దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
పవిత్ర వారము - సోమవారం
యెషయ 42:1-7; యోహాను 12:1-11
ధ్యానాంశము: బెతానియాలో అభిషేకము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "ఆమెను అట్లు చేయనిండు. నా భూస్థాపన దినమునకై దానిని ఉంచుకొననిండు. పేదలు ఎల్లప్పుడు మీతో ఉందురు. కాని, నేను ఎల్లప్పుడు మీతో ఉండను" (యోహాను 12:7-8).
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "ఆమెను అట్లు చేయనిండు. నా భూస్థాపన దినమునకై దానిని ఉంచుకొననిండు. పేదలు ఎల్లప్పుడు మీతో ఉందురు. కాని, నేను ఎల్లప్పుడు మీతో ఉండను" (యోహాను 12:7-8).
ధ్యానము: పాస్కా పండుగకు, ఆరు రోజులు ముందుగా యేసు బెతానియా గ్రామమునకు వెళ్ళారు. అది మరియమ్మ, మార్తమ్మ, మృతులలో నుండి లేపబడిన లాజరుల స్వగ్రామము. అక్కడ యేసుకు విందు ఏర్పాటు చేయబడినది. అప్పుడు మరియమ్మ పరిమళ ద్రవ్యముతో యేసు పాదములను అభిషేకించి, తన తల వెంట్రుకలతో తుడిచినది. ఆ పరిమళ ద్రవ్యాన్ని ఆమె వృధా చేసినదని యూదా ఇస్కారియోతు భావించాడు. దానిని అమ్మి పేదలకు దానము చేయకూడదా? అని ప్రశ్నించాడు. ఎందుకన, అతడు దొంగ, తన యొద్ద నున్న డబ్బుల సంచి నుండి దొంగిలించు చుండేవాడు. అప్పుడు యేసు, "ఆమెను అట్లు చేయనిండు. నా భూస్థాపన దినమునకై దానిని ఉంచుకొననిండు. పేదలు ఎల్లప్పుడు మీతో ఉందురు. కాని, నేను ఎల్లప్పుడు మీతో ఉండను" (యోహాను 12:7-8) అని పలికెను.
పరిమళ ద్రవ్యముతో మరియమ్మ అభిషేకం, యేసుపై ఆమెకు గల ప్రేమను చాటుచున్నది. అలాగే, మరణించిన తన తమ్ముడైన లాజరును బ్రతికించినందులకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతను చాటుచున్నది. ఆమె చేసిన దానిని [ఆరాధన, స్తుతి, ప్రార్ధన, కృతజ్ఞత] ప్రభువు అభినందించారు.
ఇక్కడ గమనించ వలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం పేదవారికి సహాయం చేయడాన్ని మరియు దేవున్ని ఆరాధించడాన్ని, రెండింటికి ప్రాధాన్యతను ఇవ్వాలి. కొంతమంది, దానధర్మాలు చేస్తే చాలు, గుడికి రానవసరం లేదు; గుడిలో వేసే డబ్బులు వృధా అని భావిస్తారు. అది చాలా తప్పుడు భావన. దేవాలయములో, పేద విధవరాలు, తనకున్నదంతటి రెండు నాణెములను, చందా పెట్టెలో వేయటాన్ని చూసిన ప్రభువు ఆమెను అభినందించారు. పేదవారికి సహాయం చేయాలి, అలాగే, దేవాలయములో దేవునకు ప్రార్ధనలు చేయాలి. దేవాలయాన్ని పరిశుభ్రముగా ఉంచుకోవాలి. చక్కటి అలంకరణలు చేయాలి. ముఖ్యముగా, బలిపీఠము, దివ్యమందసములను అందముగా అలంకరించు కోవాలి. ఇవన్ని కూడా, మన భక్తికి, విశ్వాసానికి సూచనలు. అయితే, నేడు దేవాలయ నిర్మాణాలలో [పోటీలు పడుతూ] కోట్ల కొలది డబ్బులను వెచ్చిస్తున్నారు. పేదవారిని పట్టించుకోకుండా, అంత అనవసరపు ఖర్చులను కూడా వెచ్చించడాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలి. మరికొంతమంది, రోజూ ఆరాధనలు, ప్రార్ధనలు, పూజలు చేస్తే సరిపోతుంది, ఇతరులకు ముఖ్యముగా పేదవారికి ఎందుకు సహాయం చేయాలి అని భావిస్తారు. ఇది కూడా తప్పుడు భావనే! దేవునిపై మనం చూపించే ప్రేమ, మన తోటివారిపై కూడా చూపించాలి. దేవుడు మనలను ప్రేమించినట్లుగా, మనం ఒకరినొకరం ప్రేమించుకోవాలి. ఇదే క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం ఒంటరి జీవితం కాదు. స్వార్ధపూరితమైన జీవితం కాదు. మన జీవితం ఒక సంఘ [శ్రీసభ] పరమైన జీవితం. మనం క్రీస్తు శరీరములో భాగస్తులం. కనుక, అందరం ఒకే కుటుంబం. మనకున్న దానిని [ధనం, సమయం, మంచి మాట, చిరునవ్వు, చేయూత...] ఇతరులతో పంచుకోవాలి. మనం ఇతరులకు చేసే ఏ చిన్న సహాయం అయినను, అది క్రీస్తుకు చేసినట్లగును! మనలో చాలామందిమి ఈ రెండింటిలో, ఒక దానికే ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటాము.
బెతానియాలో ఉన్నటువంటి ప్రభువును ప్రధానార్చకులు చంపుటకు కుట్రలు చేసారు. ఎందుకన, లాజరును సజీవముగా లేపడముతో, అనేకమంది ఆయనను విశ్వసించు చుండిరి (11:45; 12:11).
No comments:
Post a Comment