తపస్కాల ఐదవ వారము - సోమవారం (II)

దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
తపస్కాల ఐదవ వారము - సోమవారం
దానియేలు 13:1-9. 15-17, 19-30, 33-62 లేదా 13:41-62; యోహాను 8:12-20 

ధ్యానాంశము: జగతికి జ్యోతి
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "లోకమునకు వెలుగును నేనే. నన్ను అనుసరించు వారు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును" (యోహాను 8:12).
ధ్యానము: యేసు యెరూషలేము దేవాలయమున కోశాగారము వద్ద బోధించు చుండెను. అటుప్రక్కగనే, ప్రజలు కృత్రిమ కాంతిని యిచ్చే బంగారు దీపాలను వెలిగిస్తున్నారు. అప్పుడు ప్రభువు, "లోకమునకు నిజమైన జ్యోతిని నేనే" అని పలికారు. ఆ జ్యోతిలో మనమంతా ప్రకాశించాలి అని ప్రభువు తెలియజేయుచున్నారు. అది కృత్రిమ వెలుగు కాదు. మన ఆత్మలను వెలుగించు జ్యోతి. మనం సాధారణముగా, ఈ లోకములోనున్న ఆకర్షణలను మన వెలుగుగా చేసుకొని, వాటికి బానిసలై , అంధకారములో జీవిస్తున్నామన్న సత్యాన్ని, వాస్తవాన్ని గ్రహించలేక పోవుచున్నాము. అంధకారం మరణానికి దారితీస్తుంది. మనం నిజమైన వెలుగులో జీవించాలంటే, యేసు వెలుగు కాంతిలో మనం జీవించాలి. యేసు వెలుగు మనలను జీవానికి, నిత్యజీవితానికి నడిపిస్తుంది.

బైబులులో 'వెలుగు' ఎప్పుడుకూడా దేవుని సూచిస్తుంది. దేవుడు 'వెలుగు'ను సృష్టించారు (ఆ.కాం 1:3). "ప్రభువే నాకు దీపము" అని కీర్తన 27:1 లో చూస్తున్నాము. "పగలు త్రోవచూపు మేఘస్తంభముగా, రాత్రి వెలుగు ఇచ్చు అగ్నిస్తంభముగా ప్రభువు యిస్రాయేలీయుల ముందు నడచెను" (నిర్గ 13:21; సొ.జ్ఞాన. 18:3). "ఆయన యందు జీవము ఉండెను. ఆ జీవము మానవులకు వెలుగాయెను" (యోహాను 1:4). యెషయ ప్రవచనం ఆయన నెరవేర్చారు: "చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి. గాడాంధకారము క్రమ్మిన తావున వసించు ప్రజలమీద జ్యోతి ప్రకాశించెను" (యెషయ 9:2). "లోకమునకు వెలుగును నేనే" అని యేసు చెప్పుటవలన, తన దైవత్వాన్ని మరొకసారి బహిర్గత పరచుచున్నారు. యేసు దేవుని వెలుగు. ఆయన కాంతి మనకు జీవమునిచ్చును. ఆ వెలుగును అనుసరిస్తేనే, మనిషి బ్రతక గలడు.

మన జ్ఞానస్నానమందు, వెలుగుచున్న క్రొవ్వొత్తిని తల్లిదండ్రులకు, జ్ఞానతల్లిదండ్రులకు ఇస్తూ, గురువు, "ఈ దీపికను ఎల్లప్పుడు వెలుగుచుండనిండు. మీ బిడ్డలు క్రీస్తునాధుని వెలుగు పొందియున్నారు. వీరు ప్రకాశ పుత్రులుగా జీవింపవలెను. విశ్వాసము నందు స్థిరపడి క్రీస్తునాధుని, పునరాగమమున సకల పునీతులతో ఎదురేగి వారిని కలసి కొందురు గాక" అని చెబుతారు. కనుక, వారు క్రీస్తు బోధనలను బిడ్డలకు తెలియజేయడం ద్వారా, క్రీస్తు వెలుగును వారిలో ప్రకాశింప జేయాలి. వారి మంచి క్రైస్తవ జీవితంద్వారా, నైతిక జీవితంద్వారా, క్రీస్తు వెలుగు వారిలో ప్రకాశించాలని హృదయపూర్వకముగా వేడుకోవాలి. తద్వారా, క్రీస్తు జ్యోతితో వెలుగుచున్న వారి జీవితాలు, వారి బిడ్డలను, జ్ఞానబిడ్డలను క్రీస్తు వెలుగులో ప్రకాశింప జేస్తాయి.

కనుక, మనం క్రీస్తు వెలుగులో జీవించాలి. దేవుని వెలుగు పుత్రులముగా జీవించాలి. "మీరు అందరు వెలుగు కుమారులును, పగటి కుమారులునై వున్నారు. మనము రాత్రికిగాని, చీకటికిగాని, సంబంధించిన వారము కాము" (1 తెస్స. 5:5). "ఆయన వెలుగునందున్నట్లే మనమును వెలుగులోనే జీవించినచో, మనము అన్యోన్యమగు సహవాసము కలవారము అగుదుము" (1 యోహాను 1:7). "తన సోదరుని ప్రేమించువాడు వెలుగు నందున్నాడు. తన సహోదరును ద్వేషించువాడు అంధకారము నందు ఉన్నాడు" (1 యోహాను 2:10-11). "చీకటికి చెందిన పనులను మనము ఇక మానివేయుదము. పగటి వేళ పోరాట మొనర్చుటకు ఆయుధములు ధరించుము. వెలుతురులో జీవించు ప్రజలుగ, సత్ప్రవర్తన కలిగి యుందుము..." (రోమీ 13:12-13).

No comments:

Post a Comment