దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
పవిత్ర వారము - మంగళవారం
యెషయ 49:1-6; యోహాను 13:21-33, 36-38
ధ్యానాంశము: గురుద్రోహమును గూర్చిన సూచన; పేతురు బొంకు-యేసు ప్రవచనము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "మీలో ఒకడు నన్ను అప్పగింపనున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను... "నీవు నా కొరకు నీ ప్రాణమును ఇచ్చెదవా? కోడి కూయక ముందే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు బొంకెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" (యోహాను 13:21, 38).
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "మీలో ఒకడు నన్ను అప్పగింపనున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను... "నీవు నా కొరకు నీ ప్రాణమును ఇచ్చెదవా? కోడి కూయక ముందే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు బొంకెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" (యోహాను 13:21, 38).
ధ్యానము: నేటి సువిశేష పఠనములో, ఇద్దరు శిష్యుల గురుద్రోహమును చూస్తున్నాము. ఒకటి యూదా గురుద్రోహము; రెండు పేతురు బొంకు. పాస్కా పండుగకు ముందు రోజున, యేసు మరియు శిష్యులు భోజనము చేయుచుండగా, యేసు తన శిష్యుల పాదములను కడిగారు (యోహాను 13:4). వారినికూడా అట్లే చేయమని ఆజ్ఞాపించారు (యోహాను 13:14-15). యూదా ఇస్కారియోతు హృదయములో అప్పటికే పిశాచము యేసును అప్పగింప వలయునను ఆలోచన కలిగించెను (యోహాను 13:2). ఈ సందర్భముగా, సమస్త హృదయాలను ఎరిగిన యేసు ప్రభువు, "మీలో అందరు శుద్ధులు కారు" (యోహాను 13:11) అని పలికారు. "నాతో భుజించువాడు నాకు విరుద్ధముగా లేచును" అను లేఖనమును కూడా యేసు గుర్తుచేసెను (యోహాను 13:18). అలాగే, "మీలో ఒకడు నన్ను అప్పగింపనున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను" అని స్పష్టముగా పలికెను (యోహాను 13:21). ఎవరి గురించి అని సందేహించుచు, శిష్యులు ఒకరి వంక మరియొకరు చూచుకొన సాగిరి. "నేను రొట్టె ముక్కను ముంచి, ఎవనికి ఇచ్చెదనో అతడే" అని యేసు చెప్పి, ఒక రొట్టె ముక్కను ముంచి, సీమోను ఇస్కారియోతు కుమారుడగు యూదాకు ఇచ్చెను. సైతాను వానిలో ప్రవేశించెను. ఆ రొట్టె ముక్కను తీసికొని వెంటనే బయటకు వెళ్ళిపోయెను. అది రాత్రి వేళ (యోహాను 13:26-30). కాని, ఆ సమయములో, యూదా గురుద్రోహము మిగతా శిష్యులకు అర్ధము కాలేదు.
ఆ తరువాత యేసు, "చిన్న బిడ్డలారా! నేను కొంత కాలము మాత్రమే మీతో ఉందును. మీరు నన్ను వెదకెదరు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాజాలరు" (యోహాను 13:33) అని శిష్యులతో చెప్పెను. అందుకు, పేతురు, "ప్రభూ! మీ కొరకు నా ప్రాణమునైనను ఇచ్చెదను (యోహాను 13:37) అని పలికాడు. అందుకు యేసు, "నీవు నా కొరకు నీ ప్రాణమును ఇచ్చెదవా? కోడి కూయక ముందే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు బొంకెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" (యోహాను 13:38) అని చెప్పెను.
యూదా - పేతురుల మధ్యన వ్యత్యాసం
ఈవిధముగా, యేసు యూదా ద్రోహాన్ని, పేతురు బొంకును ముందుగానే బట్టబయలు చేసారు. అయితే, వీరిద్దరి మధ్యనున్న వ్యత్యాసం ఏమిటో తెలుసుకోవడం, మన జీవితాలకు ఎంతగానో తోడ్పడుతుంది. యూదా ద్రోహం ఉద్దేశపూర్వకమైనది, క్రూరమైనది, ప్రణాళికతో కూడినది. ఒక వ్యక్తికి రొట్టెను ముంచి ఇవ్వడం అంటే, ఆ వ్యక్తితో అతి సన్నిహిత స్నేహానికి సూచన. అలాంటి సన్నిహిత స్నేహానికి యూదా ద్రోహం చేసాడు. పేతురు, తన బలహీనమైన క్షణములో యేసు ఎవరో ఎరుగనని బొంకాడు. తాను చేసినదానిని చేయాలని అతడు ఎప్పుడు అనుకోలేదు. పేతురు విధేయత అతనికి బలం మరియు అతని బలహీనత. ఆ రెండూ ప్రభువునకు బాగా తెలుసు.
మనందరికీ బలహీనతలు ఉన్నాయి. అందరం పాపాత్ములమే. అయినప్పటికిని, దేవుడు బలహీనులను ప్రేమిస్తారు. అయితే, మన బలహీనతలను, పాపాలను నిరాకరిస్తాము, సమర్ధిస్తాము, వాటిని కప్పిపుచ్చుతాము. బలహీనులమైన మనలను దేవుడు బలవంతులను చేయాలంటే...
- మన బలహీనతలను, పాపాలను తెలుసుకొని ఒప్పుకోవాలి: "నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగు చున్నది" (2 కొరి 12:9) అని ప్రభువు పౌలుతో చెప్పెను. కనుక, మన బలహీనతలు దేవునిపై ఆధారపడునట్లు చేయును. మన బలహీనతలపట్ల నిరాశ చెంద కూడదు. మనలను మనం దేవునికి అర్పిస్తే, మన బలహీనతలను దేవుడు తీసివేస్తారు. మనలను తన ఆత్మతో బలవంతులను చేస్తారు. ప్రభువు సమక్షములో ఒప్పుకొని, ప్రార్ధన చేయాలి. "బలహీనులమైన మనకు దేవుని ఆత్మ సాయపడును" (రోమీ 8:26).
No comments:
Post a Comment