దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
తపస్కాల మూడవ వారము - గురువారం
యిర్మీయా 7:23-28; లూకా 11:14-23
ధ్యానాంశము: యేసు మరియు బెల్జబూలు / దైవము-దయ్యము
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: "నేను దేవుని ప్రభావము వలన దయ్యములను వెడలగొట్టు చున్నాను. కాబట్టి దైవరాజ్యము మీ సమీపమునకు వచ్చి యున్నది" అని యేసు పలికెను (లూకా 11:20).
ధ్యానము: నేటి సువిశేషములో యేసు, మూగ దయ్యము పట్టిన వానినుండి దయ్యమును పారద్రోలగా, ఆ వ్యక్తి మాటలాడ సాగెను. ఈవిధముగా, యేసు ఎంతోమందికి దయ్యములనుండి, సాతాను దుష్టశక్తులనుండి విడుదలను ప్రసాదించారు. యేసు స్వస్థతలు, అద్భుతాలు, దయ్యములను పారద్రోలడం చూసిన ప్రజలు కొందరు (లూకా 11:15), ముఖ్యముగా పరిసయ్యులు (మత్త 12:24), ఆయన దయ్యములకు అధిపతియగు బెల్జబూలు వలననే దయ్యములను వెడలగొట్టుచున్నాడు అని వెక్కిరించారు. దయ్యములను పారద్రోలే శక్తి, అధికారము ఎక్కడనుంచి వచ్చినదని ప్రశ్నించారు. ఆ శక్తిని దేవునికి బదులుగా, బెల్జబూలుకు ఆపాదించారు. యేసును మెస్సయ్యగా గుర్తించలేక పోయారు.
దయ్యములకు అధిపతిగా బెల్జబూలును సువార్తలలో మాత్రమే చూస్తున్నాము (మత్త 12:24; మార్కు 3:22; లూకా 11:15). పరిసయ్యుల ఆరోపణను యేసు ఖండించారు: "నేను దేవుని ప్రభావము వలన దయ్యములను వెడలగొట్టు చున్నాను. కాబట్టి దైవరాజ్యము మీ సమీపమునకు వచ్చి యున్నది" (లూకా 11:20) అని యేసు స్పష్టం చేశారు. అలాగే, వారిని ఆత్మపరిశీలన చేసుకొమ్మని చెప్పారు: "నేను బెల్జబూలు తోడ్పాటుతో దయ్యములను పారద్రోలు చున్నానని మీరు అనుచున్నారు. అటులైన మీ కుమారులు ఎవరి వలన పారద్రోలుచున్నారు?" (11:18-19) అని ప్రశ్నించారు. కనుక, ఎదుటి వారిపై వ్రేలెత్తి చూపే ముందు, మన జీవితాలను పరిశీలించు కోవాలి.
బాల్సేబూబు:
2 రాజు 1:1-18 లో, యిస్రాయేలు రాజు అహస్యా తన మెడపై వసారా నుండి [సమరియాలో] క్రిందపడి గాయపడ్డాడు. అప్పుడు ఫిలిస్తీయా దేశములోని ఎక్రోను నగరమందలి బాల్సేబూబు దేవతను సంప్రదించి తనకు ఆరోగ్యము చేకూరునో లేదో తెలుసుకొని రమ్మని దూతలను పంపెను. (1:2). బాల్సేబూబు అన్యదేవత. ఎక్రోను దేవత. చిత్రపటాలు ఈ దేవతను "ఎగిరే కీటకముగా" చిత్రీకరిస్తున్నాయి. బలుల సమయములో వచ్చే కీటకాలను పారద్రోలుటకు ప్రేరేపించబడిన దేవత అని పండితుల అభిప్రాయం. గ్రీకు భాషలో 'బాల్-జెబుబ్'గా చెప్పబడుతుంది; బాలు కననీయ దేవత; జెబుబ్ అనగా 'ఉన్నతమైన నివాసము' అని అర్ధం. ఈ రెండింటిని (బాలు + జెబుబ్) కలిపితే, "దయ్యముల అధిపతి" అనే అర్ధం వస్తుంది. బాల్సేబూబు భూతవైద్యము చేయునదిగా, సకల దయ్యములపై నియంత్రణ కలిగియున్నదని, వ్యక్తులనుకూడా ఆవహించేదని నమ్మేవారు. ఈవిధముగా, బాల్సేబూబు సాతాను దుష్టశక్తులను కలిగియున్నందున, సాతానుకు మరోపేరుగా నిలిచిపోయింది.
