ఈస్టర్

ఈస్టర్ / ఉత్థానము


క్రైస్తవ ప్రపంచమంతయు క్రీస్తు ఉత్థానమును ఒక గొప్ప మహోత్సవముగా కొనియాడుచున్నది. క్రీస్తు ఉత్థానం సంతోషకరమైన, విజయకరమైన పండుగ మరియు ఇది ఒక నిరీక్షణ పండుగ! యేసుక్రీస్తు మరణమునుండి ఉత్థానమవుటను కొనియాడుచున్నాము. ఇది విశ్వాసులందరికి ఒక గొప్ప ఆశను, వారి  హృదయాలలో నిజమైన ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది.

మొదటి మానవుడు ఆదామునకు దేవుడు "ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదగా, జీవము గలవాడయ్యెను" (ఆ.కాం. 2:7). ఎప్పుడైతే, దేవుడు ఆ "ప్రాణవాయువును" తీసివేస్తాడో, అప్పుడు మానవుడు మరణిస్తాడని యూదులు అనేక శతాభ్దాలపాటుగా విశ్వసించారు. మరణించినవారు 'షియోల్' - నరకాగ్ని (మత్త 5:22; 25:41; మార్కు 9:46), నరకము (మత్త 5:29-30) నరకకూపము (మత్త 10:28), అగ్నిగుండము (మత్త 13:42), పాతాళ లోకము (కీర్త 6:5) - అనగా, మరణించినవారి స్థితి లేదా నివాస స్థానమున ఉందురని భావించారు. 'షియోల్' వెనక మరో జీవము, జీవితము ఉంటుందని వారు ఎప్పుడూ ఊహించలేదు. 'షియోల్'లో మరో జీవితానికిగాని, దేవునితో సహవాసమునకుగాని ఎటువంటి ఆస్కారము లేదు; మరణముతో అంతా ముగుస్తుందని, మానవునికి అదే శాశ్వత ముగింపు అని విశ్వసించారు. కనుక, ఆదికాండములోని పితరులవలె, భూలోకములోనే ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలని, జీవించాలని ఆశించేవారు.

శ్రమలలో, మరణావస్థలో, కీర్తనకారుడు, "దేవా! నీవు శీఘ్రమే విచ్చేసి నన్ను కాపాడుము. నీవు కృప కలవాడవు కనుక నన్ను రక్షింపుము. మృతులు నిన్ను స్మరింపరు. పాతాళ లోకమున నిన్ను ఎవరు స్తుతింపరు" (6:4-5) అని మొరపెట్టుకున్నాడు. మరణం, జీవమునకు శత్రువు; ఎవరూ దానినుండి తప్పించుకొనలేరు (చదువుము కీర్తన 49:7-11). కొన్నిసార్లు ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు వారిని పాతాళ లోకము నుండి రక్షించునని ఆశతో ప్రార్ధించేవారు (కీర్త 49:15).

పాత నిబంధనలో ఇద్దరే ఇద్దరు వ్యక్తులు మరణాన్ని చవిచూడక, దేవునిచేత స్వర్గమునకు కొనిపోబడినారు. వారిలో ఒకరు హనోకు (ఆ.కాం. 5:24) మరియు ఇంకొకరు ఏలియా (2 రాజు 2:11). యూదుల చరిత్రలో, వీరిద్దరే మరణాన్ని చవిచూడలేదు; అయితే అవి ఉత్థాన గాధలు ఎంతమాత్రము కాదు. అలాగే, పాత నిబంధనలో, మరణించిన వారు దేవుని ప్రవక్తలచేత సజీవులుగా లేపబడటం మనం చూడవచ్చు - సారెఫతు విధవ పుత్రుడు చనిపోయి బ్రతుకుట (1 రాజు 17:7-24); షూనేము వనిత కుమారుడు చనిపోయి బ్రతుకుట (2 రాజు 4:31-37); ఒక ప్రేతము ఎలీషా ఆస్థికలను తగులగనే జీవముతో లేచి నిలుచుండుట (2 రాజు 20-21). ఇవి మరణానికి శాశ్వత పరిష్కారాలు ఎంతమాత్రము కావు. తన ప్రవక్తల ద్వారా, దేవుడు తన మహాశక్తిని ప్రదర్శించియున్నారు.

