దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
తపస్కాల ఐదవ వారము - మంగళవారం
సంఖ్యా 21:4-9; యోహాను 8:21-30
ధ్యానాంశము: అవిశ్వాసులకు హెచ్చరిక - క్రీస్తు దేవుని రాయబారి
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "మీరు మనుష్యకుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, స్వాధికారముతో నేను ఏమియు చేయక, తండ్రి నాకు నేర్పిన వానినే మీకు చెప్పుచున్నాననియు గ్రహింతురు" (యోహాను 8:28).
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "మీరు మనుష్యకుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, స్వాధికారముతో నేను ఏమియు చేయక, తండ్రి నాకు నేర్పిన వానినే మీకు చెప్పుచున్నాననియు గ్రహింతురు" (యోహాను 8:28).
ధ్యానము: యేసు తన తండ్రిచేత ఈ లోకమునకు పంపబడినాడని, తాను దేవుని రాయబారి అని మరోసారి స్పష్టం చేయుచున్నారు. తండ్రి దేవునితో తన సహవామును తెలియజేసారు. తాను పంపిన తండ్రికి ఎల్లప్పుడు విధేయుడై, తండ్రి చిత్తాన్ని నేరవేరుస్తున్నానని తెలిపారు. తనను పంపిన తండ్రి తనతోనే ఉన్నాడని, ఆయన తనను ఒంటరిగా విడిచిపెట్టలేదనియు, ఎప్పుడును ఆయనకు ప్రీతికరమగు పనులనే చేయుచున్నాననియు చెప్పారు (8:29). కనుక, క్రీస్తు [వాక్కు] దేవుని యొద్ద ఉండెను. క్రీస్తు దేవుని యొద్ద నుండి వచ్చెను. యేసు క్రీస్తు లోకరక్షకుడు.
కాని యూదమత నాయకులు, యేసును క్రీస్తుగా, మెసయ్యగా విశ్వసించలేదు. ఎందుకన, వారు ఈ లోకమునకు చెందినవారు. యేసు దైవదూషణ చేయుచున్నాడని నిందించారు. యేసును అంతమొందించాలని తలంచారు. పరిసయ్యులతో యేసు, "మీరు మనుష్యకుమారుని పైకెత్తినప్పుడు [సిలువ మరణం తద్వారా తండ్రి కుమారున్ని మహిమ పరచుటం] నేనే ఆయనననియు, స్వాధికారముతో నేను ఏమియు చేయక, తండ్రి నాకు నేర్పిన వానినే మీకు చెప్పుచున్నాననియు గ్రహింతురు" (యోహాను 8:28) అని చెప్పారు. "నేనే ఆయనను" [నిర్గమ 3:14] అనగా యేసు తననుతాను దేవునితో పోల్చుచున్నారు; తన దైవత్వాన్ని బహిర్గత పరచు చున్నారు. ఈ సత్యాన్ని తన సిలువ మరణం స్పష్టం చేయునని తెలుపుచున్నారు. ఈ విషయాన్ని, యేసు నికోదేముతో కూడా తెలియజేసారు: "మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్యజీవము పొందుటకు అట్లే మనుష్యకుమారుడును ఎత్త బడవలెను" (యోహాను 3:14). "నేనే ఆయనను అని విశ్వసింపని యెడల మీరు మీ పాపములలోనే మరణింతురు" (8:24) అని యేసు చెప్పారు.
మనం క్రీస్తు రాయబారులం. క్రీస్తు సువార్తను ప్రకటించుటకు పంపబడుచున్నాము. దైవరాజ్య స్థాపనకై మనమందరం కృషి చేయాలి. తండ్రి దేవున్ని ఈ లోకానికి తెలియజేయాలి. క్రీస్తునందు సంపూర్ణ విశ్వాసం కలిగి జీవించాలి. సిలువను గురించి ధ్యానించాలి. అది రక్షణకు, విముక్తికి చిహ్నముగా మారింది. మనం పాపము చెసినప్పుడెల్ల, యేసును తిరిగి సిలువ వేయుచున్నాము (హెబ్రీ 6:6) అని గ్రహించుదాం. పాపాలకు పశ్చాత్తా ప పడుదాం. దేవుని క్షమాపణ కోరుకొని, పవిత్రముగా జీవించుదాం!
No comments:
Post a Comment