తపస్కాల రెండవ వారము - గురువారం (II)

 దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
తపస్కాల రెండవ వారము - గురువారం
యిర్మియా 17:5-10; లూకా 16:19-31


ధ్యానాంశము: ధనవంతుడు - లాజరు

ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "అబ్రాహాము, మోషే, ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిని పెట్టువారు, మృతులలోనుండి ఒకడు సజీవుడై, వారిని హెచ్చరింప వెళ్లినను నమ్మరు" (లూకా 16:31).

ధ్యానము: ప్రాధాన్యముగా ధన లోభులగు పరిసయ్యులును ఉద్దేశించి యేసు ఈ ఉపమానాన్ని చెప్పారు (లూకా 16:14). పరిసయ్యులు పేదవారిపై ఎలాంటి దయను, కరుణను చూపేవారు కాదు. నేడు మనకుకూడా ఈ ఉపమానం ఎంతగానో వర్తిస్తుంది.

లాజరు అనగా 'దేవుడు నా సహాయం' అని అర్ధం [ఎలియాజరు = దేవుడు సహాయం చేయును]. లాజరు నిరుపేద, శారీరకంగా బలహీనుడు. దేహమంతా వ్రణములతో నిండియుండెను. కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను. తన పోషణకు భోజనపు బల్లమీదనుండి పడు ఎంగిలి మెతుకుల కోసం పడిగాపులు కాచేవాడు. దొరికిన కొద్దిరొట్టెముక్కలను బహుశా ఆ కుక్కలు లాగేసుకొనేవి! దయనీయ స్థితిలో, ఎన్నో కష్టాలను, బాధలను లాజరు అనుభవించాడని అర్ధమగుచున్నది. 

ధనికుడు లాజరును అసలు పట్టించుకోలేదు. లాజరును ఏహ్యభావముతో చూసాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, కుక్కలతో సమానముగా భావించాడు. మరణించిన తరువాత, లాజరు దేవదూతలచేత అబ్రాహాము ఒడిలోకి చేర్చబడ్డాడు. అబ్రాహాము రొమ్మున ఆనుకొని యున్నాడు. కాని, ధనవంతుడు పాతాళమునకు వెళ్ళాడు. అక్కడ బాధననుభవిస్తున్నాడు. మంటలలో మాడిపోవుచున్నాడు. 

లాజరు పేదవాడైనప్పటికిని ఎప్పుడు దేవున్ని మరువలేదు. తన దృష్టిని పరలోక సంపదపై ఉంచాడు. వాస్తవానికి, ధనికుడు లాజరును ఏవిధముగాను వేధించలేదు. కాని లాజరు జీవితం బాగుపడటానికి అతను ఏమీ చేయలేదు. ఎలాంటి సహాయము చేయలేదు. తన దృష్టినంతా ఇహలోక సంపదలపై, సుఖాలపై పెట్టాడు. మరో లోకము గురించి ఎన్నడూ ఆలోచించలేదు. తన సంపదలను దేవుని బహుమానంగా భావించలేదు. దానిని ఇతరుల ప్రయోజనం కొరకు ఏ మాత్రం ఉపయోగించలేదు. భౌతిక విషయాలలో ఆనందాన్ని వెదకడములో నిమగ్నమై పరలోక ఆనందాన్ని కోల్పోయాడు. దేవునికంటే ధనాన్ని సేవించాడు.

ధనవంతుడు చేసిన పాపం ఏమిటి? మన అనుదిన జీవితములో చేయవలసిన పనులను చేయక పోవడం కూడా పాపమే అని అర్ధమగుచున్నది. చేయవలసిన పనులను, బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం కూడా పాపమే! ధనవంతుడు తన ప్రక్కనే ఉన్న పేద లాజరును గమనించికూడా, అతని దీనస్థితిని గురించి తెలిసికూడా అసలు పట్టించుకోలేదు. హృదయ కాఠిన్యం కలిగి జీవించాడు. ఎలాంటి కనికరం, దయ చూపలేదు. లాజరు గురించి, ధనవంతుని ప్రశ్నిస్తే, "నేనేమైనా వానికి కావలి వాడనా?" (ఆ.కాం. 4:9) అని తిరిగి ప్రశ్నించే వాడేమో! అవును మనం మన తోటివారిపట్ల బాధ్యతను కలిగియున్నామన్న సత్యాన్ని మరువరాదు. కనుక, ప్రాధాన్యముగా ఈ ఉపమానం ధనికులకు హెచ్చరికగా యున్నది. సంపద సమస్య కాదు. కాని ఇతరులపట్ల మన వైఖరినిబట్టి, దేవుడు మనపై తీర్పు విధిస్తారు.

ఈలోకంలో జీవించి ఉండగానే, తోటివారిని గౌరవించాలి, ఆదరించాలి. దయ, కరుణ, ప్రేమలను చూపాలి. ధనవంతులు మారుమనస్సు, హృదయపరివర్తనం చెందక స్వార్ధముతో జీవిస్తే వారి వినాశనానికి గురౌతారు అన్న విషయం స్పష్టమగుచున్నది. మనమంతా ఆర్ధికంగా ధనవంతులము కాకపోవచ్చు కాని, మనకున్న దానిలోనే ఇతరులకు సహాయం చేద్దాం! డబ్బులేకపోతే, మన సమయాన్ని, మాట సహాయాన్ని చేద్దాం! ఈ తపస్కాలములో కనీసం ఒక లాజరునైనా కనుగొని సహాయం చేద్దాం! పేదవారిలోను, బాధలనుభవించే వారిలోను, మనం క్రీస్తును చూడగలగాలి. "ఈ అత్యల్పులలో ఒకనికైనా మీరివి చేయనప్పుడు నాకు చేయలేదు" (మత్త 25:45) అని ప్రభువు చెప్పియున్నారు.

ధనాన్నిగాక, దైవాన్ని నమ్ముదాం. సంపదలపైగాక, దేవునిపై ఆధారపడి జీవిద్దాం.

No comments:

Post a Comment