దయ్యమునకు లేదా సాతానుకు మరోపేరు లూసిఫెర్ అని బైబిలులో చూస్తున్నాము. లూసిఫెర్ అనగా "మిలమిల మెరయు వేగుచుక్క" అని అర్ధము (యెషయ 14:12). 'దయ్యం' అనగా 'విరోధి' అని అర్ధం. 'సాతాను' అనగా 'నిందితుడు' అని అర్ధం. పిశాచము అనేది మరొకపేరు. సాతాను సాధారణముగా సర్పము యొక్క రూపాన్ని తీసికోవడం చూస్తున్నాము (ఆ.కాం. 3; దర్శన 12).
11:16-17 - "మరికొందరు యేసును పరీక్షింపగోరి 'పరలోకమునుండి ఒక గురుతును చూపుము' అనిరి. యేసు వారి ఆలోచనలను గ్రహించి, వారితో ఇట్లనెను: 'అంత:కలహములకు గురియైన ఏ రాజ్యమైనను నాశనమగును. కలహమునకు గురియైన ఏ గృహమైనను కూలి పోవును.'" మన చుట్టూ ఉన్న ఎన్నో కుటుంబాలలో, శ్రీసభలో, సంఘములో, రాష్ట్రములో, దేశములో, ప్రపంచములో ఎన్నో విభజనలను చూస్తున్నాము. భార్యాభర్తలు విడిపోతున్నారు. ఎన్నోచోట్ల అంతర్యుద్ధాలు జరుగుచున్నాయి. ఇవి ప్రపంచ యుద్ధాలకు ముప్పుగా ఉంటున్నాయి. ఇవన్నీకూడా చిన్న చిన్న వాదనలనుండి, చిన్నపాటి వివాదాలనుండి ప్రారంభమయి, పూర్తిస్థాయి తగాదాలు, విభజనలు, యుద్ధాలుగా మార్చున్నాయి. ఇప్పటికే, ఇలాంటివి మనకు ఎంతో కీడును, హానిని, బాధను, మరణాన్నికూడా కలుగజేసాయి. యేసు ఐఖ్యత కొరకు ప్రార్ధన చేశారు. వారు ఒకరుగ ఐక్యమై ఉండనిమ్ము. వారు సంపూర్ణముగ ఐక్యమై ఉండనిమ్ము అని ప్రార్ధించారు (యోహాను 17:20-23). ఈ ఐక్యతను మనం ఎలా సాధించగలం? దేవుని ఆజ్ఞలను పాటించడం ద్వారా, ఒకరికి ఒకరు నమ్మకముగా ఉండటంద్వారా, శ్రీసభకు విధేయత కలిగి జీవించడంద్వారా, ఒకరికొకరకు సేవ చేసుకోవడం ద్వారా, ఒకరిపట్ల ఒకరం దయ, క్షమ కలిగియుండటంద్వారా ఈ ఐక్యతను సాధించగలం. ఈ ఐఖ్యత, త్రిత్వైక దేవునిలో ఐక్యమగుటకు తోడ్పడును.
11:23 - "నా పక్షమున ఉండని వాడు నాకు ప్రతికూలుడు. నాతో ప్రోగుచేయని వాడు చెదర గొట్టు వాడు." మంచి చెడులు (దైవము-దయ్యము) మధ్యన ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఈ యుద్ధములో మనం దేవుని పక్షాన ఉండాలి. ఈ యుద్ధములో ఎప్పుడు విజయం దేవునిదేనని మనం గ్రహించాలి. యేసు ఈ సైతానుచేత శోధింప బడ్డాడు (లూకా 4:1-13). సాతాను ప్రలోభాలను ప్రతిఘటించి, సాతానుపై జయించారు. హెబ్రీ 2:18 ధ్యానిద్దాం: "తాను శోధింప బడి వ్యధ నొందెను కనుక, ఇప్పుడు ఆయన శోధింప బడు వారికి సాయ పడగలడు." కనుక, మన విశ్వాసం, సాతానును జయించిన యేసునందు ఉంచాలి. ఆయనకు విధేయులమై జీవించాలి. యేసు కూడా తండ్రి దేవునికి విధేయుడైనందున శోధనలను జయించగలిగారు. అలాగే, యేసుకు లోబడి జీవించాలి. మన అంత:ర్గత జీవితాన్ని అపవిత్రం చేసే దేనినైనా మనం నాశనం చేయాలి. మనలోని సాతాను దుష్ట శక్తులను పారద్రోలి దైవ సుగుణాలను నింపుకుందాం! యేసయ్య సాతానుకన్న శక్తిగలవాడని గ్రహించుదాం. యేసు పక్షముననే ఎల్లప్పుడూ ఉందాం!
No comments:
Post a Comment