తపస్కాల మొదటి వారము - బుధవారం (II)

   దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
తపస్కాల మొదటి వారము - బుధవారం
యోనా 3:1-10; లూకా 11:29-32

ధ్యానాంశము: యోనా ప్రవక్త చిహ్నము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "నీనెవె వాసులకు యోనా చిహ్నమైనట్లే ఈ తరమునకు మనుష్యకుమారుడు చిహ్నము అగును" (లూకా 11:30).
ధ్యానము: నేటి సువిషేశములో మతపెద్దలు యేసును ఒక గురుతును కోరుచున్నారు. యూదులు తమ వాదనలను నిజపరచుకోవడానికి, దైవసందేశకులను గురుతులు అడిగేవారు. అయితే వారు యేసును ఒక  గురుతును అడిగినప్పుడు, వారికి ఆయన ఎలాంటి గురుతును ఇవ్వలేదు; అవసరం కూడా లేదు. ఎందుకన, దుష్టులైన వారికి ఎలాంటి చిహ్నము ఒసగినను అర్ధంచేసుకోరని ప్రభువునకు తెలుసు! అందుకే, "యోనా చిహ్నము కంటే వేరొకటి అనుగ్రహింప బడదు" (11:29) అని యేసు వారికి స్పష్టం చేసారు. స్వయముగా యేసుప్రభువే ఒక గురుతు, చిహ్నము. ఆయన వ్యక్తి-రూపం, ఆయన సాన్నిధ్యమే గొప్ప గురుతు, చిహ్నం. ఆయనే దేవుని గురుతు, చిహ్నం. తండ్రి దేవుని దయ, కరుణకు యేసు గొప్ప చిహ్నం. యేసు తన బోధనలలో, కార్యాలలో ఆ తండ్రి దేవుని ప్రేమను వ్యక్తపరచారు. ఆయన చేసిన అద్భుతాలతో దానిని ధృవీకరించారు. అయితే, యూదాధికారులు ఆయనను విశ్వసించలేదు. ఆయనపై, ఆయన బోధనలపై నమ్మకముంచలేదు. యేసును వాకు ఒక సాధారణమైన గురుతుగా మాత్రమే భావించారు. అందుకే, వారు అద్భుతమైన, అసాధారణమైన గురుతును కోరుకుంటున్నారు. మరేదో గొప్ప అద్భుతం కొరకు వారు ఎదురు చూసారు! 
యోనా చిహ్నం యేసు పునరుత్థానానికి చిహ్నముగా నున్నది. "యోనా ప్రవక్త మూడు పగళ్ళు, మూడు రాత్రులు తిమింగల గర్భములో ఉన్నట్లు, మనుష్యకుమారుడును మూడు పగళ్ళు, మూడు రాత్రులు భూగర్భములో ఉండును" (మత్త 12:40).
వాస్తవానికి, యూదులు గురుతులను అడగటానికి అలవాటు పడ్డారు. ఉదాహరణకు, యోనా నీనెవె వాసులకు దేవుని చిహ్నం. ఆయన సందేశం వారికి దేవుని చిహ్నం. యోనా వారికి బోధించినప్పుడు, నీనెవె వాసులు దేవుని హెచ్చరికను గుర్తించి పశ్చాత్తాప పడ్డారు. అన్యులైనను, నీనెవె వాసులు దేవుని వాక్యమును ఆలకించి హృదయ పరివర్తనము చెందారు. అలాగే, దక్షిణ దేశపు (ఆఫ్రికా ఖండం, ఎథియోపియా) రాణి అయిన షెబా, సొలోమోనులో దేవుని జ్ఞానాన్ని గుర్తించినది (1 రాజు 10:1-13). యేసు సొలోమోను కంటే అధికుడు... యోనా కంటే గొప్పవాడు" (11:31-32).
అయితే, వారి మధ్యలోనున్న యేసును దేవుని గొప్ప గురుతుగా, చిహ్నముగా యూద మత నాయకులు గుర్తించకపోవడం చాలా విచారకరం! బప్తిస్త యోహాను సందేశాన్ని తిరస్కరించారు. యేసును మెస్సయ్యగా, అభిషిక్తునిగా తిరస్కరించు చున్నారు.
ఇదే విషయం మన జీవితములో కూడా జరగవచ్చు! అనేకసార్లు, యేసును, ఆయన సాన్నిధ్యాన్ని విస్మరించు చున్నాము. దీనికి కారణం, విశ్వాసం లేకపోవడం, ఆధ్యాత్మిక దాతృత్వం లేకపోవడం. కొన్నిసార్లు, జాతకాలను, మూఢనమ్మకాలను నమ్ముతూ ఉంటాము!
యేసు మన జీవితాలలో ఎన్నో అద్భుత కార్యాలను చేసారు. ఎన్నో సంకేతాలను ఆయన చేసారు. ఆయన చేసిన అద్భుత చిహ్నాలలో "దివ్యబలిపూజ" ఒకటి. పూజలో, అప్పద్రాక్షరసములను, తన శరీరరక్తములుగా ఒసగి మనలను పోషిస్తున్నారు. దివ్యసత్ర్పసాద రూపములో తన సన్నిధిని, సాన్నిధ్యాన్ని అద్భుతరీతిన ప్రదర్శిస్తున్నారు.

No comments:

Post a Comment