విభూతి బుధవారం తరువాతి శుక్రవారం (II)

 దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
విభూతి బుధవారం తరువాతి శుక్రవారం
యెషయ 58:1-9; మత్త 9:14-15

ధ్యానాంశము: ఉపవాసము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: ""పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము పెండ్లికి వచ్చినవారు ఏల శోకింతురు? పెండ్లి కుమారుడు వారి వద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును. అపుడు వారు ఉపవాసము చేయుదురు"" (మత్త 9:15).
ధ్యానము: నేటి సువిశేషములో, బప్తిస్త యోహాను శిష్యులు యేసు వద్దకు వచ్చి, "మేము, పరిస్యయులు కూడా, తరుచుగా ఉపవాసము ఉందుము గాని, మీ శిష్యులు ఎన్నడును ఉపవాసము ఉండరేల?" అని ప్రశ్నించారు. అందుకు యేసు, "పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము పెండ్లికి వచ్చినవారు ఏల శోకింతురు? పెండ్లి కుమారుడు వారి వద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును. అపుడు వారు ఉపవాసము చేయుదురు" అని సమాధాన మిచ్చెను. ఇచ్చట 'పెండ్లి కుమారుడు' అనగా యేసు క్రీస్తు ప్రభువే! ఆయన శిష్యులతో ఉన్నాడు కనుక, వారు ఉపవాసము చేయనవసరము లేదు అని ప్రభువు తెలియజేయు చున్నారు. దైవరాజ్యమునకు సూచనయైన యేసు సాన్నిధ్యం దేవుని ప్రేమకు, ఘనతకు గురుతు. యేసు సాన్నిధ్యాన్ని సంతోషముతో కొనియాడాలి. అయితే నేడు ప్రభువు భౌతికముగా మన సమక్షములో లేరు కనుక మనం ఉపవాసం ఉండాలి.
ఉపవాసము పవిత్రమైన కార్యము. ఉపవాసము కేవలం ఇంద్రియనిగ్రహము కోల్పోకుండా ఉండుటకు మాత్రమేగాక, ప్రార్ధన చేయుటకు సహాయ పడును. శారీరక ఆకలి, మన ఆధ్యాత్మిక ఆకలిని గుర్తు చేస్తుంది. ఉపవాసం అన్ని మతాలలో ఎంతో ప్రాముఖ్యతను కలిగియున్నది. ఇది పాపాన్ని పోగొట్టడానికి, హృదయశుద్ధి చేయడానికి ఉపయుక్తముగా ఉంటుంది. ఉపవాసం పశ్చాత్తాపానికి, తపస్సుకు సంకేతం. మనలో మారుమనస్సు కలగకపోతే, ఉపవాసం అర్ధరహితం! ఉపవాసం దానధర్మాలకు, ప్రార్ధన, దయ, క్షమాపణ, దాతృత్వ కార్యాలకు సూచన. ప్రార్ధనవలె, ఉపవాసము మన పాప తలంపులను జయించుటకు, మన హృదయాలను దేవునివైపునకు మరల్చుటకు ఓ గొప్ప ఆధ్యాత్మిక ఆయుధము. 
నిజమైన ఉపవాసము అంటే ఏమిటో మనం యెషయ 58వ అధ్యాయములో చదవవచ్చు. ఆనాడు ప్రజలు ఉపవాసము ఉండేవారు. కాని, ఉపవాస దినమున వారి లాభమును వారు చూచుకొనేవారు. పని వారిని పీడించేవారు. ఉపవాసము ఉండునపుడు, బూడిదమీద, గోనెమీద పరుండెదరు కాని, వివాదములు చేసి తగవులాడి కొట్టుకొనేవారు. ఇతరులను అవమానించేవారు. దుష్టవాక్కులు పలుకేవారు. విశ్రాంతి దినమున వ్యాపారములు చేసేవారు. కాని, ప్రభువునకు ఇష్టపడు ఉపవాసమిది: "మీరు అన్యాయపు బంధములను విప్పుడు. ఇతరుల మెడమీద కెత్తిన కాడిని తొలగింపుడు. పీడితులను విడిపింపుడు. వారినెట్టి బాధలకు గురిచేయకుడు. మీ భోజనమును ఆకలిగొనిన వారికి వడ్డింపుడు. ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులిండు. మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు" (58:6-7).

No comments:

Post a Comment