తపస్కాల మొదటి వారము - గురువారం (II)

 దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
తపస్కాల మొదటి వారము - గురువారం
ఎస్తేరు 14:1, 3-5, 12-15; మత్త 7:7-12

ధ్యానాంశము: ప్రార్ధన - మూల ధర్మము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "ఇతరులు మీకేమి చేయవలెనని మీరు కోరెదరో, దానిని మీరు పరులకు చేయుడు" (మత్త 7:12).
ధ్యానము: నేటి సువిషేశము ప్రార్ధన గురించి బోధిస్తుంది. ప్రార్ధనలో ప్రభువునందు విశ్వాసము, నమ్మకం ఉంచాలి. మనకు ఏదైనా అవసరము ఉన్నప్పుడు మాత్రమేగాక, ఎల్లప్పుడు ప్రార్ధన చేయాలి, నిరుత్సాహ పడకూడదు (లూకా 18:1). "అడుగుడు మీ కొసగ బడును. వెదకుడు మీకు దొరకును. తట్టుడు మీకు తెరవ బడును" (మత్త 7:7) అని యేసు చెప్పారు. పట్టుదలతో ప్రార్ధన చేయాలని ప్రభువు తెలియజేయుచున్నారు. క్రమం తప్పకుండా ప్రార్ధన చేయాలి. "అడిగిన ప్రతివానికి దొరకును. తట్టిన ప్రతివానికి తెరువబడును" (7:8). ప్రార్ధన మన బలం. ప్రార్ధన ఒక బలమైన ఆయుధం. ప్రార్ధనాశక్తి దేవునినుండే వస్తుంది. దేవునిపై మనం ఆధారపడినప్పుడే, మనం బలవంతులము అవుతాము.
మొదటి పఠనములో ఎస్తేరు ప్రార్ధన గురించి వింటున్నాము. ఎప్పుడైతే శత్రువులు యూదులను సర్వనాశనం చేయాలని వల పన్నారో, ఎస్తేరు విశ్వాసముతో దేవున్ని ప్రార్ధించినది. ఆమె ప్రార్ధనలో అడిగినది, ఆమెకు ఒసగబడినది.
"అడుగుడు మీ కొసగ బడును"
ఈ లోకములో తల్లిదండ్రులు వారి పిల్లలకు కావలసిన అవసరములను తీరుస్తూ ఉంటారు (7:9-11). చెడ్డవారైనను, బిడ్డలకు మంచి బహుమానాలనే ఇస్తారు. అటులయిన, "పరలోకమందున్న మీ తండ్రి అడిగిన వారికి ఇంకెట్టి మంచి వస్తువుల నిచ్చునో ఊహింపుడు" (7:11) అని యేసు పలుకుచున్నారు.
"మీరు ఆశించుచున్నారు గాని పొందుట లేదు... మీకేమి కావలయునో వాని కొరకై దేవుని అర్ధింపక పోవుట చేతనే, మీకు కావలసిన వానిని పొందలేకున్నారు. మీవి దురుద్దేశములగుట చేతనే మీరు అర్ధించినవి మీకు లభింపకున్నవి. మీ భోగానుభవమునకై మీరు వానిని కోరుదురు గదా!" (యాకోబు 4:2-3). కనుక, సరియైన వాటికొరకు మాత్రమే ప్రార్ధన చేయాలి.
"దేవుని చిత్తాను సారముగ, ఆయనను మనము ఏదేని కోరినచో, ఆయన తప్పక వినునని మనకు ఆయన యందు నమ్మకము కలదు. మనము ఏమి అడిగినను ఆయన మన మనవిని ఆలకించునని మనకు తెలియును. కనుక మనము కోరినది ఆయన ఒసగునని మనకు తెలియును" (1 యోహాను 5:14-15).
"వెదకుడు మీకు దొరకును"
వెతకడం నిరాశను కలిగించినను, వదలకూడదు. "మొదట దేవుని రాజ్యమును, నీతిని వెదకుడు. అప్పుడు అన్నియు మీకు అనుగ్రహింప బడును" (మత్త 6:33) అని యేసు శిష్యులకు తెలిపియున్నారు. 
"మీరు పూర్ణహృదయముతో నన్ను వెదకుదురు. నేను మీకు దొరుకుదును" (యిర్మియా 29:13).
"నా ప్రజలు తమ పాపములకు తగిన శ్రమలనుభవించి, నన్ను వెదకుకొనుచు వచ్చు వరకు నేను వారిని విడనాడి నా తావుకు వెళ్లి పోవుదును. వారు తమ బాధలోనైన నా కొరకు గాలింప వచ్చును" (హోషేయ 5:15).
"మీరు నా చెంతకు రండు, జీవము బడయుడు. మీరు నన్ను ఆరాధించుటకు బేర్షేబా వెళ్ళకుడు. బేతేలున నన్ను వెదకకుడు, అది శూన్యమగును. గిల్గాలుకు పోవలదు, ఆ పురవాసులకు ప్రవాసము తప్పదు. మీరు ప్రభువు వద్దకు రండు, జీవము బడయుడు... (ఆమోసు 5:4-6).
"ప్రభువు దొరుకునప్పుడే ఆయనను సమీపింపుడు. ఆయన చేరువలో నున్నప్పుడే ఆయనకు ప్రార్ధన చేయుడు" (యెషయ 55:6).
"తట్టుడు మీకు తెరవ బడును"
మూసియున్న తలుపులను తెరువ బడుటకు తట్టుచూ ఉంటాము! 'తట్టుట' దేవుడు ఒసగు అవకాశమును సూచిస్తుంది.
"వారు అక్కడకు చేరుకొని క్రీస్తు సంఘములోని ప్రజలను ప్రోగుచేసి, దేవుడు వారితో ఉండి చేసినదంతయు, అన్యులు విశ్వసించుటకు, ఆయన ద్వారమును ఎట్లు తెరచినదియు వారికి తెలియజేసిరి" (అ.కా 14:27).
"పెంతకోస్తు దినము వరకు ఎఫెసులోనే గడిపెదను. పెక్కుమంది విరోధులున్నను సముచితమగు కృషి సలుపుటకు ఎంతయో అవకాశము ఉన్నది. దానికి తగిన విశాలమైన తలుపు నా కొరకు తెరువబడి వుంది" (1 కొరి 16:8-9).
"క్రీస్తును గూర్చిన సువార్తను బోధించుటకు నేను త్రోయను చేరినపుడు, ప్రభువు నా పనికి అప్పటికే అచ్చట మార్గము ఏర్పరచి ఉంచెనని కనుగొంటిని" (2 కొరి 2:14).
"దేవుని సందేశమును బోధించుటకును క్రీస్తు రహస్యమును వివరించుటకును దేవుడు మాకు మంచి అవకాశము ఇవ్వవలెనని ప్రార్ధింపుడు" (కొలొస్సీ 4:3).
దేవుడు మనకు అవకాశము ఇచ్చేవరకు, ద్వారములు తెరచే వరకు, తట్టుచూ ఉందాము (ప్రార్ధన)!
మూల ధర్మము
"ఇతరులు మీకేమి చేయవలెనని మీరు కోరెదరో, దానిని మీరు పరులకు చేయుడు" (మత్త 7:12).

No comments:

Post a Comment