తపస్కాల నాలుగవ వారము - మంగళవారం (II)

  దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
తపస్కాల నాలుగవ వారము - మంగళవారం
యెహెజ్కె 47:1-9; యోహాను 5:1-16 

ధ్యానాంశము: కోనేటి వద్ద వ్యాధిపీడితుడికి స్వస్థత
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: " "నీవు స్వస్థత పొందగోరుచున్నావా?" (5:6).
ధ్యానము: యూదుల పండుగకు యేసు యెరూషలేమునకు వెళ్ళారు. యెరూషలేము దేవాలయమునకు అనేక ద్వారాలు ఉండేవి. అందులో ఒకటి 'గొర్రెల వాకిలి'. ఈ ద్వారముగుండానే యూదులు పాపపరిహార బలికై అర్పించు గొర్రెపిల్లలను తీసుకొని వెళ్ళేవారు. ఈ ద్వారం వెలుపల ఒక కోనేరు లేదా కొలను ఉన్నది. దానిని హీబ్రూ భాషలో 'బెత్సతా' అని అందురు. 'బెత్సతా' అనగా "కృపగల గృహము" అని అర్ధం. ఆ కోనేటి చుట్టూ, గ్రుడ్డి, కుంటి, పక్షవాత రోగులు స్వస్థత కొరకు గుమికూడేవారు; 'దేవుని కృప' కొరకు, స్వస్థత కొరకు ఎదురుచూసేవారు. ఎందుకంటే, ఆ కోనేటి యొద్దకు, అప్పుడప్పుడు దేవదూత దిగివచ్చి, నీటిని కదిలించును. నీరు కదలగానే, మొదట అందులో దిగినవారు, ఎటువంటి వ్యాధినుండి అయినను స్వస్థత పొందేవారు. ఇది అప్పటిలో ప్రజలలో ఉన్న విశ్వాసం! 

ఆ నీరు కదలగానే కోనేటిలోనికి దిగడానికి 38 యేండ్ల నుండి (యేసు పుట్టక పూర్వము నుండి), ప్రతీరోజు ఒక వ్యాధిపీడితుడు అక్కడకు వస్తూ ఉండేవాడు. కాని, ఆ కోనేటిలోనికి అతనిని దించడానికి ఎవరుకూడా సహాయం చేయలేదు. ప్రతీరోజు ఎంతో ఆశతో ఆ వ్యక్తి, స్వస్థత కొరకు ఆ కోనేటి వద్దకు వచ్చేవాడు. కాని, ప్రజలు ఎవరుకూడా పట్టించుకోకపోవడం వలన, వారి స్వార్ధం వలన, అతను స్వస్థత పొందలేక పోయాడు. 'ప్రతీరోజు', '38 సం.గా వస్తున్నాడంటే, మొత్తముగా 13,870 సార్లు అక్కడికి వచ్చాడు. అన్నిసార్లు కూడా ఎవరూ ఆ వ్యక్తికి సహాయం చేయలేదు. చేయూతనివ్వలేదు. స్వస్థత పరచు నీటి యొద్దకు నడిపించలేదు. అతని ఓపిక, నిరీక్షణ మెచ్చుకోదగ్గదే! ఇది దేవునిపై అతనికున్న విశ్వాసానికి సూచన. ఏదో ఒకరోజు తప్పక స్వస్థత పొందుతానని దృఢమైన నమ్మికను కలిగియున్నాడు.

