11వ సామాన్య మంగళవారము (II)

 11వ సామాన్య మంగళవారము
1 రాజు. 21: 17-29; మత్త. 5:43-48

ధ్యానాంశము: పరిపూర్ణ ప్రేమ
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “మీ శత్రువులను ప్రేమింపుడు. మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్ధింపుడు” (మత్త. 5:44).
ధ్యానము: ప్రతీ విశ్వాసి పరిపూర్ణతకు, పవిత్రతకు పిలువబడియున్నారని మత్త. 5:48 గుర్తుకు చేయుచున్నది. దేవుని ప్రేమలో సహవాసము కలిగియుండటం పవిత్రత. దేవునితోను, ఇతరులతోను సన్నిహిత సంబంధములో ఎదగడమే పవిత్రత. రక్షణ పొంది దైవరాజ్యములో నిత్యజీవము కలిగియుండటం పరిపూర్ణత. తండ్రివలె మనం పరిపూర్ణులము కావలెను. నీతి నిమిత్తము ఆకలిదప్పులు కలవారు పరిపూర్ణత కొరకు ఆకలిదప్పులు కలిగి ఉంటారు. అనగా, దేవునితోను, ఇతరులతోను యుక్తమైన, న్యాయమైన సంబంధమును కలిగియుంటారు. యేసు ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధముల పరిపూర్ణము. తండ్రి చిత్తానుసారముగా చట్టములోని ప్రతీ అంశమును పాటించారు. ధర్మశాస్త్రమును సంపూర్ణమొనర్చారు. పరలోకమందున్న తండ్రి పరిపూర్ణుడైనట్లే యేసు పరిపూర్ణుడై యున్నారు. కనుక, దేవుని రాజ్యములో ప్రవేశింప గోరువారు పవిత్రులై ఉండవలయును. విశ్వాసులు మొదటిగా ఆయన రాజ్యమును, నీతిని వెదకాలి (మత్త. 6:33). అనగా పరలోకరాజ్యము, నీతియే పవిత్రత. దేవునిపట్ల, ఇతరులపట్ల అనంతమైన ప్రేమను కలిగియున్నవారు పరలోక రాజ్యములో పవిత్రులు. పరలోక పౌరులు పరిపూర్ణ ప్రేమ కలిగి జీవించువారు. పరిపూర్ణ ప్రేమ విషయములో యేసు కొత్త ప్రమాణాలను ఇచ్చియున్నారు. షరతులుగల ప్రేమనుండి అనంతమైన, షరతులులేని ప్రేమలో జీవించాలని కోరుచున్నారు. అనగా, “ధర్మశాస్త్ర బోధకులకంటె, పరిసయ్యులకంటే నీతిమంతమైన జీవితము జీవించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరు” (మత్త. 5:20). పవిత్రత / పరిపూర్ణత పరలోక రాజ్యములో గొప్పదైనది. దేవుని ఆజ్ఞలను పాటించి, వాటిని ఇతరులకు నేర్పించువారు పరలోకరాజ్యములో అత్యధికులుగా పరిగణింపబడును (మత్త. 5:19).

No comments:

Post a Comment