10వ సామాన్య సోమవారము – మరియ, శ్రీసభ మాత (II)

 10వ సామాన్య సోమవారముమరియ, శ్రీసభ మాత
ఆది. 3:9-15, 20 (లేదా) అ.కా. 1:12-14; యోహాను. 19:25-34

ధ్యానాంశము: మరియ – శ్రీసభమాత
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “సైనికులలో ఒకడు ఆయన ప్రక్కన బల్లెముతో పొడిచెను.వెంటనే రక్తము, నీరు స్రవించెను” (యోహాను. 19:34).
ధ్యానము: నేడు శ్రీసభమాత మరియ పండుగను కొనియాడుచున్నాము. ఇది పెంతకోస్తు పండుగతో అనుసంధానించ బడినది. సంప్రదాయం ప్రకారం, పెంతకోస్తు దినమున, పవిత్రాత్మ దిగివచ్చినపుడు, శిష్యులతో మరియతల్లి కూడా ఉన్నది. రక్షకుని జనన వార్తను మొదటిగా వినినది ఆమెనే! యేసుతో ఆరంభమునుండి చివరివరకు ఉన్నది. ప్రభువును ప్రతిచోట ఆమె అనుసరించినది. కనుక, మరియ ఆదర్శవంతమైన శిష్యురాలు. “క్రీస్తును తన గర్భమున దాల్చిన దానికంటే, క్రీస్తునందు ఉంచిన విశ్వాసమునుబట్టి, మరియ ఎక్కువగా ఆశీర్వదింప బడినది” అని పునీత అగుస్తీను అంటారు. మరియ యేసు సిలువ చెంత నిలిచినది. యేసు తన తల్లితో, “స్త్రీ! ఇదిగో నీ కుమారుడు” అనెను. ఆతరువాత శిష్యునితో, “ఇదిగో నీ తల్లి” అనెను (యోహాను. 19:26-27). కనుక, యేసు మనందరిని ఆ తల్లి సంరక్షణలో ఉంచారు. మొదటిగా, సృష్టికర్తకు జన్మనిచ్చి, “దేవుని తల్లి”గా, శ్రీసభ ఆరంభమును పోషించినది. రెండవదిగా, సిలువ చెంత మరియ “శిష్యులందరికీ తల్లి” అయింది. మూడవదిగా, యేసు శ్రీసభకు సంపూర్ణ ఉనికిని కలిగించి, మరియను “శ్రీసభ తల్లి”గా ప్రసాదించారు. ఈ ప్రేషిత కార్యమును మరియ సంతోషముగా అంగీకరించినది. అందుకే, శ్రీసభ సంరక్షకురాలుగా, అపోస్తలులతో, శిష్యులతో కలిసి ఎడతెగక ప్రార్ధన చేసింది (అ.కా. 1:14). “మరియ శ్రీసభ సభ్యుల మాత” అని పునీత అగుస్తీను అన్నారు. “విశ్వాసంతో దేవుని వాక్కును అందుకోవడం వల్ల శ్రీసభ మాతృమూర్తి అవుతుంది” (సత్యోపదేశం, నం. 507). మరియ క్రైస్తవుల సహాయమాత, ప్రార్ధనసహాయిని. కనుక, శ్రీసభ ప్రేషితకార్యం దిగ్విజయముగా కొనసాగాలని, క్రీస్తు గురించి లోకము తెలుసుకోవాలని, తల్లితో కలిసి ఎడతెగక ప్రార్ధన చేద్దాం. శతాబ్దాలుగా మరియతల్లి దర్శనాలే శ్రీసభపట్ల ఆమెకున్న గొప్ప ప్రేమకు నిదర్శనాలు!

No comments:

Post a Comment