పవిత్ర వారము - బుధవారం (II)

దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
పవిత్ర వారము - బుధవారం
యెషయ 50:4-9; మత్త 26:14-25

ధ్యానాంశము: కడరాత్రి భోజనము - యూదా గురుద్రోహము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "మనుష్య కుమారుడు చంపబడును. కాని మనుష్య కుమారుని అప్పగించు వానికి అయ్యో అనర్ధము! అతడు జన్మింపక ఉండినచో మేలు అయ్యెడిది" (యోహాను 26:24).
ధ్యానము: పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, "మేము ఎచట పాస్క భోజనము సిద్ధపరుప గోరెదవు? అని ప్రశ్నించిరి. యేసు ఆజ్ఞాసుసారముగా, శిష్యులు పాస్క భోజనమును సిద్ధపరచిరి (26:17-19).

యూదా ఇస్కారియోతు ప్రధానార్చకుల వద్ద ముప్పది వెండి నాణెములు తీసుకొని, యేసును వారికి అప్పగింప తగిన సమయమునకై వేచి యుండెను (26:14-16). ద్రోహం చేయటం, ముఖ్యముగా మనకు బాగా దగ్గరగా ఉన్నవారే, నమ్మకద్రోహం చేస్తే అది మనలను ఎంతగానో బాధిస్తుంది. నమ్మక ద్రోహం అనేది ఘోరమైన నేరం! అది మన అంతరంగాన్ని ఎంతగానో బాధిస్తుంది. మోసంచేయబడ్డాము, తిరస్కరించబడ్డాము అని ఒంటరివారముగా అయిపోతాము. అలాంటి నమ్మకద్రోహాన్ని యూదా, తన గురువైన యేసుకు తలపెట్టాడు.

సాయంకాలము కాగా, యేసు పన్నిద్దరు శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. వారు భుజించుచుండ, యూదా ద్రోహము గురించి ముందుగానే ఎరిగిన ప్రభువు, "మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" (26:21) అని అన్నారు. శిష్యులందరు మిగుల చింతించిరి. "ప్రభూ!, నేనా" అని ఒక్కొక్కరు అడుగసాగిరి. అందులకు యేసు, "నాతోపాటు ఈ పాత్రలో చేతిని ముంచిన వారు నన్ను అప్పగించును" అని అనెను. అప్పుడు ఆయనను అప్పగింపనున్న యూదా, "గురువా! నేనా?" అని అడుగగా, "నేవే చెప్పుచున్నావు" అని యేసు సమాధానము ఇచ్చెను" (26:20-25).

యూదా ద్రోహానికి కారణాలు: దురాశ కావొచ్చు! బెతానియాలో, మరియమ్మ పరిమళ ద్రవ్యముతో యేసు పాదములను అభిషేకించినపుడు, "పరిమళ ద్రవ్యమును మూడు వందల దీనారములకు అమ్మి పేదలకు ఈయగూడదా? అని యూదా అన్నాడు. అతడు పేదల పట్ల జాలితో ఇట్లు అనలేదు. ఏలయన, వాడు దొంగ, తన యొద్ద నున్న డబ్బుల సంచి నుండి దొంగిలించు చుండును" (యోహాను 12:5-6). క్రీస్తుపట్ల ద్వేషం కావొచ్చు! వాస్తవానికి, యూదా అత్యంత జాతీయవాద కుటుంబము నుండి వచ్చాడు. బహుశా, ఓ గొప్ప జాతీయ నాయకుడిని యేసులో చూడాలనుకొని యుండవచ్చు! యేసు తన దైవీక శక్తిని ఉపయోగించి, రోమాసామ్రాజ్యాన్ని నాశనం చేయాలని యూదా కాంక్షించాడు. అది జరగక పోవుట వలన, యేసుపై ద్వేషాన్ని పెంచుకున్నాడు. యూదా తాను మారకుండా, యేసును ఆయన ప్రేషిత కార్యాన్నే మార్చాలని అనుకున్నాడు. యేసు బోధనలను విన్నాడు, కాని ఆలకించలేదు, పాటించలేదు. హృదయ పరివర్తన చెందలేదు.

మనం చేసే ప్రతీ పాపం, దేవుని మంచితనానికి ద్రోహం తలపెడుతున్నామని గ్రహించాలి. మన విశ్వాసాన్ని బలపరచమని ప్రార్ధిద్దాం! శోధనలలో యేసును విడువక, విశ్వాసం కోల్పోకుండునట్లు ప్రార్ధిద్దాం!

No comments:

Post a Comment