తపస్కాల ఐదవ వారము - గురువారం (II)

దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
తపస్కాల ఐదవ వారము - గురువారం
ఆ.కాం. 17:3-9; యోహాను 8:51-59 

ధ్యానాంశము: యేసు - అబ్రహాము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "అబ్రహాము జన్మించుటకు పూర్వమే నేను ఉన్నాను అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" (యోహాను 8:58).
ధ్యానము: యోహాను 8 వ అధ్యాయములో, యేసు తనను గురించి నాలుగు ప్రధాన విషయాలను పేర్కొన్నారు: (1). లోకమునకు వెలుగును నేనే (8:12); (2). ఆయన బోధనలను ఆలకించువారు, స్వతంత్రులగుదురు (8:31-32); (3). ఆయన మాటను పాటించువాడు ఎన్నటికిని మరణమును చవిచూడడు (8:51); (4). అబ్రహాము జన్మించుటకు పూర్వమే నేను ఉన్నాను అని నిశ్చయముగా చెప్పియున్నాడు (8:58). అయినను, యూదనాయకులు ఆయనను విశ్వసించలేదు. చివరి విషయములో "నేను ఉన్నాను" అని చెప్పడముతో, యేసు దేవుని నామమును (యావే YHWH) తనకు అన్వయించుకున్నారు. తద్వారా, యేసు తన దైవీక స్వభావమును స్పష్టముగా తెలియజేయు చున్నాడు. తాను దేవుని యొద్ద నుండి వచ్చారని, దేవునితో సమానమని అర్ధమగుచున్నది. యూదులు ఎవరుకూడా "యావే" నామమును ఉచ్చరించరు. యేసును ఏమి చెప్ప ప్రయత్నించాడో ఆయనను ఆలకించినవారికి అర్ధమయినది, కాని  ఆయన చెప్పినదానిని వారు అంగీకరించలేదు, విశ్వసించలేదు. దైవదూషణగా పరిగణించారు. దేవుని దూషించువానిని రాళ్ళతో కొట్టి చంపవలయునని చట్టం బోధిస్తున్నది (లేవీ 24:16). అయితే, వాస్తవం ఏమిటంటే, యేసు నిజముగా దేవుడు కనుక, "నా మాటను పాటించువాడు ఎన్నటికిని మరణమును చవిచూడడు" (8:51) అని చెప్పగలిగారు. దేవుడు మాత్రమే ఇలాంటి వాగ్దానం చేయగలరు.

కొందరు మాత్రం యేసుకు దయ్యం పట్టినదని అన్నారు (8:52). నీవు అబ్రహాముకంటే, ప్రవక్తలకంటే గొప్పవాడవా? అని ప్రశ్నించారు. ఆయనపై రాళ్ళురువ్వ పూనుకున్నారు.

మనం క్రీస్తు మాటలను ఆలకించుదాం; పాటించుదాం. "నేడు మీరు ఆయన మాట వినిన ఎంత బాగుండును" (కీర్త 95:7). యేసు జీవము కలవాడు, కనుక ఆయనను అంటిపెట్టుకొని యున్నచో, మనం జేవము కలిగి యుందుము.

No comments:

Post a Comment