తపస్కాల ఐదవ వారము - శుక్రవారం (II)

దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
తపస్కాల ఐదవ వారము - శుక్రవారం
యిర్మియా 20:10-13; యోహాను 10:31-42 

ధ్యానాంశము: యూదుల తిరస్కారము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "తండ్రి నాయందును, నేను తండ్రి యందును ఉన్నాము" (యోహాను 10:38).
ధ్యానము: యూదులు మరల యేసును రాళ్ళతో కొట్టుటకు రాళ్ళను తీసుకొనిరి. తనను ఏ కారణము చేత రాళ్ళతో కొట్టుచున్నారు? అని యేసు వారిని ప్రశ్నించారు. "నీవు మనుష్యుడవై ఉండియు, దేవుడనని అనుచున్నావు. కావున దేవదూషణము చేసినందులకు నిన్ను రాళ్ళతో కొట్టుచున్నాము" అని అన్నారు. నన్ను తండ్రి ఈ లోకమునకు పంపెను. నేను దేవుని కుమారుడను. మీరు నన్ను నమ్మకపోయినను, నా క్రియలైనను నమ్ముడు అని యేసు అనెను. అయినను వారు మరల యేసును పట్టుకొనుటకు ప్రయత్నించిరి.

యేసు మరల, తాను, తండ్రి ఒకటేనని తెలియజేయు చున్నారు. "నేనును, నా తండ్రియు ఏకమై యున్నాము" (10:30). "తండ్రి నాయందును, నేను తండ్రి యందును ఉన్నాము" (10:38). దీనిని యూదులు దైవదూషణగా భావించారు. యేసు చేసిన క్రియలు - అద్భుతాలు, స్వస్థతలు - దేవుని చిత్తాన్ని వ్యక్తపరుస్తున్నాయి. అందుకే యేసు, "నా క్రియలైనను నమ్ముడు" అని అన్నారు. యేసు సత్యమును తెలుపుటకు శతవిధాల ప్రయత్నం చేసారు. కాని 'యూదులు' ఆయనను విశ్వసించలేదు. వారిలో ఎలాంటి మార్పు, మారుమనస్సు కలగలేదు. 

పవిత్ర వారము / శ్రమల వారము దగ్గర పడుతున్న కొలది, యేసుపై అధికారుల ఆగ్రహము పెరిగిపోవుచున్నది. అయినను, యేసు సత్యము కోసమే నిలబడినాడు. అసత్యానికి, అబద్ధాలకు ఏమాత్రము చోటు ఇవ్వలేదు. మన శ్రమలను, యేసు శ్రమలతో జత చేద్దాం. ఆయనను సంపూర్ణముగా విశ్వసించుదాం!

యేసు తండ్రి దేవుని యొద్దకు మనలను నడిపించుటకు, ఆయనలో మనలను ఐఖ్యము చేయుటకు వచ్చెను. యేసు మన మంచి కాపరి. 

No comments:

Post a Comment

Pages (150)1234 Next