యేసు తిరు హృదయం - దేవుని ప్రేమ సందేశం

 యేసు తిరు హృదయం - దేవుని ప్రేమ సందేశం


ఈరోజు యేసు తిరు హృదయ మహోత్సవాన్ని కొనియాడు చున్నాము. ఈ రోజు మనం ధ్యానించబోయే అంశం "యేసు తిరు హృదయం - దేవుని ప్రేమ సందేశం. హృదయం అనగానే మనకు గుర్తుకు వచ్చేది ప్రేమ. కనుక యేసు తిరు హృదయాన్ని ధ్యానించడం అంటే, దేవుని ప్రేమను, దయను/కనికరమును ధ్యానించడమే! " యేసు తిరు హృదయం, దేవుని ప్రేమను ఎలా ప్రతిబింబిస్తుందో ధ్యానిద్దాం! యేసు హృదయం పవిత్రమైనది. యేసు హృదయం మన రక్షకుడైన క్రీస్తు జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. అది దేవుని ప్రేమకు ప్రతిబింబం. ఈ హృదయం మరియతల్లి గర్భములో రూపు దాల్చినది; ఈ హృదయం సువార్తను బోధించినది; ఈ హృదయం ఎంతోమందిని స్వస్థత చేకూర్చినది; ఈ హృదయం ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించింది; పాపులను సైతము ఆలింగనం చేసుకున్నది. రోగులను తాకి స్వస్థపరచింది. ఆ ప్రేమవలననే, ఈ లోక పాపపరిహార్ధమై, ఎన్నో శ్రమలను, అవమానములను అనుభవించింది; చివరికి ఈ హృదయం సిలువపై ఆగిపోయినది; ఈ హృదయం బల్లెముతో పొడవబడినది; అయితే, ఆగిపోయిన ఆ హృదయం, పునరుత్తానముతో మరోసారి కొట్టుకొనసాగింది; ఈ రోజు వరకు ఆ హృదయం మనకోసం కొట్టుకుంటూనే ఉన్నది... మనపై తన అనంతమైన దయను, కరుణను క్రుమ్మరిస్తూనే ఉన్నది. కనుక, యేసు తిరు హృదయం, దేవుని ప్రేమకు తార్కాణం మరియు సాక్షాత్కారం! ఈ హృదయం, తన దైవీక ప్రేమను మరియు మానవ ప్రేమను వ్యక్తపరస్తుంది. యేసు తిరు హృదయములో, భూమ్యాకాశములను సృష్టించిన దేవుని ప్రేమను మనం చూడవచ్చు. మానవుని సృష్టించిన ప్రేమను, అలాగే పాపములో పడిపోయిన మానవుని రక్షించిన ప్రేమను చూడవచ్చు. అలాగే మానవ ప్రేమను - తన తల్లిపై, శిష్యులపై, పాపాత్ములపై, ఆయనను అనుసరించిన వారిపై... క్రుమ్మరించిన ప్రేమను చూడవచ్చు. ఈ ప్రేమ ఎంత గొప్పది అంటే, తనను సిలువపై కొట్టిన వారినికూడా, హృదయ పూర్వకముగా క్షమించిన ప్రేమను మనం చూడవచ్చు. 

