11వ సామాన్య సోమవారము – పునీత పాదువ అంతోని (II)

 11వ సామాన్య సోమవారము – పునీత పాదువ అంతోని
1 రాజు 21:1-16; మత్తయి 5:38-42

ధ్యానాంశము: ప్రతీకారము తీర్చుకొనకుడు
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "అడిగిన వానికి లేదనక యిమ్ము" (మత్తయి 5:42)
ధ్యానము: ప్రతీకారము అనగా మన్నింపలేక పోవడం; అది మన స్వతంత్రాన్ని, సంతోషాన్ని మింగివేయును. బంధాలను విచ్చిన్నం చేయును. ప్రతీకారము తీర్చుకోవడం మానవ నైజం. లోకం అదే బోధిస్తుంది, పాటిస్తుంది. కాని, ప్రతీకారము చేయకుము అని ప్రభువు తెలియజేయుచున్నారు. ప్రేమ, సహనము కలిగి జీవించాలని కోరుచున్నారు. మనకు అపకారము చేయువారికి ఉపకారమును మాత్రమే చేయాలి. చెడును చెడుతోగాక, మంచితో జయించాలి. అన్యాయము-హింసను, ప్రేమ-క్షమాపణ శక్తితో జయించాలి. మనము దేవుని బిడ్డలము కనుక దైవస్వభావంతో జీవించాలి. దేవుడు ప్రేమాస్వరూపుడు (1:8,16). ప్రేమయనగా చెడుకు మంచిని చేయడం, శాపానికి ఆశీర్వదించడం, బాధించే వారికొరకు ప్రార్ధించడం. మంచిని చేయడానికి ఎలాంటి పరిమితులు, షరతులు ఉండరాదు. అందరికి, అన్నిచోట్లా మంచి చేయడమే నిజమైన ప్రేమ. ప్రతీకారంతో ఉన్నచో, దైవారాజ్యాన్ని వ్యాప్తిచేయలేము; మనం ఇతరులకు మార్గదర్శకంగా ఉండలేము, ఇతరులను ప్రభువు చెంతకు నడిపించలేము, సువార్తను ఉజ్జీవముతో ప్రకటించలేము. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో, దానిని బట్టి మీరు నా శిష్యులని అందరు తెలిసికొందురు (యోహాను 13:35). శాంతి సాధనముగా మలచుమని, ద్వేషమున్నచోట ప్రేమను పంచునట్లు చేయుమని పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారితో కలిసి ప్రార్ధించుదాం.

నేడు పునీత పాదువపురి అంతోని వారిని స్మరించుకుంటున్నాము. అద్భుతాల అంతోనిగా బాగా ప్రసిద్ధి. కాని, వేదప్రచారము పట్ల, వేదసాక్షిగా మరణించాలన్న అతనిలోని కోరిక గురించి చాలామందికి తెలియదు. ఆరంభములో అంతోనివారు, ‘ఫెర్నాండో’గా పునీత అగుస్తీను మఠసభలో గురువు. అస్సీసిపుర ఫ్రాన్సిస్ సభకు చెందిన ఐదుగురు సోదరులు మొరాకో దేశమునకు వేదసాక్షులుగా వెళ్తూ అస్సీసినుండి పోర్చుగల్ చేరుకొని రాత్రికి ఫెర్నాండో ఉన్న మఠములో ఆశ్రయాన్ని పొందారు. మరుసటి రోజు ఆ ఐదుగురు సంతోషముతో మొరాకో వెళ్ళారు. మూడు నెలల తరువాత, ఆ ఐదుగురు సన్యాసులు వేదసాక్షి మరణాన్ని పొందారు. వారి పరిశుద్ధ అవశేషాలు ఫెర్నాండో ఉన్న మఠమునకు తీసుకొని రాబడ్డాయి. అది చూసిన ఫెర్నాండో, ఆ క్షణములోనే అస్సీసిపుర ఫ్రాన్సిస్ అనుచరుడు కావాలని, ఒక బిచ్చగానివలె జీవిస్తూ ప్రపంచమే ఆశ్రమముగా జీవించాలని, వేదసాక్షి మరణం పొందాలని ఆశించి, ఫ్రాన్సిస్ సభ సన్యాసిగా చేరి తన పేరును ‘అంతోని’గా మార్చుకున్నారు. ఆ ఐదుగురు వేదసాక్షులవలె, తానుకూడా మొరాకోకు బయలుదేరాడు, కాని మార్గమధ్యలో అనారోగ్యం పాలవడం వలన వెళ్ళలేక పోయాడు. తన సువార్తా బోధనకు క్రీస్తు అతనిని ఎన్నుకున్నారు. ఆ కాలములో అందరూ కోరుకొనే అత్యంత ప్రసిద్ధులైన ప్రసంగీకులుగా అంతోనివారు పేరుగాంచారు.

No comments:

Post a Comment