తపస్కాల నాలుగవ వారము - శనివారం (II)

దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
తపస్కాల నాలుగవ వారము - శనివారం
యిర్మియా 11:18-20; యోహాను 7:40-53 

ధ్యానాంశము: యేసును గూర్చి భేదాభిప్రాయములు
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "ఆయనవలె ఎవడును ఎన్నడును మాట్లాడ లేదు" (యోహాను 7:46).
ధ్యానము: పర్ణశాలల పండుగ చివరి రోజు. ప్రధానమైనది. యేసు యెరూషలేమునకు వచ్చినప్పటి నుండి ఆయనను బంధింప యూద నాయకులు ప్రయత్నించు చున్నారు. అయినప్పటికిని, యేసు అధికారముతో దేవాలయములో బోధించారు. చివరి రోజున, యేసు 'జీవజలము', జీవజలముల ప్రవాహముల [పవిత్రాత్మ] గురించి బోధించారు: "ఎవడైన దప్పిక కొన్నచో నా దగ్గరకు వచ్చునుగాక! నన్ను విశ్వసించువారు వచ్చి దప్పిక తీర్చుకొనును గాక. నన్ను విశ్వసించువాని అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహించును" (యోహాను 7:37-39). 

ఆయన బోధనలను విని, కొందరు "ఈయన వాస్తవముగ ప్రవక్త; క్రీస్తు" (7:40-41) అని చెప్పుకున్నారు. ఆయనను బంధించుటకై పంపబడిన (7:32) అధికారులు, బంట్రౌతులు కూడా, "ఆయనవలె ఎవడును ఎన్నడును మాట్లాడ లేదు" (7:46) అని చెప్పారు. యేసు బోధనలను విని వారు దిగ్భ్రాంతి చెందారు. అందుకే ఆయనను వారు బంధించలేదు. అయితే, అధికారులు ప్రధానార్చకులు, పరిసయ్యులు యేసును, ఆయన బోధనలను విశ్వసించలేదు. ధిక్కారముతో ప్రవర్తించారు (7:48). ఈవిధముగా, ఆయనను గూర్చి జనసమూహములో భేదాభిప్రాయములు కలిగాయి. యేసు ఒక్కరే, కాని వేరువేరు అభిప్రాయాలు, ఎందుకన, ఆయనను చూసే దృక్పధం వేరుగా ఉంది.

ప్రధానార్చకులు, పరిసయ్యులు యేసును మెస్సయ్యగా అంగీకరించక పోవడానికి ప్రధాన కారణం, మెస్సయ్య దావీదు వంశములో, బెత్లెహేము నుండి వస్తారని భావించారు. ఇది 2 సమూ 7:12-13 పై ఆధారముగా ఉన్నది. నతనయేలు కూడా, "నజరేతు [గలిలీయ ప్రాంతం] నుండి ఏదైనా మంచి రాగలదా?" (యోహాను 1:46) అని ఫిలిప్పును అడిగాడు. వాస్తవానికి యేసు, "మీరు నన్ను ఎరుగుదురా! నేను ఎక్కడనుండి వచ్చితినో మీకు తెలియునా! నేను స్వయముగా రాలేదు. నన్ను పంపినవారు సత్యస్వరూపులు. ఆయనను మీరు ఎరుగరు" (యోహాను 7:28) అని ఎలుగెత్తి చెప్పారు. అయినను, పరిసయ్యులు యేసును విశ్వసించలేదు. ఆయనను చంపడానికి ప్రయత్నాలు చేసారు.

యేసు నిజముగా సజీవ దేవుని కుమారుడు. ఆయనను విశ్వసించు వారు, దేవుని పరుశుద్దాత్మతో నింప బడుదురు. ఆయనతో సజీవులగుదురు. ఆయనను నిరాకరించువారు దేవుని తీర్పునకు, ఖండనకు గురియగుదురు. సువార్తలను చదవడం, ధ్యానించడం ద్వారా, మనం క్రీస్తును, ఆయన జీవితం, బోధనలను గూర్చి ఎక్కువగా తెలుసుకొనవచ్చు! మన విశ్వాసాన్ని బలపరచుకోవచ్చు! యేసే నా రక్షకుడని విశ్వసిస్తున్నావా? యేసు కొరకు సాక్ష్యమివ్వడానికి, ఆయన సువార్తను ప్రకటించడానికి, సత్యానికి సాక్ష్యమివ్వడానికి సిద్ధముగా ఉన్నావా? సువార్తా విలువలను పాటించడానికి, జీవించడానికి సిద్ధముగా ఉన్నావా?

No comments:

Post a Comment