తిరు హృదయం - ఆదర్శం

యేసు తిరు హృదయ మనకు ఆదర్శం. మానవ హృదయం ఏమి చేయశక్తిగలదో, యేసు తిరు హృదయం మనకు గుర్తుచేస్తుంది. దేవున్ని ప్రేమించాలని, తోటివారిని ప్రేమించాలని ఈ హృదయం మనకు నేర్పిస్తుంది. ఎందుకన, "దేవుడు మనకొసగు పవిత్రాత్మద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను" (రోమీ 5:5). మన హృదయాలు దేవుని ప్రేమతో నింపబడ్డాయి కనుక, దేవున్ని మరియు తోటివారిని ప్రేమించగలిగే శక్తిని మన హృదయాలు కలిగి యున్నాయి. అయితే, మనం తరుచుగా మన హృదయాలలో నింపబడినటువంటి దేవుని ప్రేమను తిరస్కరిస్తున్నాము. మానవ చరిత్రయంతయూ అలాగే జరిగింది! నేటికీ అనేక చోట్ల అదే జరుగుతుంది! కాని యేసు హృదయం తిరస్కరణల వలనగాని, నిరాకరణల వలనగాని, అవమానముల వలనగాని, ప్రేమించడం మాత్రం ఆపలేదు. మనం ఎటువంటి వారమైనను, దేవుడు మనలను ప్రేమిస్తూనే ఉంటారు. క్రీస్తు ప్రక్కను బల్లెముతో పొడచినప్పుడు, యేసు హృదయం మూసుకొని పోలేదు; దానికి బదులుగా, ఆ హృదయం తెరచుకొని, దానినుండి రక్తము, నీరు ప్రవహించాయి. ఇది క్రీస్తు అనంతమైన ప్రేమకు నిదర్శనం! "సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము, నీరు స్రవించెను" అని యోహాను 19:34 లో చదువుచున్నాము. వైద్యపరముగా ఇది పెద్ద విషయం ఏమి కాకపోవచ్చు - కాని, విశ్వాసపరంగా, రక్తము, నీరు దివ్యసంస్కారములైన జ్ఞానస్నానము, దివ్యసత్ప్రసాదమును సూచిస్తున్నాయని తల్లి శ్రీసభ బోధిస్తున్నది (సత్యోపదేశం 1225). శ్రీసభ ఆవిర్భావముగా కూడా చెబుతూ ఉంటారు.

మనం కూడా ఈ అనంత ప్రేమలో భాగస్థులం కావాలి. "నేను మిమ్ము ప్రేమించినటులనే మీరును ఒకరినొకరు ప్రేమించు కొనుడు" (యోహాను 13:34; 15:13) అని యేసు తిరు హృదయం మనలను ఆహ్వానిస్తున్నది. "దేవుడు మనలను ఇంతగా ప్రేమించినచో మనము తప్పక ఒకరి యెడల ఒకరము ప్రేమగలవారమై ఉండవలెను" (1 యోహాను 4:11). యేసు తిరు హృదయ సందేశం ఇదియే: దేవుడు మనలను ప్రేమించునటుల, మనం ఇతరులను ప్రేమించాలి.

యేసు తిరు హృదయాన్ని చూసినప్పుడల్లా, మన హృదయాలు దేవుని కొరకు ప్రజ్వరిల్లాలి. దేవుని అనంతమైన ప్రేమను, కరుణను మనం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. అలాగే, ఆ తిరు హృదయానికి మనలను మనం అంకితం చేసుకోవాలి. క్రీస్తు ప్రేమలో ఐక్యమై పోవాలి.

"సాధుశీలుడననియు, వినమ్రహృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు" (మత్త 11:29) - యేసు తిరు హృదయములో ఆయన శ్రమలను, సిలువను, వినయమును, క్షమాపణను, మనపట్ల ఆయనకున్న అనంతమైన ప్రేమను మనం చూడవచ్చు. యేసు తిరు హృదయం సువార్తా సారాంశం అని చెప్పుకోవచ్చు. అందుకే ప్రభువు, "సాధుశీలుడననియు, వినమ్రహృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు" అని చెప్పారు.

తిరు హృదయం - వ్యక్తిగత అనుభూతి (అపోస్తలుడు తోమా)

"నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము" (యోహాను 20:27) - యేసు ప్రభువు తోమాతో పలికిన మాటలు. ప్రభువు ఉత్తానమైన తరువాత, ఒక గదిలో  తలుపులు మూసికొని ఉన్నటువంటి శిష్యులకు దర్శనమిచ్చారు. అప్పుడు తోమా వారితో లేకుండెను. "మేము ప్రభువును చూచితిమి" అని ఇతర శిష్యులు చెప్పినప్పుడు, తోమా విశ్వసించలేదు. "నేను ఆయన చేతులలోని చీలల గుర్తులను చూచి, అందు నా వ్రేలు పెట్టి, ఆయన ప్రక్కలో నా చేయి ఉంచిననే తప్ప విశ్వసించను" అని పలికాడు. యేసు మరల వచ్చినపుడు, తోమా సహితము వారితో ఉండెను. యేసు తోమాతో, "నీ వ్రేలు ఇక్కడ ఉంచుము. నా చేతులు చూడుము. నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము" అని పలికారు. అప్పుడు తోమా, "నా ప్రభూ! నా దేవా" అని పలికాడు. తోమా యేసు తిరు హృదయ ప్రేమను ఆ క్షణములో అనుభూతి పొందాడు కాబట్టే, "నా ప్రభూ! నా దేవా" (యోహాను 20:28) అని పలకగలిగాడు. యేసు గాయాల వెనుకనున్న లోతైన ప్రేమను గ్రహించాడు. లోక రక్షణ కొరకు గాయపడిన హృదయాన్ని తోమా చూచాడు. లోకపాపమును పరిహరించిన హృదయాన్ని తోమా చూచాడు. మానవాళి అవిశ్వాసము వలన గాయపడిన హృదయాన్ని తోమా చూచాడు. దేవునియొక్క దయను యేసు హృదయములో తోమా చూచాడు. దేవుని దయ క్షమిస్తుంది, స్వస్థపరుస్తుంది, పునరుద్ధరిస్తుంది. తోమా ఎప్పుడైతే, ఆ తిరు హృదయాన్ని చవిచూచాడో, ఆ క్షణములోనే అతడు క్షమించబడ్డాడు, స్వస్థత పొందాడు, పునరుద్ధరించ బడ్డాడు. తోమా హృదయం కూడా ప్రేమతో నిండిన హృదయముగా మారింది. అందుకే తోమా, "నా ప్రభూ! నా దేవా" అని పలికాడు. యేసు తిరు హృదయం తోమాను నిరాశనుండి విశ్వాసములోనికి నడిపించినది.

