తపస్కాల నాలుగవ వారము - సోమవారం (II)

 దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
తపస్కాల నాలుగవ వారము - సోమవారం
యెషయ 65:17-21; యోహాను 4:43-54 

ధ్యానాంశము: ఉద్యోగి కుమారునకు స్వస్థత
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "ఆ ఉద్యోగి, అతని కుటుంబము యేసును విశ్వసించితిరి" (యోహాను 4:53).
ధ్యానము: యోహాను సువార్త ప్రకారం, ఉద్యోగి కుమారుని స్వస్థత యేసు చేసిన రెండవ 'అద్భుత చిహ్నము'. మొదటిది కానాను పల్లెలో 'నీటిని ద్రాక్షారసముగా మార్చడం'. స్వగ్రామము నజరేతులో నిరాకరింపబడిన తరువాత, యేసు యెరూషలేమునకు పాస్కా పండుగకు వెళ్లారు. అక్కడనుండి, గలిలీయ ప్రాంతమునకు వెళ్లారు. అచటి ప్రజలు ఆయనను ఆహ్వానించారు. ఎందుకన, యెరూషలేములో ఆయన చేసిన అద్భుత కార్యములన్నియు వారు స్వయముగా చూసారు. గలిలీయలోని కనాను అను పల్లెకు యేసు తిరిగి వచ్చారు.
కాఫర్నాములో నివసించే యూదుడైన ఒక ప్రభుత్వ ఉద్యోగి (బహుశా చతుర్దామ్షాధిపతి హేరోదు కొలువులో ఉద్యోగి) , యేసు యూదయానుండి, గలిలీయకు (కానా పల్లె) తిరిగి వచ్చారని తెలుసుకొని వచ్చి, ప్రాణసంకటములో పడియున్న తన కుమారుని, తన యింటికి వచ్చి స్వస్థత పరచవలసినదిగా యేసును ప్రార్ధించాడు. యేసు మొదటిగా, "మీరు సూచనలు, మహత్కార్యములు చూచిననే తప్ప విశ్వసింపరు" అని చమత్కారంగా పలికారు. ఈ మాటలు యేసు యూదులందరిని ఉద్దేశించి (ముఖ్యముగా పరిసయ్యులు) పలికారు. ఎందుకన, యేసు ఎన్నో అద్భుత కార్యములు చేసినను, వారు ఇంకా గురుతులు అడిగేవారు (ఉదా. మత్త 12:38-40; 16:1, 4; మార్కు 8:11-12). కేవలము ఇటువంటి గురుతులపై ఆధారపడకూడదని ప్రభువు హెచ్చరిస్తున్నారు, ఎందుకన, చెడుశక్తులు కూడా తప్పుడు గురుతులుగా అద్భుతాలు చేయగలవు అని తెలియజేయుచున్నారు (మత్త 24:24). "చూడక విశ్వసించువారు ధన్యులు" (యోహాను 20:29) అని యేసు స్పష్టం చేశారు.
కాని, యేసు మాటలకు ఆ ఉద్యోగి నిరాశపడలేదు. అతను విశ్వాసముతో మరల, 'ప్రభూ! నా కుమారుడు చనిపోక ముందే రండు' అని వేడుకున్నాడు. అప్పుడు యేసు, "నీవు వెళ్లుము. నీ కుమారుడు జీవించును" అని అతనితో చెప్పారు. అతడు యేసు మాటను నమ్మి తిరిగిపోయెను. కఫర్నాము నుండి కానా పల్లెకు దాదాపు 26 కిలోమీటర్ల దూరం! బహుశా, యేసు అతని యింటికి వెళ్లకుండా అతని విశ్వాసమును పరీక్షించారు. అతను యేసు మాటను విశ్వసించాడు కాబట్టి, ఆ క్షణముననే అతని కుమారుడు స్వస్థత పొందాడు. ఇతర యూదులవలె అతడు యేసును ఎలాంటి సూచననుగాని, గురుతునుగాని, మహత్కార్యమునుగాని అడగలేదు. తన కుమారుడు ఎలా స్వస్థత పొందుతాడు అని అడగలేదు. అదే అతని