10వ సామాన్య గురువారము – పునీత సిరియా
ఎఫ్రేము
1 రాజు. 18:41-46; మత్త. 5:20-26
ధ్యానాంశము: ఆగ్రహము గురించిన పాఠము
ధ్యానమునకు ఉపకరించు
వాక్యములు: “తన సోదరునిపై కోపపడువాడు, తీర్పునకు గురియగును, అవమానపరచువాడు న్యాయసభ
ముందుకు వచ్చును. ‘అవివేకి’ అని పిలిచినవాడు నరకాగ్నికి లోనగును” (మత్త. 5:22).
ధ్యానము: ఆగ్రహము పెద్ద పాపము. ఇది ఇతరులకు
హాని కలిగించి నాశనం చేయడం. కోపం పెంచి పోషింపబడినప్పుడు, ఆగ్రహముగా మారుతుంది.
పగ, ప్రతీకారాలకు దారితీస్తుంది. అందుకే, సోదరునిపై కోపపడరాదని, కోపపడుటకు బదులుగా
క్షమించాలని ప్రభువు చెబుతున్నారు. మనస్పర్ధలుంచుకొని క్షమించలేనిచో, పాపానికి
దాసులమవుతాము. ఆగ్రహానికి విరుగుడు దయ, క్షమ. దేవుడు మనలను క్షమించినట్లుగా,
తోటివారిని క్షమించాలి. తోటివారితో సఖ్యత లేనప్పుడు, దేవునితో సఖ్యత కలిగి
యుండలేము. అందుకే, ప్రభువు, “బలిపీఠ సన్నిధికి కానుకను తెచ్చినపుడు సోదరునికి నీపై
మనస్పర్ధ యున్నట్లు స్ఫురించినచో, కానుకను పీఠము చెంతనే వదలి పెట్టి, పోయి, మొదట
సోదరునితో సఖ్యపడి, తిరిగివచ్చి కానుకను చెల్లింపుము” (మత్త, 5:23-24) అని
స్పష్టముగా చెప్పియున్నారు. తోటివారు తప్పు చేసినను, అహంకారమును పక్కనపెట్టి సఖ్యతపడే,
సమాధానపడే బాధ్యత మనమే తీసుకోవాలి. ఇలా చేయాలంటే, దేవునియందు విశ్వాసం ఉంచాలి.
ఏలియా ప్రభువునందు విశ్వాసముంచాడు. కరువు సమయములో ఇస్రాయేలు ప్రజలు అనేకమంది
దేవునిపట్ల విశ్వాసాన్ని కోల్పోయారు. కాని ఏలియా ప్రభువునందు, ఆయన వాగ్దానములందు
విశ్వాసముంచాడు. విశ్వాసం అంటే, దేవుని విశ్వసనీయతయందు నమ్మకముంచడం.
No comments:
Post a Comment