10వ సామాన్య బుధవారము – పునీత మరియం
తెరేసియా
1 రాజు. 18:20-39; మత్త. 5:17-19
ధ్యానాంశము: ధర్మశాస్త్రము పరిపూర్ణత
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “నేను వచ్చినది వానిని సంపూర్ణ మొనర్చుటకే గాని,
రద్దుచేయుటకు కాదు” (మత్త. 5:17).
ధ్యానము: పాత నిబంధనలో, దేవుడు ధర్మశాస్త్రము (మొదటి ఐదు గ్రంథాలు), ప్రవక్తల ప్రబోధము (యెహో., న్యాయా.,
సమూ., రాజు.,
యెషయ, యిర్మీ.,
యెహెజ్కె., 12 చిన్న ప్రవక్తలు) ద్వారా తననుతాను బహిర్గత మొనర్చాడు.
అత్యంత ప్రాథమిక చట్టం ‘పది ఆజ్ఞలు’. యేసు వీటిని రద్దుచేయుటకుగాక సంపూర్ణ మొనర్చుటకు వచ్చానని
చెప్పారు. పాత నియమములను సంపూర్ణం చేయడమంటే, వాటిని రద్దు చేయడం కాదు. వాటి లోతైన భావమును గ్రహించి
పాటించడం. నీతిన్యాయమును స్థాపించుడం. రక్షణకు అవసరమైనదానికంటే ఎక్కువ చేయడం (not the minimum, but do the maximum). ఇంకోమాటలో చెప్పాలంటే, ధర్మశాస్త్ర బోధకులకంటె, పరిసయ్యులకంటె నీతిమంతమైన జీవితము జీవించాలి. ఆరు విషయాలలో
యేసు ధర్మశాస్త్రాన్ని సంపూర్ణం చేసాడని మత్తయి సువార్త గుర్తిస్తుంది: హత్య, వ్యభిచారము,
విడాకులు, ప్రమాణములు,
ప్రతీకారము, శత్రువులను ప్రేమించుట. క్రొత్త నియమం ప్రకారం, హత్యను మాత్రమే కాదు, ఇతరులపై కోపాన్ని, పరులపై తీర్పును కూడా నివారించాలి, ఇతరులతో సఖ్యత పడాలి;
వ్యభిచారం మాత్రమే
కాదు, కామేచ్ఛతో చూపులను కూడా
నివారించాలి; విడాకులు ఉండకూడదు; ఒట్లు పెట్టరాదు. శత్రువులను కూడా ప్రేమించాలి. మూలధర్మానికి
కట్టుబడి ఉండాలి: “ఇతరులు మీకేమి చేయవలెనని
మీరు కోరుదురో, దానిని మీరు పరులకు చేయుడు.
ఇదియే మోషే ధర్మశాస్త్రము;
ప్రవక్తల
ప్రబోధము” (మత్త. 7:12).
దైవప్రేమ-సోదరప్రేమ అను గొప్ప ఆజ్ఞను, నూతన నిబంధనమును, దేవుడు మన హృదయాలలో రాసారు
(యిర్మీ. 31:33). ఇది అనంతమైన ప్రేమ, షరతులులేని ప్రేమ. పవిత్రమైన,
పరిశుద్ధమైన
ప్రేమ. ఇదే నీతిమంతమైన జీవితము. ఇదే ధర్మశాస్త్రమును, ప్రవక్తల ప్రబోధమును పరిపూర్ణం చేయడం.
No comments:
Post a Comment