యూదుల పండుగకు వచ్చిన కృపగల క్రీస్తు ప్రభువు, ఆ వ్యక్తిని చూచి, చాలా కాలమునుండి అక్కడ ఉన్నాడని గ్రహించారు. యేసు అతని నిస్సహాయ స్థితిని గమనించారు. అతని విశ్వాసమును పరీక్షించుటకు, "నీవు స్వస్థత పొందగోరుచున్నావా?" (5:6) అని ప్రశ్నించారు. ఆ వ్యక్తి తన విశ్వాసాన్ని వ్యక్తపరచిన తరువాత, "లెమ్ము నీ పడకను ఎత్తుకొని నడువుము" అని యేసు అతనితో చెప్పగా, అతను తక్షణమే స్వస్థత పొందాడు (5:8-9). అతని విశ్వాసమునకు, నిరీక్షణకు ఫలితం, రక్షకుడైన యేసు క్రీస్తుద్వారా లభించినది. ఆతరువాత, దేవాలయములో ఆ వ్యక్తిని కనుగొన్నప్పుడు అతనితో, "ఇదిగో నీవు స్వస్తుడవైతివి. నీకు మరింత కీడు కలుగకుండుటకు ఇక పాపము చేయకుము" అని చెప్పారు (5:14). ఇది యేసు చేసిన మూడవ 'అద్భుత చిహ్నము'. గొర్రెపిల్లవలె యేసు 'గొర్రెల వాకిలి'గుండా వెళ్లి, ఆ వ్యక్తిని స్వస్థత పరిచారు.  గుడ్ ఫ్రైడే రోజున, మనకోసం బలిగా అర్పించబడి, మనలను పాపమునుండి మనలను స్వస్థపరచును. యేసే ఆ గొర్రెల మార్గము. తండ్రి యొద్దకు ఆయన మన మార్గము, జీవము, సత్యము.

అది విశ్రాంతి (సబ్బాతు) దినము అయినప్పటికిని, యేసు ఆ వ్యక్తిని స్వస్థ పరచాడు. మోషే చట్టం ప్రకారం, విశ్రాంతి దినమున 'పడకను ఎత్తుకొని నడవటం నిషేధం'. అలా చేస్తే నేరముగా పరిగణించబడి, శిక్షలు తీవ్రముగా ఉండేవి. చట్టాలు ప్రజలకు ఉపయోగకరమైనవిగా ఉండాలేతప్ప, వారిని ఇబ్బందులకు గురిచేసేవిగా, మోయలేని భారముగా ఉండకూడదని ప్రభువు తలంచి, ఆ వ్యక్తిని, అది విశ్రాంతి దినమైనప్పటికిని స్వస్థత పరచారు. మరోచోట, "మానవుని కొరకే విశ్రాంతి దినము నియమింప బడినది గాని, విశ్రాంతి దినము కొరకు మానవుడు నియమింప బడలేదు" (మార్కు 2:27) అని యేసు స్పష్టం చేసారు. ఇతరులకు సహాయం చేయడానికి, మంచి పనులు చేయడానికి, అన్ని రోజులు మంచివే అని ప్రభువు భావించారు. కనుక, ఆ వ్యక్తి బాగుకొరకు, శ్రేయస్సు కొరకు తనకు కలగబోయే పరిణామాలను కూడా ప్రభువు లెక్కచేయలేదు. ఎందుకన, "విశ్రాంతి దినమున ఈ పని చేసినందుకు యూదులు యేసును హింసింప మొదలిడిరి" (యోహాను 5:16).
మనం కూడా ఇతరులనుండి ఎంతో సహాయాన్ని, మేలును పొందుచున్నాము. మన అనుదిన జీవితములోకూడా మన చుట్టూ ఉన్న ఎంతోమంది మన సహాయం అవసరమై యున్నవారు ఉండవచ్చు. మనం అలాంటివారికి తప్పక సహాయం చేయాలి. ముఖ్యముగా, ఇతరుల ఆధ్యాత్మిక ఎదుగుదలకు తప్పక సహాయం చేయాలి. మంచి పని చేయడానికి మంచి మనసు, ధైర్యం ఉండాలి. ఏ దుష్ట శక్తులకు మనం భయపడాల్సిన అవసరం లేదు. మంచి పనిచేయడానికి వచ్చే ప్రతీ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం!

No comments:

Post a Comment