11వ సామాన్య బుధవారము (II)

 11వ సామాన్య బుధవారము
2 రాజు. 2:1, 6-14; మత్త. 6:1-6, 16-18

ధ్యానాంశము: దానము, ప్రార్ధన, ఉపవాసము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “రహస్యకార్యములనెల్ల గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును ఒసగును” (మత్త. 6:4,6,18).
ధ్యానము: దైవరాజ్యము కొరకు నీతిమంతమైన జీవితము జీవించడం మనలనుండి ఏమి ఆశిస్తున్నదో మత్త. 6:1-18లో చూడవచ్చు: దానము, ప్రార్ధన, ఉపవాసము. ఈ మూడు కూడా యూదులకు పవిత్రమైన భక్తి కార్యములు. ఈ భక్తి కార్యములను కపట భక్తి లేకుండా, రహస్యముగా చేయాలని ప్రభువు తన శిష్యులను కోరుచున్నారు. విశ్వాసులు పవిత్రతలో ఎదుగుటకు ఇవి ఎంతో అవసరము. ‘పవిత్రత’ అనగా కేవలము నోటితో యేసు ‘ప్రభువు’, ‘రక్షకుడు’ అని పలకడం కాదు, దానిని మన చేతలలో తప్పక నిరూపించు కోవాలి. దేవునితోను ఇతరులతోను మనకున్న సంబంధం ప్రత్యేకమైనదని మన జీవితాలు, మన ప్రవర్తన చూపించగలగాలి. అన్యులువలెగాక (మత్త. 5:46-47, 6:7-8, 31-32, 18:15-17), యూదులవలెగాక (మత్త. 5:20, 6:1-18, 15:1-20), క్రైస్తవులు ప్రత్యేకముగా జీవించాలని ప్రభువు కోరుచున్నారు. మనం అనేకసార్లు ఇతరులు చూడాలని, ఈ భక్తి కార్యములను ప్రదర్శిస్తూ ఉంటాము. వీటిని మనం ప్రదర్శన కొరకుగాక, దేవుడు చూస్తున్నాడు అనే భావనతో చేయాలి. “రహస్యకార్యములనెల్ల గుర్తించు తండ్రి మనకు తగిన బహుమానమును ఒసగును” (మత్త. 6:4,6,18). దేవునికోసం చేసే కార్యాలు మనలను పరిపూర్ణతకు నడిపిస్తాయి. మన పాప జీవితాన్ని మార్చుకోకుండా ఇతరులపై తీర్పు చేస్తూ ఉంటాము, వారిని నిందించి, ఖండిస్తూ ఉంటాము. కనుక, మన అంత:ర్గత స్వభావమును పరిశీలించుకోవాలి. మన అంత:ర్గత స్వభావమునకు, మనం చేయు కార్యములకు పొంతన లేనిచో లేదా చెప్పేది ఒకటి చేసేది మరొకటైనప్పుడు అది కపటభక్తి, కపట వేషధారణ అగును. మతపరమైన కార్యములన్ని కపటం కాదు. అయితే, మనం చేసేవన్నీ దేవుని మహిమ కొరకు చేస్తున్నామా లేదా మన మహిమ కొరకు చేస్తున్నామా అని ప్రశ్నించుకోవాలి. కపటం, రక్షణకు, పవిత్రతకు ఆటంకం. ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు బయటకు నీతిగా జీవించినను, అంత:ర్గతముగ కపటవేషముతో జీవించేవారు. క్రైస్తవులు కపటములేని నీతిమంతమైన జీవితము జీవించాలి (మత్త. 5:20).

No comments:

Post a Comment

Pages (150)1234 Next