తిరు హృదయం - భక్తి, ఆరాధన

బైబిలులో ‘హృదయం’ అనే పదం దాదాపు వెయ్యిసార్లు ఉపయోగించబడింది. కొన్నిసార్లు మాత్రమే శరీరములో ఒక భాగంగా వాడబడింది. మిగతా అన్నిసార్లు, ప్రత్యేకమైన అర్థాలతో ఉపయోగించబడింది. అనగా ‘హృదయం’ సంపూర్ణ వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని, అంత:రంగాన్ని సూచించే విధంగా ఉపయోగించబడింది. యేసు తిరు హృదయాన్ని ఆరాధించడం అంటే, శరీరములో ఓ భాగమైన భౌతిక అవయవాన్ని ఆరాధించడం కాదు! హృదయం, ఆత్మ-శరీరములతో కూడిన వ్యక్తిని, అనగా సంపూర్ణ వ్యక్తిని సూచిస్తుంది. ఉదాహరణకు, "నీ సంపదలున్న చోటనే నీ హృదయముండును" (మత్త 6:21). హృదయం సంపూర్ణ వ్యక్తికి చిహ్నం. కనుక, మనం యేసు ప్రభువును ఆరాధిస్తున్నాము! యేసు తిరు హృదయ భక్తి యనగా, యేసు క్రీస్తును ఆరాధించడం మరియు యేసు క్రీస్తుపై మన ప్రేమను చాటడం, ప్రకటించడం, వ్యక్తపరచడం! మన విశ్వాసానికి మూలమైన దేవున్ని గౌరవించడం మరియు ప్రేమించడం. యేసు తిరు హృదయం దైవీక ప్రేమకు చిహ్నం!

తిరు హృదయ చిత్ర పటాన్ని మనం చూసినట్లయితే, యేసు తన పవిత్ర హృదయాన్ని మనకు బహిర్గతం చేయుచున్నారు: తన ఎడమ చేయితో ఆ హృదయాన్ని మనలను చూడమని చెబుతున్నారు. ఆ హృదయం, ముళ్లకిరీటముతోను, సిలువతోను అలంకరించ బడినది. బల్లెముతోను పొడవబడి యున్నది. హృదయముపై మండుతున్న అగ్నిజ్వాలలు మనపై ఆయనకున్న ప్రేమను చాటుతుంది. ఆ ప్రేమ వలననే మన పాపములనుండి రక్షించారు.

యేసు తిరు హృదయము పట్ల భక్తిగలవారు పొందు అనుగ్రహాలు:

- కుటుంబములో శాంతి, సమాధానాలు;
- వారి కష్టాలలో ఓదార్పు;
- జీవితములో, ముఖ్యముగా మరణావస్థలో దేవుని తోడ్పాటు;
- వారు చేపట్టు కార్యాలు సమృద్ధిగా ఆశీర్వదింప బడును;
- తిరు హృదయ పటాలను గౌరవింపబడి ప్రదేశాలను దేవుడు ఆశీర్వదిస్తారు;
- కఠిన హృదయముగలవారిని తాకుటకు గల శక్తిని గురువులకు ఇస్తారు;
- వరుసగా తొమ్మిది నెలలపాటు, మొదటి శుక్రవారాలలో దివ్యసత్ప్రసాదం స్వీకరించే వారికి, దివ్యసత్ప్రసాదం లోకొనకుండా మరణించరు;

