దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
తపస్కాల ఐదవ వారము - శనివారం
యెహెజ్కె 37:21-28; యోహాను 11:45-57
ధ్యానాంశము: క్రీస్తుపై కుట్ర
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "మరియమ్మతో కలసి వచ్చి ఈ అద్భుతమును చూచిన యూదులలో పలువురు ఆయనను విశ్వసించిరి." (యోహాను 11:45).
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "మరియమ్మతో కలసి వచ్చి ఈ అద్భుతమును చూచిన యూదులలో పలువురు ఆయనను విశ్వసించిరి." (యోహాను 11:45).
ధ్యానము: యేసు శత్రువులు ఎలాగైనా ఆయనను చంపాలని నిర్ణయించారు.మరణించిన మరియ, మార్తమ్మల సోదరుడు లాజరును యేసు సజీవముగా లేపెను (యోహాను 11:38-44). ఈ అద్భుతమును చూచిన యూదులలో పలువురు యేసును విశ్వసించిరి. కాని వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్లి, యేసు చేసిన ఈ అద్భుతమును గురించి వివరించారు. ఈ అద్భుతం యూద నాయకులను ఎంతగానో కలవర పెట్టింది. ప్రజలు యేసును రాజుగా చేస్తారేమో అని భయపడ్డారు. అలా చేస్తే, రోమీయులనుండి ముప్పు ఉంటుందని గ్రహించారు.
అంతట, ప్రధానార్చకులు, పరిసయ్యులు సభను సమావేశ పరచి, యేసు అనేక అద్భుత చిహ్నములు చేయుచున్నాడు, కనుక ప్రజలందరు అతనిని విశ్వసింతురు. అపుడు రోమీయులు వచ్చి, మన పవిత్ర స్థలమును, మన జాతిని రెంటిని నాశనము చేసెదరు. కనుక, ప్రధానార్చకుడైన కైఫా, 'ఒక్కడు ప్రజల కొరకు మరణించుటయే శ్రేయస్కరము' అని ప్రవచించినట్లే, సమావేశములో యేసును చంపుటకు నిర్ణయించిరి. యేసును చంపుట వలన, ప్రజలను కాపాడవచ్చు అని భావించారు. కావున వారు ఆనాటి నుండియు యేసును తుద ముట్టించుటకు కుట్రలు పన్నుచుండిరి. అయితే, యేసు మరణించిన తరువాత, క్రీ.శ. 67లో యూదులు, రోమనులపై తిరుగుబాటు చేసిరి. క్రీ.శ. 70లో, రోమీయులు, యెరూషలేము నగరాన్ని, దేవాలయమును, సర్వనాశనం చేసారని మనందరికీ తెలిసిన విషయమే!
నిజమైన రక్షణను యూద పెద్దలు అర్ధం చేసుకోలేక పోయారు. రక్షణ, విముక్తి అంటే, కేవలం రోమీయులనుండి స్వతంత్రం అని భావించారు. యేసునందు విశ్వాసము వలన తండ్రి దేవునితో సహవాసం నిజమైన రక్షణ. యేసు ఒసగు నిత్యజీవమును పొందుట నిజమైన రక్షణ.
No comments:
Post a Comment