తపస్కాల మొదటి వారము - సోమవారం (II)

 దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
తపస్కాల మొదటి వారము - సోమవారం
లేవీ 19:1-2, 11-18; మత్త 25:31-46

ధ్యానాంశము: తుది తీర్పు
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినపుడు అవి నాకు చేసితిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను... నీతిమంతులు నిత్య జీవములో ప్రవేశింతురు" (మత్త 25:40, 46).
ధ్యానము: నేటి సువిశేషము తుది తీర్పును గురించిన ఉపమానము. మత్తయి సువార్తలో మాత్రమే ప్రస్తావించ బడినది. ఈ ఉపమానం ఎవరు దైవరజ్యములో ప్రవేశిస్తారో తెలియజేయుచున్నది - "అప్పుడు రాజు తన కుడిప్రక్కన ఉన్నవారితో, 'నా తండ్రిచే దీవింప బడిన వారలారా! రండు, ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరుప బడిన రాజ్యమును చేకొనుడు" (25:34). ఇది ధనవంతుడు-లాజరు ఉదంతాన్ని (లూకా 16:19-31), గోధుమలు-కలుపుగింజలు ఉపమానాన్ని (మత్త 13:36-43), మంచి చేపలు-చెడు చేపలు ఉదంతాన్ని (మత్త 13:47-50) జ్ఞప్తికి చేస్తుంది.
ఈ ఉదాంతం ప్రధానముగా రెండు విధాలుగా వివరించబడుతుంది. ఒకటి, తుది తీర్పున, పేదవారిపట్ల, అవసరములో నున్నవారిపట్ల వారు చూపించే ఆదరణ, సంబంధమును బట్టి, కాపరివలె మేకలను, గొర్రెలను వేరుచేయునట్లు సకల జాతి జనులను వేరుపరచును. అవసరములో నున్నవారిని ఆదరిస్తే, యేసును ఆదరించినట్లే! రెండవదిగా, క్రైస్తవేత్తరులు క్రైస్తవులపట్ల వారి దృక్పధమును బట్టి తుది తీర్పునకు గురియగుదురు - "ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి" (25:40, 45) అన్న పదబంధం ఈ లోకములోని పేదవారు, అక్కరలోనున్న వారినిగాక, క్రైస్తవులను సూచిస్తుంది.
'తుది తీర్పు' సకల జాతిజనులకు వర్తిస్తుంది. ఎందుకన, "రాజ్యమును గూర్చిన ఈ సువార్త సర్వజాతులకు సాక్ష్యముగా ప్రపంచ మంతట ప్రబోధింప బడును. అపుడు అంతము వచ్చును" (మత్త 24:14). మత్తయి సువార్తలో, సువార్తను బోధించడం కన్న, దానిని మన అనుదిన జీవితములో, మన కుటుంబాలలో, సకల దేశాలలో, ప్రతీచోట పాటించడం ముఖ్యం! కృపానుగ్రహమైన దైవప్రేమను తెలుసుకొని లోబడువారు 'గొర్రెలు'! దైవప్రేమకు లోబడనివారు 'మేకలు'! 'గొర్రెలు' నీతిమంతులు మరియు దేవునిచేత దీవింపబడిన వారు. 'మేకలు' శాపగ్రస్తులను సూచిస్తుంది. 'గొర్రెలు' ఆపదలోనున్నవారికి సహాయం చేయువారు. 'మేకలు' ఆపదలోనున్నవారికి సహాయాన్ని నిరాకరించేవారు. కనుక, శాపగ్రస్తులైన 'మేకలు' నిత్య నరకాగ్నిలోనికి (25:41) నిత్య శిక్షకు (25:46) వెడలి పోయెదరు. కాని, నీతిమంతులైన 'గొర్రెలు' నిత్య జీవములో ప్రవేశింతురు (25:46).
ధ్యానించుదాం
మన వ్యక్తిగత మారుమనస్సుకు, పునరుద్ధరణకు తోడ్పడుతుందని, తపస్కాల ఆరంభములోనే, 'తుది తీర్పు'ను గురించిన ఈ సువార్త భాగాన్ని ధ్యానిస్తున్నాము. చెడును పనులను చేయడం బట్టి మాత్రమేగాక, మంచిని చేయకపోవడాన్ని బట్టికూడా తుది తీర్పు ఉంటుందని గ్రహించాలి. తీర్పు దినమున విభజన అనివార్యం లేదా తప్పనిసరి అని అర్ధమగుచున్నది. కనుక, దేవుని కుడిప్రక్కన 'గొర్రెల' సమూహములో ఉండటానికి మనం ప్రతీక్షణం ప్రయాస పడాలి. పొరుగువారి పట్ల - ముఖ్యముగా యేసు సూచించిన ఆకలిగొన్నవారిపట్ల, దాహముగొన్నవారిపట్ల, పరదేశీయులపట్ల, వస్త్రహీనులపట్ల, రోగులపట్ల, చెరసాలలోనున్నవారిపట్ల... దయ, కనికరము కలిగి జీవించాలి. వారికి పరిచర్య చేయాలి. మనం చేయలేని వాటిని బట్టి కూడా తీర్పు ఉంటుందని గుర్తుంచుకుందాం! వారిలో... యేసును  మనం చూడగలగాలి. వారికి ఏ చిన్న సహాయం చేసినను, అది యేసు క్రీస్తుకు చేసినట్లే అని తెలుసుకుందాం (25:40). పేద ప్రజలు ఆకలితో చనిపోవడం దేవుని తప్పు, నిర్లక్ష్యం ఎంతమాత్రము కాదు. వారిలో మనం క్రీస్తును గుర్తించక పోవడం మన తప్పు. తుది తీర్పు, మన ప్రతిభనుబట్టి, నైపుణ్యాలనుబట్టి, ప్రతిష్ట, అదృష్టం, సంపద ప్రజాదరణనుబట్టి ఉండదు. నిత్యావసరాలైన ఆహారం, దుస్తులు, ఆశ్రయం, పరామర్శ, ఆదరణ... విషయాలలో ఇతరులకు మన చేసే సహాయాన్ని బట్టి తుది తీర్పు ఉంటుంది. చిన్న సహాయాన్ని ప్రేమతో చేయాలి.

No comments:

Post a Comment