దేవుని ప్రేమ - తండ్రి హృదయం

"దేవుడు ప్రేమ స్వరూపుడు" (1 యోహాను 4:8). తిరు హృదయం అనగా దేవుని ప్రేమ. "దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారుని ప్రసాదించెను" (యోహాను 3:16). "మనము దేవుని ప్రేమించితిమని కాదు. ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగ తన కుమారుని పంపెను. ప్రేమ యన ఇట్టిది" (1 యోహాను 4:10). "నిండు హృదయముతో వారిని ప్రేమింతును" (హోషేయ 14:4). దేవుని హృదయం తల్లి హృదయం లాంటిది. తన బిడ్డలను పోషిస్తుంది; చేతులమీద అల్లారు ముద్దుగా పెంచుతుంది; వారి అభివృద్ధిని కాంక్షిస్తుంది. దేవుడు ప్రతీక్షణం మనలను ప్రేమిస్తూ ఉన్నారు. మనం ఎటువంటివారమైనా, ఆయన ప్రేమ ఒకేలా ఉంటుంది. దేవుడు మనలను ఎప్పుడూ విస్మరింపడు. తప్పిపోయిన కుమారుని కొరకు ఎదురుచూసిన తండ్రివలె, ఆయన మన కొరకు ఎదురుచూస్తున్నారు. దైవప్రేమ పరిశుద్ధాత్మ యొక్క పవిత్రీకరణ శక్తి ద్వారా, మన ఆధ్యాత్మిక ఎదుగుదల ద్వారా, దేవునినుండి మన వైపుకు ప్రవహించును. ఎలాంటి హద్దులు, సంకోచం లేకుండా తననుతాను సంపూర్ణముగా ఒసగు ప్రేమ దేవుని ప్రేమ.

మనపై దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే, ఆయన మనలను తన పవిత్ర ప్రజలుగా, సొంత ప్రజలుగా ఎన్నుకొన్నాడు. దేవుని కనికరమును పొందాలంటే, ఆయనను ప్రేమించి, ఆయన ఆజ్ఞలను పాటించాలి. దేవుని ఆజ్ఞ ప్రేమించడం. కనుక, మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని ఎరిగిన వాడగును. దేవుని ఎవరును, ఎన్నడును చూడలేదు. మనము ఒకరి యెడల ఒకరము ప్రేమ కలవారమైనచో,  దేవుడు మనయందు ఉండును. ఆయన ప్రేమ మనయందు పరిపూర్ణమగును.

క్రీస్తు ప్రేమ

"కాపరి లేని గొర్రెల వలె చెదరి యున్న జనసమూహమును చూచి, ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను" (మత్త 9:36). "ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను. వారిని చివరి వరకు ప్రేమించెను" (యోహాను 13:1). దేవుని ప్రేమ యేసు క్రీస్తులో పరిపూర్ణమయినది. దయగల తడ్రియొక్క ప్రతిబింబం.

యేసు తిరుహృదయం కనికరముగల హృదయం. బైబిలులో ‘కనికరము’ అనగా లోతైన, హృదయంతరాలలోని భావము. ఒక తల్లి తన బిడ్డల బాధను అనుభవించగల ప్రేమ. అలాగే, దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ ఫలితం జీవము. మనము జీవించునట్లు చేయుచున్నది. ఈ విషయాన్ని లూకా 7:11-17 లో చూడవచ్చు. నాయినులో వితంతువు ఏకైక కుమారుడు మరణించినప్పుడు, ఆ తల్లిని చూచి, యేసు కనికరించి, “ఏడవ వద్ధమ్మా” అని ఓదార్చి, మరణించిన ఆ బిడ్డను జీవముతో లేపాడు.

ప్రభువు ఎల్లప్పుడూ మనలను ప్రేమతో, కనికరముతో చూస్తూ ఉంటాడు. ఆయన హృదయం కనికరమైనది. మనలోని పాపాలను, గాయాలను, ఆయనకు చూపిస్తే, వాటిని క్షమిస్తాడు. మన పాపాల వలన ఆయన హృదయం గాయపరచబడింది. కాని, మానవ హృదయంతో మనల్ని ప్రేమించాడు. మనల్ని రక్షించాడు. అందుకే ఆయన హృదయం ప్రేమకు గుర్తుగా, సంకేతంగా నిలిచింది.

