తపస్కాల రెండవ వారము - శుక్రవారం (II)

 దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
తపస్కాల రెండవ వారము - శుక్రవారం
ఆ.కాం. 37:3-4, 12-13, 17-28; మత్త 21:33-43, 45-46 


ధ్యానాంశము: యజమానుడు - కౌలుదార్లు

ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "దేవుని రాజ్యము మీ నుండి తొలగింపబడి తగిన ఫలములనిచ్చు వారికి ఈయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" (మత్త 21:43).

ధ్యానము: యేసు ద్రాక్షాతోట ఉపమానమును చెప్పుచున్నారు. గలిలీయ ప్రాంతములో అనేక ద్రాక్షాతోటలు ఉండేవి. యజమానులు వివిధ ప్రాంతాలలో నివసించుట వలన, వారు ద్రాక్షాతోటలను కౌలుకు ఇచ్చేవారు. యజమానులు సరైన సమయములో కౌలు డబ్బులను పోగుచేసుకొనేవారు. దుష్ట కౌలుదారుల గురించి చెప్పినప్పుడు, ప్రధానార్చకులు, పరిసయ్యులు యేసుపై కోపపడ్డారు. వారు అవమానంగా భావించారు. ఎందుకంటే ఈ ఉపమానాలన్నీ కూడా తమ గురించేనని గ్రహించారు. అందుకే యేసును బందీగా పట్టుకొనుటకు ప్రయత్నం చేశారు. ఈ ఉపమానం నేడు మనకు కూడా వర్తిస్తుంది.

ఈ ఉపమాన సందేశం ఏమిటి? ముందుగా ఇది తండ్రి దేవుని గురించి తెలుపుతుంది: దేవుడు ఉదారస్వభావము కలవాడు మరియు నమ్మదగినవాడు. ద్రాక్షాతోట యజమాని కౌలుదారులను నమ్మినట్లుగానే, దేవుడు మనలను కూడా నమ్ముచున్నారు. మనకు కావలసినంత స్వతంత్రాన్ని కూడా ఇస్తున్నారు. కానీ, కౌలుదారులు యజమానిని మోసం చేశారు. అతని సేవకులను చంపారు. కుమారుని చంపారు. కౌలుదారులవలె, అనగా ప్రధానార్చకులు, పరిసయ్యుల వలె మనం కూడా ప్రవర్తిస్తూ ఉంటాము. ఆత్మపరిశీలన చేసుకుందాం!

దేవుడు ఓదార్పుకలవాడు మరియు న్యాయమంతుడు అని తెలుపుతుంది. దేవుడు అనేకసార్లు మనలను క్షమిస్తూ ఉంటారు. "మన పాపములకు తగినట్లుగా మనలను శిక్షింపడు. మన దోషములకు తగినట్లుగా మనలను దండింపడు. అతని ప్రేమ మిక్కుటముగా ఉండును" (కీర్తన 103:10-11). ఆయన పట్ల భయభక్తులు గలవారి పట్ల ఆయన దయ మిక్కుటంగా ఉంటుంది. ఉపమానములో, తన సేవకులను, చివరికి తన కుమారుడిని చంపినను ద్రాక్షాతోట యజమాని నిరాశపడలేదు. తాను అనుకున్న దానిని సాధించాడు. అలాగే, తన కుమారున్ని [యేసు] చంపినను, దేవుడు అనుకున్న దానిని సాధించారు. తన కుమారుని మరణం, ఉత్తానం ద్వారా లోక రక్షణను అందించారు. కనుక, సాతాను ఎప్పటికీ దేవున్ని జయించలేదు. దేవుని ప్రణాళిక తప్పక ఈ లోకములో నెరవేరి తీరుతుంది.

ఈలోకంలో మనమంతాకూడా ఉపమానములోని కౌలుదారులము. దేవుడు మన యజమాని. ఈ లోకములో ప్రతీ ఒక్కరికి ఒక బాధ్యతను అప్పగించారు. దేవుడు మనపై నమ్మకాన్ని ఉంచుతారు. సమయం వచ్చినప్పుడు, మనమంతా దేవునికి సమాధానం చెప్పాలి. మనలనుండి దేవుడు ఆశించిన ఫలాలను, మన జీవితముద్వారా, ప్రవర్తనద్వారా మనం ఫలించాలి. అలాగే, ద్రాక్షాతోట [ఇశ్రాయేలు, శ్రీసభ] అయిన తన ప్రజలను శ్రీసభ నాయకుల ఆధ్యాత్మిక కాపుదలకు అప్పగించారు. వారిని ఆధ్యాత్మికంగా ఎలా పోషిస్తున్నారో ప్రతీ నాయకుడు [జగద్గురువులు, పీఠాధిపతులు, విచారణ గురువులు, ఉపదేశులు మరియు ఇతరులు] ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎలాంటి ఫలాలను దేవునికి అర్పిస్తున్నాము!

No comments:

Post a Comment