తపస్కాల మూడవ వారము - సోమవారం (II)

 దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
తపస్కాల మూడవ వారము - సోమవారం
2 రాజు. 5:1-15; లూకా 4:24-30 

ధ్యానాంశము: నజరేతూరిలో నిరాదరణము

ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "ఏ ప్రవక్తయు తన స్వదేశమున గౌరవింపబడడని మీతో నిశ్చయముగా పలుకుచున్నాను" (లూకా 4:24).

ధ్యానము: నేటి సువార్త, నజరేతు వాసులు ఏవిధముగా ప్రవక్తయైన యేసును తిరస్కరించారో తెలియజేయుచున్నది. యేసు సైతానుచే శోధింప బడిన తరువాత, ఆత్మబలముతో గలిలీయ సీమకు తిరిగి వెళ్లారు. ఆయన కీర్తి పరిసరములందంతట వ్యాపించెను. ప్రజలందరి మన్ననలను పొందెను (4:14-15). ఆతరువాత, యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతు నగరమునకు తిరిగివచ్చి, అలవాటు చొప్పున, విశ్రాంతి దినమున, యూదుల ప్రార్ధనా మందిరమునకు వెళ్లెను. యెషయా ప్రవక్త గ్రంధమును అందించగా చదివి (యెషయ 61:1-2), "నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది" (4:21) అని పలికెను. ఆయన మాటలకు అచట ఉన్నవారంతా ఆశ్చర్యపడ్డారు. 

అంతట యేసు వారితో "ఓ వైద్యుడా! నీకు నీవే చికిత్స చేసికొనుము అను సామెతను చెప్పి, నీవు కఫర్నాములో ఏ యే కార్యములు చేసితివని మేము వింటిమో, ఆ కార్యములనెల్ల ఇచట నీ స్వదేశములో సైతము చేయుము అని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు" (4:23). యేసు ఎందుకు ఇలా పలికారు? యేసు వారి హృదయములోని ఆలోచనలను ఎరిగియున్నారు కనుక! అప్పుటికే యేసు కఫర్నాములో, అన్యుల మధ్యన ఎన్నో అద్భుతాలు చేశారు. తోటి నజరేయుడు, స్వగ్రామము కనుక, ఇంకా ఎన్నో గొప్పగొప్ప కార్యాలు చేస్తారని ప్రజలు ఆశించారు. అందరికన్నా ముఖ్యముగా అన్యులకన్నా తనవారు ముందుగా స్వస్థత పొందాలని ఆశించారు. అన్యుల మధ్యన యేసు అద్భుతాలు చేయటం వలన వారు అసూయ పడ్డారు. కాని, యేసు స్వస్థత వారికోసం మాత్రమేగాక, అందరికీ చేయవలసి యున్నదని స్పష్టం చేశారు. ఆయన కేవలం యూదుల కొరకు మాత్రమే కాదని, సర్వమానవాళి కొరకు అని అర్ధమగుచున్నది. అందరూ ఆయనకు సమానమే! 

యేసు ఇద్దరు ప్రముఖ ప్రవక్తలను ఉదాహరణగా ప్రస్తావించారు. దేవుడు ఏవిధముగా ఇద్దరు అన్యులను ఆశీర్వదించినది తెలియజేసారు. ఎందుకన, ఆ కాలములో ఇశ్రాయేలు ప్రజలకున్న, అన్యులు ప్రవక్తలను విశ్వసించారు. ఏలీయా కాలములో ఇశ్రాయేలు దేశమంతటా కరువు సంభవించగా, ఇశ్రాయేలీయులలో పెక్కుమంది విధవరాండ్రు ఉన్నను, సీదోనులోని సెరెఫాతు గ్రామమున నివసించు విధవరాలి యొద్దకు మాత్రమే ఏలీయా పంపబడెను. ఆమె పోషణకై అద్భుతాన్ని చేసాడు. మూడున్నర సంవత్సరాల కరువు కాలములో అద్భుతముగా ఆమెకు, ఆమె కుమారునికి భోజనాన్ని ప్రసాదించాడు. వ్యాధితో మరణించిన ఆమె కుమారున్ని బ్రతికించాడు (1 రాజు 17:7-24). అలాగే, ఎలీషా కాలములో, ఇశ్రాయేలీయులలో చాలామంది కుష్ఠరోగులు ఉన్నను, సిరియా నివాసియగు నామాను [సిరియా మిలిటరీ జనరల్] తప్ప మరి ఎవ్వరును స్వస్థత పొందలేదు. అతడు విదేశీయుడు, యూదుల శత్రువు (2 రాజు 5:1-19). 

ఈ రెండు ఉదాహరణల ద్వారా, తన స్వగ్రామం నజరేతు ప్రజలలాగే, పూర్వపు రోజుల్లోకూడా ఇశ్రాయేలు ప్రజల అవిశ్వాసం వలన, దేవుని అద్భుతాలను పొందలేక పోయారని ప్రభువు మాటలు తెలియజేయుచున్నవి. ముఖ్యముగా, దేవుని రక్షణ అందరికీ అని అర్ధమగుచున్నది. నజరేతూరిలో సొంత ప్రజలచేత నిరాదరణము, యెరూషలేములోని యేసు తిరస్కరణను సూచిస్తుంది (లూకా 13:33; 24:19-20). 

అప్పుడు ప్రజలు అందరు యేసు మాటలు విని మండిపడ్డారు. యూదులు తాము దేవునిచేత ఎన్నుకొనబడిన వారమని, అన్యులతో వారిని సమానముగా పోల్చేసరికి వారు యేసును ఓర్వలేక పోయారు. యూదుల అవిశ్వాసము, అన్యుల విశ్వాసము గురించి ప్రస్తావించే సరికి వారు యేసుపై మండిపడ్డారు. వారి కోపం ఎంతగా ఉందంటే, యేసును ఎత్తైన పర్వతము మీదకు తీసుకొని వెళ్లి అచ్చటనుండి తలక్రిందులుగా పడత్రోయాలని తలంచారు. కాని యేసు వారి మధ్యనుండి వెళ్లిపోయెను. ఆయన గడియ ఇంకను రాలేదు కనుక అచ్చటనుండి వెళ్లిపోయెను. 

రక్షణ సందేశాన్ని బోధించుటకు ఎంతగానో శ్రమిస్తున్న యేసుకు, తనవారు ఎంతో అండగా ఉంటారని భావించిన యేసుకు వారు తిరస్కరించడం ఎంతగానో నిరాశకలిగించే విషయమే! కాని యూదుల తిరస్కరణతో యేసు నిరాశ చెందక ముందుకు సాగిపోయి అన్యులమధ్యన ఎన్నో అద్భుతాలు చేశారు. అలాగే, క్రైస్తవ సువార్తా బోధనను యూదులు తిరస్కరించినపుడు, అన్యజనులకు క్రీస్తు సువార్త ప్రకటింప బడినది (అ.కా. 13:46; 18:6).

- అనుదిన జీవితములో తిరస్కరణలు, ఛీత్కారాలు, ద్రోహం, నిర్లక్ష్యం, వెన్నుపోటు... ఎదురైనప్పుడు ధైర్యముతో, ఆశాభావంతో ముందుకు సాగుదాం!

- నజరేతు వాసులవలె మనం దేవున్ని నిరాకరించ కూడదు, తిరస్కరించ కూడదు. ఒక్కోసారి మన గర్వము, అహం వలన మన దరికి వస్తున్న దేవుని సహాయాన్ని పొందుకోలేక పోవుచున్నాము.

-దృఢమైన విశ్వాసాన్ని కలిగి యుండాలి.

No comments:

Post a Comment