తపస్కాల మొదటి వారము - శనివారం (II)

 దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
తపస్కాల మొదటి వారము - శనివారం
ద్వితీ 26:16-19; మత్త 5:43-48

ధ్యానాంశము: పరిపూర్ణ ప్రేమ
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక!" (మత్త 5:48).
ధ్యానము: మన ఆలోచనలలో సంపూర్ణమైన మార్పు రావాలని యేసు ప్రభువు ఆశిస్తున్నారు. అందుకే, "మీ శత్రువులను ప్రేమింపుడు. మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్ధింపుడు" (5:44) అని చెబుతున్నారు. "పొరుగువారిని ప్రేమించండి" అని మోషే చట్టము (ధర్మశాస్త్రము)లో కూడా చెప్పబడింది. "పొరుగువారు" ఎవరు అన్నది స్పష్టం చేయబడలేదు. యూదులు, కేవలం తోటి యూదులను (ఇస్రాయేలు ప్రజలు, హెబ్రీయులు) రక్తసంబంధీకులను మాత్రమే పోరుగువారిగా భావించేవారు. కనుక, శత్రువులను ప్రేమంచడం అనేది యూదులకు పిచ్చితనం, మూర్ఖత్వం! కాని, యేసు పాత ధర్మశాస్త్రానికి, చట్టానికి ఓ నూతన అర్ధాన్ని ఇస్తున్నారు; పరిపూర్ణమైన అర్ధాన్ని ఇస్తున్నారు. మన 'పొరుగువారు' ఎవరో స్పష్టం చేయుచున్నారు. ఈవిధముగా, ప్రభువు పరిపూర్ణమైన ప్రేమను మనలనుండి ఆశిస్తున్నారు. 
ఈ ఆజ్ఞను పాటించడం చాలా కష్టం! మనలను హింసించేవారిని, బాధించేవారిని మనం ఎలా ప్రేమించగలం? అసలు శత్రువులను ఎందుకు ప్రేమించాలి? మన ప్రేమకు వారు యోగ్యులని వారిని ప్రేమించడం కాదుగాని, వారిని ప్రేమతోకూడిన దయ, కనికరము చూపాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇది దేవుని చిత్తం, ఆజ్ఞ! దేవుడు "దుర్జనులపై, సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా ప్రకాశింప జేయుచున్నారు. సన్మార్గులపై, దుర్మార్గులపై వర్షము ఒకేవిధముగా వర్షింప జేయుచున్నారు" (5:45). దేవుడు మంచివారిపట్ల, చెడ్డవారిపట్ల, నీతిమంతులపట్ల, అవినీతిమంతులపట్ల మంచినే చూపుతాడు. ఆయన ప్రేమ పునీతున్ని, పాపాత్మున్ని ఒకే విధముగా హత్తుకుంటుంది. దేవుడు మనలో పరిపూర్ణతను కోరుకుంటున్నారు. మన శత్రువుల (హింసించేవారు, బాధించేవారు) పరిపూర్ణతను కూడా మనం కోరుకోవాలని దేవుడు బోధిస్తున్నారు. మనపట్ల కృతజ్ఞతలేనివారిని, మనపట్ల స్వార్ధపరులను కూడా మనం ప్రేమించాలి. దేవుడు మనపై చూపించే ప్రేమ, దయ, కరుణను వారిపై చూపాలి.
క్రీస్తు శిష్యులను ద్వేషించేవారు' శత్రువులు; శిష్యులు ద్వేశించేవారు శత్రువులు కాదు. ఎందుకన, క్రీస్తు శిష్యులు ఎవరిని కూడా ద్వేషించ కూడదు. మనపట్ల ఇతరుల వైఖరిని మనం మార్చలేము; కాని, ఇతరులపట్ల మన వైఖరిని మనం మార్చుకోవచ్చు. కనుక, ద్వేషానికి, ద్వేషాన్ని, శత్రుత్వానికి శత్రుత్వాన్ని ప్రభువు కోరుకోవడం లేదు. మన ప్రేమనుండి మనం ఏ ఒక్క వ్యక్తిని కూడా మినహాయించ కూడదు. యేసు దీనిని పాటించి మనకు మార్గదర్శముగా చూపారు. 'శత్రువులు' ఆయనను సిలువపై చంపుతున్నప్పటికిని, "తండ్రీ! వీరు చేయునదేమో వీరు ఎరుగరు. వీరిని క్షమింపుము" (లూకా 23:34) అని తనను ద్వేషించిన వారికొరకు, బాధించిన వారికొరకు ప్రార్ధించారు. న్యాయం కన్న, క్షమాపణ మనలను ఎక్కువగా స్వస్థత చేకూరుస్తుంది.
మిమ్ము ప్రేమించువారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును? మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియజేసినచో మీ ప్రత్యేకత యేమి?" (5:46-47).
పరిపూర్ణత - పరిపూర్ణత యనగా పవిత్రముగా జీవించడం; పవిత్రత యనగా దైవప్రేమ సహవాసములో జీవించడం. పవిత్రత యనగా దేవునితోను, ఇతరులతోను సన్నిహిత స్నేహబంధములో ఎదగటం! రక్షణ యనగా నిత్యజీవము లేదా దైవరాజ్యములో ప్రవేశించుట. ఇది పరిపూర్ణతను సూచిస్తుంది. నీతి నిమిత్తమై ఆకలిదప్పులు కలవారు, పరిపూర్ణత కొరకు తపిస్తారు. "మొదట దేవుని రాజ్యమును, నీతిని వెదకుడు" (మత్త 6:33). దేవునిపట్ల, సోదరులపట్ల అనంతమైన ప్రేమకలవారు పవిత్రులు.
- దైవాజ్ఞలను పాటిస్తున్నావా? - ఇతరులను క్షమించు చున్నావా?
యేసు ప్రభువా! పాపమును జయించుటకు నాకు సహాయం చేయుము. ప్రతీ ఒక్కరిని క్షమించుటకు సహాయము చేయుము. ఇతరులతో సఖ్యత పడుటకు సహాయం చేయుము. అందరిని ప్రేమించుటకు సహాయం చేయుము. పరిపూర్ణ వ్యక్తిగా జీవించుటకు సహాయం చేయుము.

No comments:

Post a Comment