తపస్కాల మూడవ వారము - బుధవారం (II)

 దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
తపస్కాల మూడవ వారము - 
బుధవారం
ద్వితీయ 4:1, 5-9; మత్త 5:17-19 

ధ్యానాంశము: పాత క్రొత్త నియమములు

ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "నేను ధర్మశాస్త్రమును, ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయ వచ్చితినని తలంప వలదు. నేను వచ్చినది వానిని సంపూర్ణ మొనర్చుటకేగాని, రద్దు చేయుటకు కాదు" (మత్త 5:17).

ధ్యానము: నేటి సువిశేషములో యేసు, "నేను ధర్మశాస్త్రమును, ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయ వచ్చితినని తలంప వలదు. నేను వచ్చినది వానిని సంపూర్ణ మొనర్చుటకేగాని, రద్దు చేయుటకు కాదు" (5:17) అని చెప్పుచున్నారు. యేసు ఈ వాక్యానికి చెప్పడానికి గల ప్రధాన కారణం, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు మరియు ఇతర యూద మతపెద్దలు, యేసు ధర్మశాస్త్రాన్ని / మోషే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడని ఆరోపించారు. 

ఇంతకు ఆ ధర్మశాస్త్రము ఏమిటి? అది సీనాయి పర్వతముపై మోషేకు దేవునిచేత ఇవ్వబడిన ధర్మశాస్త్రము / చట్టము (నిర్గమ 31:18; ద్వితీయ 4:44; 31:9; మలాకి 4:4). బైబిలులోని మొదటి ఐదు గ్రంధాలు [ఆది కాండము, నిర్గమ కాండము, లేవీయ కాండము, సంఖ్యా కాండము, ద్వితీయోపదేశ కాండము] యూదుల ధర్మశాస్త్రము. దీనిని హీబ్రూ భాషలో 'తోరా' [Tora] అని, గ్రీకులో 'పెంట-ట్యూక్' [Pentateuch] అని పిలుస్తారు. దీనిని 'మోషేచట్టం' అని కూడా పిలుస్తారు. ఈ చట్టములోనే పది ఆజ్ఞలుకూడా ఇవ్వబడినాయి. యూదులు ఈ చట్టమును దేవుని చిత్తముగా భావించేవారు. ఇశ్రాయేలీయుల నైతిక, మత, లౌకిక జీవన శైలికి ఇది మార్గదర్శకం. యేసు ఈ చట్టాన్ని పాటిస్తూనే యువకునిగా పెరిగాడు. ఈ చట్టం దేవుని ఆజ్ఞలను, నియమాలను లేదా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒసగిన జీవిత విధానాన్ని వివరిస్తుంది. అలాగే, ప్రవక్తలు దేవునిచేత ఎన్నుకొనబడినవారు; దేవుని వాక్కును ప్రజలకు ప్రబోధించారు. తన ప్రజలను ఆశీర్వదించడానికి దేవుడు చట్టాన్ని ఒసగియున్నారు.

అయితే, యేసు తరచుగా, ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులును ఖండించారు. ఎందుకన, వారు చట్టములోని పరమార్ధాన్ని విస్మరించి, ధర్మశాస్త్ర వివరణలతో [మిశ్నా = తోరా వ్యాఖ్యానము; యూదుల మౌఖిక చట్టం] మోయ సాధ్యముకాని భారములను ప్రజల భుజాలపై మోపారు (లూకా 11:46). యేసు ఎప్పుడుకూడా ధర్మశాస్త్రాన్ని గౌరవించారు. అయితే, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు సృష్టించిన వేలకొలది నియమాలను యేసు సహించలేదు. ఈ నియమాలే వారికి యేసుకు మధ్య సంఘర్షణలకు కారణం అయ్యాయి. ఈ సందర్భములో, యూద మత పెద్దలు యేసును తప్పుబట్టారు. ఆయన ధర్మశాస్త్రాన్ని తృణీకరిస్తున్నారని భావించారు. 

అందుకే, యేసు "నేను వచ్చినది వానిని సంపూర్ణ మొనర్చుటకేగాని, రద్దు చేయుటకు కాదు" (5:17) అని స్పష్టం చేయుచున్నారు. ధర్మశాస్త్రము మరియు ప్రవక్తల ప్రబోధముల ద్వారా, దేవుడు తన ప్రజలను రక్షణకై సిద్ధం చేశారు. క్రీస్తు ఈ ధర్మశాస్త్రమును మరియు ప్రవక్తల ప్రబోధములను పరిపూర్తి చేయడానికి, పరిపూర్ణం చేయడానికి మరియు సరియైన వివరణ ఇవ్వడానికి వచ్చియున్నారు. యేసు ఎక్కువగా న్యాయము, దైవప్రేమకు ప్రాముఖ్యతను ఇచ్చారు. ధర్మశాస్త్రములో పరమార్ధాన్ని తెలియజేయడానికి యేసు వచ్చారు. దైవప్రేమ-సోదరప్రేమ ఈ చట్టానికి మూలం అని తెలియజేసారు.

"ఎవరైన ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరచి, అట్లు జనులకు బోధించునో, అట్టివాడు పరలోక రాజ్యమున అత్యల్పుడుగా పరిగణింప బడును" (5:19) అని కూడా యేసు తెలియజేసారు. కనుక, ధర్మశాస్త్రాన్ని యేసు ఎప్పుడు ఉల్లంఘించలేదు. కాకపోతే, దేవుడు ఉద్దేశించిన అసలైన అర్ధాన్ని యేసు ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నం చేశారు.

దేవుని ఆజ్ఞలు చాలా ముఖ్యమైనవి. ప్రతీ ఆజ్ఞను మనం పాటించాలి. దేవుని ఆజ్ఞలలోని పరమార్ధాన్ని గ్రహించి, వాటిని మన అనుదిన జీవితములో జీవించాలి. ఇతరులకు తప్పుడు బోధనలు చేయకూడదు. మన జీవితం, ప్రవర్తన ఇతరులకు ఆదర్శం కావాలి.

ఈ క్రింది వాక్యాలను ధ్యానిద్దాం:

"నేను మీతో ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంధములలోను, కీర్తనల గ్రంధములోను, నన్ను గూర్చి వ్రాయబడిన దంతయు నెరవేరవలయునని మీతో చెప్పిన మాటలు నెరవేరినవి" (లూకా 24:44).

"మీరు నిజముగ మోషేను నమ్మియుండిన ఎడల నన్నును నమ్మి ఉండెడివారు. ఏలయన, అతడు నన్ను గురించి వ్రాసి ఉన్నాడు" (యోహాను 5:46)

"మోషే చట్టము మిమ్ములను విముక్తులను చేయలేని సకల పాపముల నుండి, యేసును విశ్వసించు ప్రతివ్యక్తియు విముక్తుడగునని తెలిసికొనుడు" (అ.కా. 13:39).

"ధర్మశాస్త్రమును చెప్పునది, దానిని అనుసరించి జీవించువారికే వర్తించునని మనకు తెలియును. అది వారు ఎట్టి సాకులను చెప్పకుండ చేసి ప్రపంచము నంతను దేవుని తీర్పునకు లోబరుచును. ఏలయన, ధర్మశాస్త్రమును పాటించుటద్వారా ఏ వ్యక్తియు దేవుని ఎదుట నీతిమంతుడు కాదు. పాపమనగా ఏమిటో మానవుడు గుర్తించునట్లు చేయుటయే ధర్మశాస్త్రము యొక్క పని" (రోమీ 3:19-20). 

"విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియై యున్నాడు" (రోమీ 10:4).

No comments:

Post a Comment