ధ్యానాంశము: క్షమాగుణం
ధ్యానమునకు ఉపకరించు
వాక్యములు: “మా యోద్ధ అప్పుపడిన వారిని మేము క్షమించినట్లు, మా అప్పులను క్షమింపుము. పరులు
చేసిన దోషములను మీరు క్షమించిన యెడల, పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను
క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను
క్షమింపడు” (మత్త. 6:12, 14-15).
ధ్యానము: ప్రార్ధన చేసేప్పుడు, అన్యులవలె
వ్యర్ధమైన పదాలతో ప్రార్ధింప వలదని, యూదులవలె కపటముతో ప్రార్ధింప వలదని చెప్పిన
నేపధ్యములో, యేసు తన శిష్యులకు ‘పరలోక ప్రార్ధన’ నేర్పించారు. యూదులు రోజుకు
మూడుసార్లు ప్రార్ధన చేసేవారు. బోధకులు (రబ్బీలు) ప్రతీ సందర్భానికి ఒక ప్రార్ధన
చేసేవారు. అయితే, యేసు తన శిష్యులు ఇలాంటి యాంత్రికమైన, అర్ధంలేని ప్రార్ధన
చేయకూడదని హెచ్చరించారు (మత్త. 6:7-8). ప్రార్ధనలో పదాలతోపాటు చిత్తశుద్ధి, దేవునిపై
నమ్మకం, విశ్వాసం ఉండాలి. దేవునితో లోతైన సహవాసములోనికి ప్రవేశించాలనేదే క్రైస్తవ
ప్రార్ధన ఉద్దేశ్యం. ‘పరలోక ప్రార్ధన’ ద్వారా మనం దేవున్ని ఎలా ప్రార్దించాలో యేసు
నేర్పిస్తున్నారు. దేవుడు మన తండ్రి. “దేవుని నుండి మీరు దత్తపుత్రత్వము నొసగు
ఆత్మను స్వీకరించితిరి. ఆ ఆత్మద్వారా మనము దేవుని ‘అబ్బా! తండ్రీ! అని పిలుతుము. ఆ
ఆత్మయే మన ఆత్మతో కలిసి మనము దేవుని పుత్రులమని సాక్ష్యమిచ్చును” (రోమీ. 8:15-16).
‘పరలోక ప్రార్ధన’ వ్యక్తిగత ప్రార్ధనకన్న, ఒక సంఘ ప్రార్ధన. తల్లి శ్రీసభతో ఏకీభవిస్తూ
చేసే ప్రార్ధన. ఈ ప్రార్ధనలో, దేవుని క్షమను పొందాలంటే, ఇతరులను క్షమించడం ఎంత
అవసరమో యేసు నొక్కి చెప్పారు (6:14-15). ఇది పరస్పరము షరతులు లేని క్షమ. క్షమించడం
అంత సులువుకాదు. క్షమించడంకన్న ద్వేషించడం చాలా సులువు. అందుకే క్షమించడం
దైవత్వంతో సమానం. పరస్పరం క్షమించుకోవడం వలన సంఘాలు ఐఖ్యతగా, ప్రేమగా నిలుస్తాయి. అప్పుడు
దేవుని నామము పవిత్రపరప బడును, ఆయన రాజ్యము, చిత్తము పరలోకమందు నెరవేరునట్లు
భూలోకమందు నెరవేరుతుంది. ‘పరలోక ప్రార్ధన చేసినపుడెల్ల, క్షమా వరము కొరకు ప్రార్ధన
చేద్దాం.
No comments:
Post a Comment