విశ్వాసమునకు సూచన! ఆ విశ్వాసమే అతనిని ముందుకు నడిపించింది. అతడు మార్గమధ్యమున ఉండగనే, అతని సేవకులు ఎదురై, 'నీ కుమారుడు స్వస్థుడైనాడు' అని చెప్పారు. ఈ అద్భుతము వలన, అతని కుటుంబము యేసును విశ్వసించినది. యేసునందు విశ్వాసము ఎంత ప్రాముఖ్యమైనదో మనకు అర్ధమగుచున్నది. విశ్వాసము లేనిచోట, విశ్వాసము లేనివారికి యేసు ఎలాంటి అద్భుతాలు చేయలేదు. విశ్వాసము కేవలము మన మాటలలో మాత్రమేగాక, మన చేతలలో చూపాలి!
మనము కూడా, ముందుగా, యేసు మాటలందు దృఢమైన విశ్వాసము ఉంచాలి. ఉద్యోగి యేసు మాటను నమ్మి తిరిగి యింటికి వెళ్ళిపోయాడు. యేసును సంపూర్ణముగా విశ్వసించాడు. ఆ నమ్మకము, విశ్వాసము వలననే, యేసు అతని కుమారునికి స్వస్థతను కలుగ జేశారు. మనము కూడా, ఎలాంటి సూచనలు, మహత్కార్యములు లేకుండానే, యేసు మాటలను విశ్వసించాలి. యేసు క్రీస్తునందు, ఆయన వాక్కునందు విశ్వాసము వలన మనం శాశ్వతానందమును పొందెదము. ఎందుకనగా, "జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికిని మరణింపడు" (యోహాను 11:26) అని యేసు వాగ్ధానం చేశారు (చూడుము 1 పేతురు 1:8). "ఆవగింజంత విశ్వాసము మనకుండిన యెడల, మనకు అసాధ్యమైనది ఏదియు ఉండదు" (మత్త 17:20) అని యేసు వక్కాణించారు. "మనము దృష్టి వలనగాక, విశ్వాసము వలన" నడుచుకొనవలయును (1 కొరి 5:7). 'లోక రక్షకుడు' అయిన యేసు క్రీస్తు నందు విశ్వాసము, ఆయనపట్ల వినయము, హృదయపూర్వక ప్రార్ధన మరియు దేవుని చిత్తం ప్రకారం జీవిస్తే, మన జీవితములో కూడా అద్భుత స్వస్థతలు జరుగుతాయి.
యేసు ప్రభువు చేసిన ప్రతీ అద్భుతం మన రక్షణ సాధన కొరకే! అవి మరణము నుండి మన విముక్తిని సూచిస్తున్నాయి. ఈ లోకమునుండి పరలోకము వైపునకు మనలను నడిపిస్తున్నాయి. "ఇదిగో! నేను నూతన దివిని, నూతన భువిని సృజింతును" అని "శిశువులకు బాల్య మరణములుండవు, ప్రతీ వాడు నూరేండ్లు జీవించును" అని యెషయ ప్రవక్త ప్రవచించి యున్నాడు (65:17, 20). 
యేసు మాటలు శక్తిగలవి. అధికారము గలవి. వాగ్ధానము చేసిన వాక్కు తప్పక నెరవేరును. యేసు వాక్కు వలన కుమారుడు స్వస్థత పొందడం మాత్రమేగాక, కుటుంబమంతయు యేసును విశ్వసించినది. యేసు వాక్కు మన జీవితాలలో, కుటుంబములో మార్పును తీసుకొని వచ్చును. మనలను ఆధ్యాత్మికంగా బలపరచును. మన అల్పవిశ్వాసాన్ని దృఢపరచును.
నేటి నుండి మనం సువిశేష పఠనాన్ని, యోహాను సువార్తనుండి వింటాము. యోహాను సువార్త ఉద్దేశ్యం: "యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకును, ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవము పొందుటకు ఇవి వ్రాయబడినవి" (20:31).

No comments:

Post a Comment