దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
తపస్కాల ఐదవ వారము - బుధవారం
దానియేలు 3:14-20, 91-92, 95; యోహాను 8:31-42
ధ్యానాంశము: స్వతంత్రులు - దాసులు
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "మీరు నా మాటపై నిలిచి యున్నచో నిజముగా మీరు నా శిష్యులై ఉందురు. మీరు సత్యమును గ్రహించెదరు. సత్యము మిమ్ము స్వతంత్రులను చేయును." (యోహాను 8:31-32).
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "మీరు నా మాటపై నిలిచి యున్నచో నిజముగా మీరు నా శిష్యులై ఉందురు. మీరు సత్యమును గ్రహించెదరు. సత్యము మిమ్ము స్వతంత్రులను చేయును." (యోహాను 8:31-32).
ధ్యానము: పాపము చేయు ప్రతివాడు, పాపమునకు, సాతానుకు దాసుడు. యేసు పరిసయ్యులతో, సత్యము మిమ్ము స్వతంత్రులను చేయును అని చెప్పగా, వారు వెంటనే, మేము ఎవరికి దాసులమై యున్నామని, మేము స్వతంత్రులమగుదము అని చెప్పుచున్నావు? మేము అబ్రహాము వంశీయులము, మేము ఎన్నడును, ఎవరికిని దాసులమై ఉండలేదు అని సమాధాన మిచ్చారు. కాని, వాస్తవానికి, వారు పాపానికి దాసులై యున్నారని గ్రహించలేక పోయారు. వారి పాపం, యేసును మెస్సయ్యగా, క్రీస్తుగా విశ్వసించక పోవడం! 'అబ్రహాము వంశీయులు' అని గర్వపడ్డారు. అబ్రహామును వారి తండ్రిగా పిలిచేవారు. మేము ఎన్నడును, ఎవరికిని దాసులమై ఉండలేదు అని అన్నారు. వారి చరిత్ర చూస్తే, అనేక దేశాలకు, అస్సీరియ, బబులోనియ, పర్షియ, మాసిడోనియాకు బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు రోమనులకు బానిసలుగా జీవిస్తున్నారు. అయితే, వారి ఉద్దేశ్యం ఇది కాదు; బబులోనియ దాసత్వం తరువాత, వారు ఏ అన్యదేవుల్లను ఆరాధించలేదు అని వారి భావం! అందుకే యేసు వారి భావాన్ని సరిచేయుచున్నారు: "పాపము చేయు ప్రతి వాడును, పాపమునకు దాసుడు. దాసుడు ఎల్లప్పుడు ఇంటిలో నివసించడు. కాని, కుమారుడు ఎల్లప్పుడు నివసించును. కుమారుడు మిమ్ము స్వతంత్రులను చేసిన యెడల నిజముగ మీరు స్వతంత్రులై ఉందురు" (యోహాను 8:34-36).
మీరు నిజముగా అబ్రహాము పుత్రులైతే, ఆయన పనులను చేయుదురు అని యేసు వారితో చెప్పారు. అబ్రహాము దేవుని చిత్తాన్ని శిరసావహించాడు. దేవుని మాటలను ఆలకించాడు. దేవుని మాట కొరకు, తన కుమారుడు ఇసాకును కూడా అర్పించడానికి సిద్ధపడ్డాడు. కాని పరిసయ్యులు, లోపల ఎంతో ద్వేషాన్ని కలిగి యున్నారు. యేసును చంపడానికి సిద్ధపడ్డారు. అందుకే యేసు వారిని "సైతాను సంతానము" (8:44) అని పిలిచాడు. వారు ఎలా అబ్రహాము సంతతి కాగలరు? అప్పుడు 'దేవుడొక్కడే మా తండ్రి' అని అన్నారు. అందుకు యేసు, "నిజముగా దేవుడు మీ తండ్రి అయినచో మీరు నన్ను ప్రేమించి ఉండెడి వారు. ఏలయన, నేను ఆయన యొద్ద నుండి బయలుదేరి వచ్చియున్నాను. ఆయన పంపుట వలననే వచ్చితిని కాని, నాయంతట నేను రాలేదు" అని అన్నారు.
కేవలం బాహ్య పరిమితులు / హద్దులు లేకపోవడం నిజమైన స్వతంత్రం కాదు. సత్యాన్ని తెలుసుకోవడం, సత్యాన్ని గ్రహించడం నిజమైన స్వతంత్రము. ఆ సత్యము క్రీస్తు ప్రభువే! ఆయనను తెలుసుకోవడం అంటే, ఆయనతో సహవాసం కలిగి యుండటం. దేవుని బిడ్డలమగు భాగ్యమును కలిగి యుండటం (యోహాను 1:12). క్రైస్తవులం అంటే క్రీస్తువలె జీవించాలి. దేవుని బిడ్డలముగా జీవించాలి.
No comments:
Post a Comment