దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
విభూతి బుధవారం తరువాతి శనివారం
యెషయ 58:9-14; లూకా 5:27-32
ధ్యానాంశము: సుంకరికి శిష్యస్థానము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "వ్యాధిగ్రస్తులకే కాని, ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు గదా! హృదయ పరివర్తనము పొందుటకై పాపులను పిలువ విచ్చితిని కాని, నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదు" (లూకా 5:31-32).
ధ్యానము: నేటి సువిశేషములో, యేసు 'లేవి' అను సంకరిని [రోమను అధికారం తరుపున, సుంకమును వసూలు చేయువాడు], తన శిష్యునిగా, అపోస్తలునిగా పిలచుచున్నారు (5:27). ఇప్పటికే యేసు జాలరులను (పేతురు, అంద్రేయ, యాకోబు, యోహాను) తన శిష్యులుగా పిలుచుకున్నాడు. ఇప్పుడు పాపిగా సమాజములో పరిగణింప బడిన ఒక సుంకరిని, యేసు పిలచియున్నారు. పాపాత్ములకు, సుంకరులకు యేసు స్నేహితుడయ్యారు! యేసు మనదరి స్నేహితుడు. మనం అనేకసార్లు ఆయన స్నేహాన్ని విస్మరించి యుండవచ్చు కాని, యేసు తన సన్నిహిత స్నేహాన్ని మనతో కొనసాగిస్తూనే ఉంటారు. యేసుతో మన స్నేహాన్ని ఎప్పటికప్పుడు పునరుద్దరించు కోవాలి. ఆయనతో సన్నిహితముగా ఉందాము. ప్రభువు మనతో అంటున్నారు: "తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలువక, స్నేహితులని పిలిచెదను" (యోహాను 15:15).
సుంకపు మెట్టు కడ కూర్చుండి యున్న 'లేవి' అను సుంకరిని యేసు పిలిచారు. లేవి పాపాత్ముడు; అన్యాయముగా అవసరమైనదాని కన్న ఎక్కువ పన్నులను వసూలు చేసేవాడు. ధనవ్యామోహం కలవాడు. అటువంటి సుంకరిని ముందుగా యేసు'చూచారు'. ఆ 'చూపు' చాలా లోతైనది. సుంకరి హృదయాన్ని యేసు చూసారు. భవిష్యత్తులో సుంకరి ఏమి కానున్నాడో యేసు చూసారు. "లేవి అంతయు విడచి పెట్టి యేసును అనుసరించెను" (5:28). అధికారముగల యేసు మాటలు అతనిలో నూతన చైతన్యాన్ని, నూతన జీవాన్ని నింపాయి. అధికార వ్యామోహము నుండి అతను విడుదల పొందాడు. అప్పుడు అతను లేచి, వెంటనే యేసును అనుసరించాడు. "లేవి తన ఇంట యేసుకు గొప్ప విందు చేసెను. అనేక మంది సుంకరులు, ఇతరులు యేసుతో కలిసి విందులో పాల్గొనిరి" (5:29). "విందు" అనేది ప్రధానాంశం. ఇది దేవుని ఆతిథ్యమును కొనియాడుట. విందు సమయములో యేసు బోధనలు చేసేవారు; ప్రజలను హృదయ పరివర్తనకు ఆహ్వానించేవారు. యేసుకు గొప్ప విందును ఏర్పాటు చేయడం ద్వారా, లేవి ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. తన సంతోషాన్ని, తోటి సుంకరులతోను, స్నేహితులతోను పంచుకున్నాడు. ఈ విందు ద్వారా, లేవి స్వార్ధమును వీడి, నిస్వార్ధముగా ఇతరుల గురించి ఆలోచించాడు. తన సంపదను ఇతరులతో పంచుకోవడానికి సిద్ధపడ్డాడు. యేసు తన మీద కనికరము చూపినట్లే, లేవి ఇతరుల పట్ల కనికరాన్ని చూపాడు. ఈ విందుకు, సుంకరులను, పాపాత్ములను ఆహ్వానించాడు. ప్రభువు పలికిన, "హృదయ పరివర్తనము పొందుటకై పాపులను పిలువ విచ్చితిని కాని, నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదు" (5:32) పలుకులను లేవి గ్రహించాడు. "దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కాని, దానిని ఖండించుటకు పంపలేదు" (యోహాను 3:17).
దేవుడు మనలను కూడా పిలుస్తూ ఉంటారు. దేవుని పిలుపుకు మనం ప్రతిస్పందించాలి. దేవుని పిలుపుతో మన పాప జీవితానికి స్వస్తి చెప్పాలి. "దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొనినచో, ఆయన మన పాపములను క్షమించి, మన అవినీతి నుండి మనలను శుద్ధిచేసి, నీతిని చేకూర్చును" (1 యోహాను 1:9).
No comments:
Post a Comment