పునరుత్థానమును సూచించు కొన్ని ప్రవచనములను మనము పాత నిబంధనలో చూడవచ్చు: 
- "రెండు మూడు రోజులలో అతడు మనకు జీవము దయచేయును. ఇక మనమతని సన్నిధిలో వసింపవచ్చును" (హోషేయ 6:2); 
- ఎండిన ఎముకలు బ్రతికి లేచి నిలుచుండు ప్రవచనమును యెహెజ్కేలు 37:1-14లోను, పునరుత్థానమును గురించిన భావనను యెషయ 53:10-12లో చూడవచ్చు. 
- పాత నిబంధన కాలములో, ముఖ్యముగా 'వేదహింసల కాలము'న పునరుత్థాన భావన మరింత లోతుగా పరిగణించబడినది (యెషయ 24-27). 
- "ప్రభువైన యావే మృత్యువును సదా నాశనము చేయును. ఎల్లరి కన్నీళ్లు తుడిచి వేయును" (యెషయ 25:6-8); 
- "మృతులైన నీ ప్రజలు మరల జీవింతురు. వారి మృత శరీరములు జీవముతో లేచును. మట్టిలో కలిసిపోయిన వారందరు మరల లేచి, సంతోషముతో పాటలు పాడుదురు. తళతళలాడు మంచు, నేలకు జీవమొసగినట్లే చిరకాలము క్రితమే చనిపోయిన వారికి ప్రభువు ప్రాణమొసగును" (యెషయ 26:19); 
- "అప్పటికే చనిపోయి మట్టిలో నిద్రించు వారిలో చాలమంది సజీవులగుదురు. వారిలో కొందరు నిత్యజీవము బడయుదురు. మరికొందరు శాశ్వత అవమానముకు గురియగుదురు" (దానియేలు 12:2). 
- మక్కబీయుల గ్రంధములో పునరుత్థానము గురించి స్పష్టమైన ప్రవచనాలను చూడవచ్చు: అతడు చివరిసారిగా ఊపిరి పీల్చుకొని రాజుతో, "రాక్షసుడా! నీవు మమ్ము చంపిన చంపవచ్చుగాక, కాని విశ్వాధిపతియైన ప్రభువు మాకు పునరుత్థాన భాగ్యమును దయచేసి మేము శాశ్వతముగా జీవించునట్లు చేయును. ఆయన ఆజ్ఞలకు బద్ధులమై మేము ప్రాణములు కోల్పోవుచున్నాము" అని అనెను (2 మక్క 7:9); 
- మృతులు మరల ఉత్థానమగుదురనే విశ్వాసముతో పాపపరిహారబలి అర్పించుట (2 మక్క 12:43-45). 
ఈవిధముగా పునరుత్థానమును గురించిన భావనలను, ప్రవచానములను మనం పాత నిబంధనలోనే చూడవచ్చు.

నూతన నిబంధనలో, శ్రమలు, సిలువ మరణము తరువాత, యేసు ఉత్థానముతో, ఉత్థానమును గురించిన అపోస్తలుల బోధనలతో, 'రాబోవు కాలములో దేవుడు మరణించిన వారిని, వారి కార్యాలను బట్టి సజీవులుగా లేపును' అని అర్ధమగుచున్నది (మత్త 25:31-46). నూతన నిబంధన వేదాంతమునకు, వ్రాతలకు మూలం, ఆధారం యేసు పునరుత్థానమే అని చెప్పడములో ఎలాంటి అతిశయోక్తి లేదు. "క్రీస్తే లేవనెత్తబడనిచో మా బోధన వ్యర్ధమే, మీ విశ్వాసమును వ్యర్ధమే" (1 కొరి 15:14) అని పౌలు స్పష్టం చేసియున్నారు. పునరుత్థాన గాధలు యేసు ఉత్థానమును గురించి బోధించడానికి అపోస్తలులకు దోహదపడ్డాయి. నూతన నిబంధనలో, కనీసం మూడు పునరుజ్జీవన గాధలను చూడవచ్చు: - చనిపోయిన యాయీరు కుమార్తెకు ప్రాణదానము (మార్కు 5:21-24, 35-43; మత్త 9:18-26; లూకా 8:40-42, 49-56); - చనిపోయిన నాయిను వితంతువు కుమారుడు లేపబడుట (లూకా 7:11-17); - పునర్జీవము పొందిన లాజరు (యోహాను 11;1-44; 12:1, 9, 17)

