తపస్కాల మొదటి వారము - మంగళవారం (II)

  దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
తపస్కాల మొదటి వారము - మంగళవారం
యెషయ 55:10-11; మత్త 6:7-15

ధ్యానాంశము: ప్రార్ధనా విధానము - పరలోక ప్రార్ధన
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "అనేక వ్యర్ధపదములతో ప్రార్ధింపవలదు" (మత్త 6:7).
ధ్యానము: ప్రార్ధన, ఉపవాసము, దానధర్మాలు ప్రాముఖ్యమైన భక్తి క్రియలు. ఈ భక్తి క్రియలను చిత్త శుద్ధితో చేయడానికి, యేసు కూడా తన శిష్యులను ప్రోత్సహించారు. ఈ భక్తి కార్యాలు మనలను పవిత్ర మార్గములో నడిపిస్తాయి. పవిత్రత అనేది 'యేసు ప్రభువు' అని మాటలలో చెప్పడం మాత్రమేగాక, మన చేతలలో చూపించాలి. మన ప్రవర్తన, మన జీవితం దేవునితో మన బాంధవ్యం ప్రత్యేకమైనదని నిరూపించాలి. "మనుష్యులు కంట బడుటకై వారి యెదుట మీ భక్తి కార్యములు చేయకుండ జాగ్రత్త పడుడు. లేనియెడల పరలోక మందలి ఈ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు" (మత్త 6:1) అని యేసు స్పష్టం చేసారు.
నేటి సువిశేషములో ప్రభువు మనదరికి తెలిసిన, మనం ప్రతీరోజు ప్రార్ధించే 'పరలోక ప్రార్ధన'ను తన శిష్యులకు నేర్పుతూ ఇలా ప్రార్ధింపుడు అని తెలియ జేశాడు. ప్రార్ధన చేసేప్పుడు, మనం చేసే రెండు తప్పులను ప్రభువు తెలియజేయు చున్నారు. ఒకటి, వ్యర్ధపదములతో ప్రార్ధన చేయడం (మత్త 6:7-8); రెండు, కపట భక్తులవలె ప్రార్ధన చేయటం (మత్త 6:5-6). పరిసయ్యులు దీర్ఘజపములను చేసెడివారు (మత్త 23:14). క్రీస్తు శిష్యులు కపటము లేకుండా ప్రార్ధన చేయాలి. ఈ నేపధ్యములో, ప్రభువు శిష్యులకు 'పరలోక ప్రార్ధన'ను నేర్పించారు. ప్రార్ధన ఉద్దేశ్యం తండ్రి దేవుని సహవాసములో ఐఖ్యం అవడం. 'పరలోక ప్రార్ధన' వ్యక్తిగత ప్రార్ధన గాక, సంఘ ప్రార్ధన. 
'పరలోక ప్రార్ధన' జపించేప్పుడు, ఈ విషయాలను గుర్తించుదాం:
👉 దేవుడు మన తండ్రి (అబ్బా!), మనం ఆయన బిడ్డలం, మనమంతా సోదరులం.
👉 దేవుడు 'పరలోకమందు' ఉన్నారు. దేవుడు సజీవుడు; ఆయన సాన్నిధ్యం అందరికి అందుబాటులో ఉంటుంది.
👉 దేవుని నామము పవిత్రమైనది; అనగా దేవుని పవిత్రత మన హృదయాలలో నాటుకొని పోవాలి. తండ్రివలె మనంకూడా పవిత్రముగా ఉండాలి; పవిత్రత కొరకు ప్రార్ధన చేయాలి.
👉 దేవుని రాజ్యము భూలోకములో నెలకొనాలి. దేవుడు మాత్రమే నిజమైన రాజు. ఆయన సాన్నిధ్యం ఈ లోకాన్ని పునరుద్ధరించాలి.
👉 ఈ పునరుద్ధరణకు మూలం దేవుని చిత్తం. దేవుని చిత్తము భూలోకమందు నేరవేరాలి.
👉 'పరలోక ప్రార్ధన' న్యాయం, పవిత్రత కొరకు ఆకలి దప్పులు కలిగేలా మనలను దహించి వేయును.
👉 " నేటికి కావలిసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయుము" (నిత్యావసరాలు) అన్న విన్నపం, సకల చింతలనుండి పరిపూర్ణ త్యాగ ప్రార్ధన. నమ్మకమైన ప్రార్ధన; దేవునిపై ఆధారపడుట.
👉 మన జీవితాలకు మూలం, ఆధారం దేవుడు.
👉 దేవుని క్షమాపణను వేడుకోవాలి. ఇతరులపట్ల క్షమాగుణం కలిగి జీవించాలి (ఆధ్యాత్మిక అవసరాలు).
👉 సాతాను దుష్టశక్తులకు లోనుకాకుండుటకు ప్రార్ధన చేయాలి.
తపస్కాలములోనున్న మనం ఎక్కువ సమయాన్ని ప్రార్ధనద్వారా దేవునికి వెచ్చించుదాం! విశ్వాసముతో ప్రార్ధాన చేయాలి. అలాగే, ప్రార్ధనలో దేవుని స్వరమును వినగలగాలి.
నాలుగు విషయాలు గుర్తుపెట్టుకుందాం: ఒకటి, ప్రార్ధనలో మనం చెప్పే మాటలకన్న, మన హృదయశుద్ధి దేవుని హృదయమునకు మనలను హత్తుకొనేలా చేస్తుంది. రెండు, ప్రార్ధన ప్రధానముగా దేవుని చిత్తమును ఎరుగుట, దాని ప్రకారం జీవించుట. దేవుని వాక్కును శ్రద్ధగా ఆలకించడం. మూడు, మన ప్రార్ధించేప్పుడు, మన జీవితములో అతి ప్రాముఖ్యమైన విషయాల కొరకు వేడుకోవాలి: దేవుని నామం మహిమపరపబడాలి; దేవుని రాజ్యం రావాలి; దేవుని చిత్తం నేరవేరాలి; అనుదిన ఆహారము కొరకు, దేవుని క్షమాపణ కొరకు ప్రార్ధించాలి; పాపమునుండి విముక్తి కొరకు ప్రార్ధించాలి. పరిశుద్ధాత్మ కృప కొరకు ప్రార్ధన చేయాలి. నాలుగు, ప్రార్ధన తండ్రి దేవునివలె మారడానికి సవాలు చేస్తుంది! దేవుడు మన పాపాలను క్షమించినట్లే, మనం ఇతరుల పాపాలను హృదయ పూర్వకముగా క్షమించాలి. ఆకలితో నున్నవారితో ఆహారమును పంచుకోవాలి.

No comments:

Post a Comment