11వ సామాన్య శనివారము (II)

11వ సామాన్య శనివారము
2 రా.ది.చ. 24:17-25; మత్త. 6:24-34

ధ్యానాంశము: దేవునిపై ఆధారపడుట
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “మొదట దేవుని రాజ్యమును, నీతిని వెదకుడు. అప్పుడు అన్నియు మీకు అనుగ్రహింపబడును (మత్త. 6:33).
ధ్యానము: ఆందోళన (వెత, కలత) చెందకుడు (మత్త. 6: 25, 31, 34) అని ప్రభువు చెప్పుచున్నారు. నేడు మనం ఎన్నో విషయాలపట్ల ఆందోళన కలిగి జీవిస్తున్నాము. అట్లయిన, మనం దేవునిపై ఆధారపడి జీవించడము (విశ్వాసము, నమ్మకము) లేదని అర్ధం. ఆందోళన వలన మనకు ఎంతో కీడు కలుగుతుంది: ఆందోళన మన ఆలోచనలను వక్రీకరించును, మన పనికి అంతరాయం కలిగించును, మన ఆత్మను అసంతృప్తిపరచును, మన శరీరాన్ని భంగపరచును, మన ముఖాన్ని అందవిహీనముగా మార్చును. ఆందోళన మన స్నేహితులను నాశనం చేయును, మన జీవితాన్ని నిరుత్సాహ పరచును. మన విశ్వాసాన్ని విచ్చిన్నం చేయును, మన శక్తిని బలహీన పరచును. ఎందుకు కలత చెందకూడదో ప్రభువు స్పష్టం చేసారు: మనలో ప్రాణాన్ని సృష్టించిన దేవుడు మన సర్వాన్ని ఆయనే చూసుకుంటారు (6:25); రేపటి గురించి కలత చెందితే, నేటి ప్రయత్నాలు విఫలమవుతాయి (6:26); ఆందోళన మనకు ఎక్కువ హానిని కలుగచేస్తుంది (6:27); తనపై ఆధారపడే వారిని దేవుడు ఎప్పటికీ విస్మరింపడు (6:26-30); ఆందోళన దేవునిపట్ల విశ్వాసం, అవగాహన లేకపోవడమే (6:31-32); మనం ఎదుర్కోవాల్సిన గొప్ప సవాళ్లు మనముందున్నాయి. ఆందోళన ఆ సవాళ్ళను ఎదుర్కోకుండా చేస్తుంది (6:33). ఏ రోజుకు ఆ రోజు జీవించడం, ఆందోళన చెందకుండా ఉంచుతుంది (6:34). కనుక, మన ఆందోళనలను, బాధలను అన్నింటిని దేవునికి అప్పజెబుదాం. దేవునియందు సంపూర్ణ విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే, గతములోని వైఫల్యాలనుండి నేర్చుకొంటూ, భవిష్యత్తుపై ఆందోళన చెందకుండా, ఈరోజు మనం చేయవలసిన పనులను, బాధ్యతలు పరిపూర్ణముగా చేయాలి. “నేటికి కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయుము” (6:11) అని విశ్వాసముతో పార్దిద్దాం. నేటికి కావలసిన దేవుని కృప మనకు తప్పక తోడై ఉంటుంది.

No comments:

Post a Comment