యేసు తిరుహృదయం మనలను ఈవిధంగా ఆహ్వానిస్తుంది: “భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా! నా యొద్ధకు రండు. మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడననియు, వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అపుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు” (మత్త. 11:28-29). కనుక, మన హృదయాలను దేవునికి తెరుద్ధాం. తిరుహృదయానికి అంకితం చేద్దాం. దేవునితో, తోటి వారితో సఖ్యపడుదాం.

తిరుహృదయ పిలుపు

(1). కృతజ్ఞత: దేవుని ప్రేమను, యేసు తిరు హృదయాన్ని ధ్యానిస్తున్న మనం, మొట్టమొదటిగా చేయవలసినది - కృతజ్ఞతలు చెల్లించడం. దేవుని ప్రేమకు కృతజ్ఞతలు తెలుపు!  క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో మనం గ్రహింపలేము. క్రీస్తు ప్రేమను సంపూర్ణముగా ఎరుగుట అసాధ్యము (ఎఫె 3:18-19). కీర్తన 9:1 లో చదువుచున్నట్లుగా, ప్రభువును పూర్ణ హృదయంతో, కృతజ్ఞతతో స్తుతించాలి. మత్తయి 15:8 లో యేసు ప్రభువు ఇలా అన్నారు: "ఈ ప్రజలు పెదవులతో నన్ను స్తుతించు చున్నారు. కాని, వారి హృదయములు నాకు కడు దూరముగా ఉన్నవి." మనము పెదవులతో దేవుని స్తుతిస్తున్నామా? లేక హృదయములతో దేవుని ఆరాధిస్తున్నామా?

(2) ప్రార్థన: పవిత్ర హృదయముతో చేసే ప్రార్థనలను దేవుడు ఆలకిస్తాడు. ఉదా: దావీదు, నతనయేలు. "దేనిని గూర్చియు విచారింపకుడు. మీకు ఏమి అవసరమో, వాని కొరకు మీ ప్రార్థనలలో దేవుని అర్ధింపుడు. కాని, ఆవిధముగ అర్ధించునపుడు కృతజ్ఞతా పూర్వకమైన హృదయముతో ప్రార్ధింపుడు. మానవ అవగాహనను అతీతమైన దేవుని శాంతి మీ హృదయములను, మనస్సులను యేసు క్రీస్తు నందు భద్రముగ ఉంచును" (ఫిలిప్పీ 4:6-7). యేసు క్రీస్తు శాంతి, మన హృదయాలలో నెలకొనాలంటే, ప్రతీ విషయములో కృతజ్ఞతాభావముతో ప్రార్ధన చేయాలి.

"ప్రభువైన నేను హృదయమును పరిశోధించుదును" (యిర్మీయా 17:10); అనగా, మన హృదయాంతరాలను ఎరిగిన దేవుడు. యేసు నతనయేలును చూచి, "ఇదిగో! కపటములేని నిజమైన యిస్రాయేలీయుడు" (యోహాను 1:47) అని చెప్పారు.

(3). హృదయ పరివర్తన: రెండవదిగా, మనం హృదయ పరివర్తన చెందాలి. మన హృదయాలు యేసు తిరు హృదయాన్ని పోలి యుండాలి.  క్రీస్తును పోలి, ఆయనవలె జీవించాలి (1 యోహాను 2:6). "మీరు ప్రభువుకు పవిత్ర ప్రజలు. మిమ్మే తన సొంతప్రజగా ఎన్నుకొనెను. ఆయన స్వయముగా మిమ్ము ప్రేమించెను. ప్రభువు తన ఆజ్ఞలను పాటించువారిని కరుణించును" (ద్వితీ 7:6-9).

పాపులను సైతము ప్రేమించిన గొప్ప హృదయం యేసు తిరు హృదయం. మన హృదయము పవిత్రముగా లేకపోతే ఈరోజే పశ్చాత్తాప పడి దేవుని క్షమాపణ అడుగుదాం. ఆయన నమ్మదగినవాడు. యేసు క్రీస్తు రక్తముతో మనల్ని పరిశుద్ధపరచి మన హృదయములను ఆయన వాక్యముతో కడిగెదరు. దీనికి మనకు దేవుని కృప చాలా అవసరం.

