దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
తపస్కాల మొదటి వారము - శుక్రవారం
యెహెజ్కె 18:21-28; మత్త 5:20-26
ధ్యానాంశము: నీతిమంతమైన జీవితము - పరలోక రాజ్యము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "ధర్మశాస్త్రబోధకులకంటె, పరిసయ్యులకంటె మీరు నీతిమంతమైన జీవితము జీవించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరు" (మత్త 5:20).
ధ్యానము: 5:20 ఒక హెచ్చరిక! "నీతిమంతమైన జీవితమును జీవించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరు." యేసు బోధనలకు విధేయులమై జీవించాలి. పరిసయ్యులు, ధర్మశాస్త్రబోధకులలో కొంతమంది చట్టాన్ని ఆసరాగా చేసుకొనేవారు. చట్టాన్ని దుర్వినియోగం చేసేవారు. చట్టాన్ని పాటించుటలో కపటాన్ని ప్రదర్శించేవారు. 'నీతి', 'పరలోక రాజ్యం' దేవునికి చెందినవి. ఈ రెండింటి ప్రాధమిక భావం దైవ ప్రేమ - పరిపూర్ణ ప్రేమ లేదా పవిత్రమైన ప్రేమ. మనం షరతులు లేకుండా అనంతముగా ప్రేమించాలి.
యేసు చట్టాన్ని ఖండించుటకు రాలేదు. దానిని పరిపూర్ణం చేయడానికి వచ్చారు (5:17). యేసు చట్టాన్ని వివరించే క్రమములో ప్రధానమైన అంశం "పరిపూర్ణ ప్రేమ"ను జోడించారు. మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల ఉపదేశములు, దైవప్రేమ, సోదరప్రేమ అను రెండు ఆజ్ఞలపై ఆధారపడియున్నవని యేసు స్పష్టం చేసారు (మత్త 22:34-40; మార్కు 12:28-34).
నేడు కూడా కపటం అనే ముసుగులో నీతి చిక్కుకొని పోయింది. మనలో అనేకమందిమి ఇతరులపై తీర్పు చేస్తాము; వారిని ఖండిస్తాము. కాని మన వ్యక్తిగత ప్రవర్తన గురించి ఆలోచించము! మనకు మనం నీతిమంతులం అని చెప్పుకుంటే అది కపటమే! కనుక, దేవుని దృష్టిలో నీతిమంతులముగా జీవించాలి.
యేసు మనలనుండి అవసరమైనది (minimum) మాత్రమేగాక, ఎక్కువగా (maximum) ఆశిస్తారు. హత్య, వ్యభిచారం, విడాకులు ఒట్టుపెట్టుకోవడం, ప్రతీకారం మొదలగు వాటిని (పరిసయ్యులు, ధర్మశాస్త్రబోధకులవలె) నివారించడం మాత్రమేగాక, కోపమును, అవమానపరచుటను, మనస్పర్ధలను, దూషణలను, కామమును, కామపు చూపులను మొదలగు వాటిని (పరిసయ్యులు, ధర్మశాస్త్రబోధకులకంటె) కూడా నివారించాలి. ప్రతివాదితో త్రోవలోనే సఖ్యత పడాలి. శత్రువులను మరియు హింసించువారిని ప్రేమించాలి. అందరితో సఖ్యతగా ఉండాలి. తమనుతాము ప్రేమించునట్లుగా ఇతరులను ప్రేమించాలి.
విచ్చలవిడిగా, వక్రమార్గములో జీవించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి! ఈ సువార్త సత్యాలను ఎలా జీవించాలి? దైవాజ్ఞలు తెలుసుకుంటే సరిపోదు, వాటిని అనుదినం పాటించాలి. చట్టాన్ని సూక్ష్మముగా, నిశితముగా లేదా అక్షరాల పాటిస్తే సరిపోదు; దేవుని పవిత్రతలో జీవించాలి, నీతిగా, ప్రేమగా జీవించాలి.
నరహత్య చేయరాదు (5:21) - సోదరునిపై కోపపడటం, సోదరుని అవమానపరచడం, సోదరుని అవివేకి అని పిలవడం కూడా నరహత్యతో సమానమే! అందుకు తప్పక దేవుని తీర్పుకు గురి అవుతాము. కోపము విరోధాన్ని కలిగిస్తుంది. మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయడమేగాక, ఇతరులపట్ల ద్వేషాన్ని పెంచుతుంది. కోపాన్ని దేవునికి తెలియపరచు. కోపములో నెమ్మదించు. కోపాన్ని ఎప్పటికీ పోషించకు. పగ, ప్రతీకారానికి దారితీసే కోపాన్ని తప్పక విచ్చిన్నం చేయి. సఖ్యత - సోదరులతో సఖ్యత పడాలి, దేవునితో సఖ్యత పడాలి.
No comments:
Post a Comment