11వ సామాన్య శుక్రవారము
2 రాజు. 11:1-4, 9-18, 20; మత్త.
6:19-23
ధ్యానాంశము: నిజమైన సంపదలు
ధ్యానమునకు ఉపకరించు
వాక్యములు: “నీ సంపదలున్న చోటనే నీ హృదయముండును” (మత్త. 6:21).
ధ్యానము: దైవరాజ్యము కొరకు మనం
స్పష్టమైన నిర్ణయాలు చేయాలి. లోక సంపదలా లేక పరలోక సంపదలా? దైవమా లేక ధనమా? అని
నిర్ణయం చేయాలి. దేవుని రాజ్యములో జీవించాలంటే, ఈ లోక సంరక్షణలనుండి, ఆందోళనలనుండి
విముక్తులం కావాలి. ఆకాశ పక్షులవలె, లిల్లీపుష్పములవలె మనం దేవునిపై ఆధారపడి
జీవించాలి. ‘పరలోక ప్రార్ధన’లో దేవుని రాజ్యము కొరకు ప్రార్ధన చేయాలని యేసు
నేర్పించారు. నిజమైన శిష్యులు ఈ లోకములో సంపదలు కూడబెట్టుకొనరు. ప్రార్ధన,
ఉపవాసము, దానధర్మాలద్వారా సంపదలను పరలోకములో కూడబెట్టు కుంటారు. విశ్వాసులు, మొదట
దేవుని రాజ్యమును, నీతిని వెదకాలి. అప్పుడు అన్నియు అనుగ్రహింపబడును (మత్త. 6:33).
లోక సంపదలు అశాశ్వతము. ఎన్నియున్నను, మన హృదయం ఖాళీగానే ఉంటుంది. కాని స్వర్గ
సంపదలు శాశ్వతము. పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖలో ఇలా అన్నారు: “నేను లాభముగా
లెక్కించుకొన దగిన వానిని అన్నింటిని క్రీస్తు కొరకై నష్టముగా లెక్కించు
కొనుచున్నాను. క్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగనే
పరిగణించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడితిని. క్రీస్తును
పొందగలుగుటకై నేను వానిని అన్నింటిని చెత్తగ భావించుచున్నాను” (3:7-8). స్వర్గ
సంపదలనగా మన హృదయాన్ని దేవునిపై కేంద్రీకృతమై ఉంచడం; దేవుడు మన జీవితాలలో
బహిర్గతమొనర్చే విషయాలను మన హృదయాలలో నిధిగా ఉంచుకోవడం (మరియతల్లివలె, లూకా. 2:19,
51). “నీ సంపదలున్న చోటనే నీ హృదయముండును” (మత్త. 6:21). పరలోక సంపదలు ఇవే: ప్రేమ,
ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము (గలతీ. 5:22-23).
No comments:
Post a Comment