"హృదయ శుద్ధి గలవారు ధన్యులు - వారు దేవుని దర్శింతురు" (మత్త 5:8). హృదయశుద్ధి అనగా పాపములేని జీవితము. పవిత్రమైన జీవితాన్ని జీవించడం; పవిత్రమైన ఉద్దేశాలను కలిగి జీవించడం; సంపూర్ణముగా దేవునికి లోబడి జీవించడం; దేవునితో సన్నిహిత సహవాసము కలిగి జీవించడం. "పవిత్ర జీవితము లేక ఎవరు ప్రభువును దర్శింపలేరు" (హెబ్రీ 12:14). 

"మీ హృదయములను కలవర పడనీయకుడు. దేవుని విశ్వసింపుడు. నన్నును విశ్వసింపుడు" (యోహాను 14:1, 27) అని యేసు క్రీస్తు చెబుతున్నారు.

తిరు హృదయం - మార్గరెట్ మేరీ అలకోక్

1675 జూన్ 16 న, ఫ్రెంచ్ దేశస్థురాలు మటకన్య అయిన మార్గరెట్ మేరీ అలకోక్, దివసత్ప్రసాదము గురించి ధ్యానిస్తూ ఉండగా, యేసు కనిపించి తన తిరు హృదయాన్ని ఆమెకు  చూపించాడు. "ఇదిగో తిరు హృదయం! మానవాళిని ఎంతగానో ప్రేమించినది, కాని, ప్రతిఫలంగా, వారినుండి కృతజ్ఞతలేమిని తప్ప మరేమియును పొందలేదు" అను సందేశమును ఆమె పొందినది. సర్వ మానవాళి పట్ల క్రీస్తు ప్రేమ నిస్వార్ధమైనది, త్యాగపూరితమైనది. క్రీస్తు ప్రేమించినట్లుగానే, మనము ఒకరినొకరం ప్రేమించాలి. మన చుట్టూ ఇన్ని బాధలు, కష్టాలు, అనారోగ్యం, ఆకలిదప్పులు, హింస, ద్వేషం, యుద్ధాలు, విభజనలు, శత్రుత్వం... ఉన్నాయంటే దానికి కారణం, మనం ఒకరినొకరం ప్రేమించుకొనక పోవడమే! 

కనుక, హృదయ పరివర్తన ఎంతో అవసరమని మార్గరెట్ మేరీ అలకోక్ తెలిపినది. ప్రేమ-సేవ భావముతో జీవించాలి. ప్రేమించే-సేవించే హృదయం మాత్రమే పవిత్ర హృదయంగా మారగలదు.

ఆత్మ పరిశీలన

మానవాళి పట్ల దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ గొప్పది, అద్భుతమైనది. కాని, మనలో చాలా మందిమి ఆ ప్రేమను తిరస్కరిస్తున్నాము. మన అవిధేయత వలన, అవిశ్వాసం వలన, హృదయ కాఠిన్యత వలన, దేవుని ప్రేమను తిరస్కరిస్తున్నాము. వాస్తవానికి, క్రీస్తు మనకోసం శ్రమలను, అవమానములను, బాధలను, మరణాన్ని అనుభవించాడు. కనుక, ఆయన ప్రేమను తెలుసుకుందాం, గ్రహించుదాం, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకుందాం. ఆయన ప్రేమ మార్గములో పయనించుదాం! యేసు తిరు హృదయము వైపునకు మన హృదయాలను త్రిప్పి, ఇకనుండైనా మంచి జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని జీవించుదాం!

వినయ, విధేయతలతో తిరుహృదయానికి అంకితం చేసుకున్నయెడల, శాంతి, ఆనందము పొందెదము. అలాగే, మన కుటుంబాలను తిరుహృదయానికి అంకితం చేద్దాం. మన సంపూర్ణ నమ్మకాన్ని ఆయనలో ఉంచుదాం. మనపై ప్రేమాగ్నితో రగిలిపోతున్న తిరుహృదయం మనలను రక్షించును, శాంతి సమాధానము ఒసగును. పరస్పరము ప్రేమ కలిగి జీవించుదాం (చదువుము. 1 యోహా. 4: 7-9). యేసు తిరుహృదయము మనలను ప్రేమించి, ఆశీర్వదించును గాక!

No comments:

Post a Comment