అపోస్తలులు, ప్రధమ క్రీస్తానుచరులు, యేసు పునరుత్థానమును దేవుని మహాశక్తిగాను, మహిమగాను, మానవాళి రక్షణ కార్యముగాను అర్ధము చేసుకున్నారు (గలతీ 1:1; రోమీ 4:24; ఎఫెసీ 1:20; కొలొస్సీ 2:12; 1 పేతురు 1:21). యేసు పునరుత్థానం సాతానుపై విజయముగాను పరిగణించారు. యేసు సిలువ మరణ సమయమున, శిష్యులందరు భయముతో చెల్లాచెదరై పోయారు. నిరాశతోను, భయముతోను ఉన్నారు. సిలువ మరణాన్ని చూసినవారు, అసహ్యకరమైన, హేయమైన, అవమానకరమైన మరణముగా భావించారు. అయితే, ఎప్పుడైతే, అపోస్తలులు, శిష్యులు, యేసు సిలువ మరణం దేవుని దృష్టిలో ఊహించని విషాదం కాదని, అది దైవచిత్తమని గ్రహించారో, అప్పుడు వారు క్రీస్తు ఉత్థానం గురించి ధైర్యముగా బోధించారు. రోమీయుల క్రూరత్వానికి, అవమానమునకు గురుతుగానున్న సిలువను, మరణముపై విజయాన్ని సాధించిన రక్షణకు గురుతుగా వారు బోధించారు.

క్రీస్తు ఉత్థానం గురించి మొట్టమొదటిగా, వ్రాయబడినది పౌలు లేఖలలోనే!  (1 తెస్స 1:10; 4:14; రోమీ 4:24-25; 6:4, 9; 7:4; 8:11, 34; 10:9; 1 కొరి 6:14; 15:4, 12; 2 కొరి 4:14; 5:15; గలతీ 1:1; ఎఫెసీ 1:20; కొలొస్సీ 2:12; 2 తిమో 2:8). యేసు తన పునరుత్థానము గురించి ప్రవచించిన ప్రవచనాల నేరవేర్పును సువార్తలలో చూడవచ్చు: మార్కు 16:1-8; మత్త 28:1-20; లూకా 24:1-53; 

యోహాను 20:1-29. యేసు పునరుత్థానమునందు విశ్వాసమునే అపోస్తలులు ప్రకటించిన సువార్త. అనగా, అపోస్తలులు ఉత్థాన క్రీస్తుకు సాక్ష్యమిచ్చారు (అ.కా. 3:15; 4:10; 5:30; 10:40; 13:30, 37; 1 పేతురు 1:21). మరణించిన వారి పునరుత్థానము గురించి నూతన నిబంధన బోధిస్తుంది. జీవించు వారలకును, మరణించిన వారలకును క్రీస్తు తీర్పు చేయును. మానవాళి అంతిమ గమ్యం ఉత్థాన క్రీస్తు.

కనుక, క్రీస్తు ఉత్థానం సంతోషకరమైన పండుగ! ఎందుకన మరణముపై క్రీస్తు విజయాన్ని కొనియాడుచున్నాము. మరణం శాశ్వత ముగింపునకుగాక, నిత్యజీవితానికి ద్వారముగా యేసు చేసియున్నారు. మరణం, మనలను సంతోషముగా తన ఒడిలోనికి ప్రేమగా స్వాగతించే మన తండ్రియైన దేవుని సాన్నిధ్యానికి ప్రవేశము. ఈస్టర్ మహోత్సవం, అంధకారములోనున్న వారికి వెలుగును, బాధలలోనున్న వారికి సంతోషమును, నిరాశలోనున్న వారికి ఆశను, సాతాను దుష్టశక్తులతో పోరాడే వారికి ధైర్యమును, బలమును ఒసగును.

No comments:

Post a Comment